గరగ త్రినాధరావు…………………..
గత కొన్నేళ్లుగా తన రొటీన్ సినిమాలతో బోర్ కొట్టిస్తున్న రామ్ పోతినేని ఇన్నాళ్లకు ఓ అభిమాని బయోపిక్ అంటూ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాతో మన ముందుకు వచ్చాడు. హీరో రామ్ తో పాటు వరుసగా మూడు భారీ డిజాస్టర్ సినిమాలు చేసిన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా మూవీపై మరిన్ని అంచనాలు పెట్టుకుంది.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ హిట్ తర్వాత దర్శకుడు మహేష్ బాబు.పి దర్శకత్వం వహించిన చిత్రమిది.ఈ సినిమాతో మొత్తానికి రామ్ తనకిష్టమైన క్లాస్ జానర్లోకి వచ్చాడనిపించింది.హీరోల కోసం సొంత కుటుంబాలను సైతం లెక్క చేయకుండా ఆస్తులు, లక్షలకు లక్షలు ఖర్చు చేసిన అభిమానులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు.
అంతెందుకు ‘నేనింతే’ సినిమాలో పూరి జగన్నాథ్ అటువంటి అభిమాని పాత్రని మనకు ఆల్రెడీ చూపించారు. హీరో కోసం కోట్లకు కోట్లు ఓ ఫ్యాన్ ఇచ్చాడని నమ్మాలంటే… అభిమానిపై హీరో చూపించిన ప్రభావం చాలా బలంగా ఉండాలి.
హీరోపై పిచ్చిప్రేమకు చూపించిన కారణం కన్వీన్సింగ్‌గా ఉండాలి. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’లో మిస్ అయ్యిందదే ..అభిమాని కథను చెప్పాలనే దర్శకుడు మహేష్ బాబు పి ఆలోచన అభినందనీయమే. కానీ ఆ ఆలోచన కథగా మారే క్రమంలో కాస్త తడబాటు కనిపించింది. ఆయన ప్రయత్నంలో నిజాయితీ చాలా బాగుంది. కానీ కథనంలో వేగం లేదు.దాంతో సినిమాను సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.
ఐడియా పరంగా బాగుంది. కథ కూడా ఆసక్తిగానే ఉంది. ఇక బాగుండాల్సింది కథనం, ట్రీట్మెంట్. ఆద్యంతం మంచి పట్టుతో నడపగలిగే స్కోప్ ఉన్నా కూడా, కన్వీనియంట్ కథనానికే మొగ్గు చూపాడు దర్శకుడు మహేష్.స్టార్ హీరో ఉపేంద్ర సూర్య పాత్రతో తెర మీదున్న అతని ఫ్యాన్ సాగర్ తో పాటూ, ఈ చిత్రాన్ని చూస్తున్న ఆడియన్స్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యుంటే ఈ చిత్రం స్థాయి ఇంకా పెరిగేది.
అయితే ప్రీ క్లైమాక్స్ కి వచ్చేటప్పటికి ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకుల హృదయాలను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇప్పుడున్న సినీ స్టార్స్ అభిమానులు కూడా విపరీతంగా కనెక్ట్ అయిపోతారు.
ఇక నటీనటుల విషయానికొస్తే హీరో రామ్ తన రోల్ లో అద్బుతంగా నటించి మెప్పించాడనే చెప్పాలి.తన స్క్రీన్ ప్రజెన్స్ .. డైలాగ్స్ అన్నీ బాగున్నాయి.
హీరోయిన్ భాగ్య శ్రీ కూడా మెప్పించింది. ఇద్దరి పెయిర్ అద్భుతం ఒక్క మాటలో..ఇక ఉపేంద్ర తన రోల్ కి ఫుల్ న్యాయం చేశాడు. ఇక మిగిలిన యాక్టర్స్ అందరూ తమ రోల్స్ లో బాగానే నటించి మెప్పించారు. సినిమాలో మేజర్ హైలెట్ వివేక్ మెర్విన్ మ్యూజిక్ అని చెప్పాలి. పాటలు అన్నీ వినడానికి చూడటానికి బాగా మెప్పించాయి.
సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది. నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ఓవరాల్‌గా ఈ సినిమాలో రామ్ నటనతో పాటు సాంకేతిక విభాగం అందించిన మంచి పనితనం, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను, రామ్ పోతినేని అభిమానులను ఆకట్టుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..రామ్ మునుపటి చిత్రాల్లా మరీ తీసి పారేసే సినిమా అయితే కాదు..నిజాయితీగా చేసిన ఓ మంచి ప్రయత్నం..

