తాంత్రిక దేవతలు! (2)

Sharing is Caring...

Kamakhya  temple ……………………………

అస్సాం లోని కామాఖ్య దేవాలయం పురాతనమైనది.ఈ ఆలయం గౌహతి పశ్చిమ భాగంలో ఉన్న నీలాచల్ కొండపై ఉంది.ఇది తాంత్రిక ఆరాధకులకు ఇది ఒక ముఖ్యమైన యాత్రా స్థలం. 8వ శతాబ్దికి చెందిన కామాఖ్య దేవాలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు దానికి బదులు స్త్రీ జననే౦ద్రియమైన యోని ఆకారంలో రాయి ఉంటుంది.

దానిపై నుండి అనుక్షణం ప్రవహించే సహజ సిద్ధ జలధార ఉంటుంది. ఈ రాయినే అమ్మవారుగా భావించి పూజిస్తారు. అమ్మవారికి మేకలు బలి ఇస్తారు. జూన్ నెల మధ్యలో ఇక్కడ ‘’అంబు బాచి మేలా’’ఉత్సవాన్ని అమ్మవారి బహిష్టు రోజులలో జరుపుతారు.

ఈ ఉత్సవాన్ని తాంత్రిక ఉత్సవం లేక అమేతి అంటారు. ఈ ఉత్సవం లో పాల్గొనటానికి దేశం నలుమూలాల నుంచి తాంత్రిక ఉపాసకులు, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.అప్పుడు ఆలయాన్ని మూడు రోజులు మూసి ఉంచుతారు అమ్మవారికి రుతుస్నానం అయిన నాలుగవ రోజు మళ్ళీ దేవాలయ తలుపులు తెరిచి దర్శనానికి అనుమతిస్తారు.ఎర్ర బట్టలు ప్రసాదంగా అంద జేస్తారు .

ఈ ఆలయ ప్రాంగణంలో పది ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయి. ఈ పది దేవాలయాలు పది మహావిద్యలకు అంకితం చేయబడ్డాయి. కాళీ, తార, శోదషి, భువనేశ్వరి, భైరవి , చిన్నమస్తా, ధుమవతి, భగళాముఖి మాతంగి, కమల ..  వీరంతా పది మహావిద్యలకు ప్రతి రూప దేవతలని అంటారు.

దేవతలలో త్రిపురసుందరి ప్రధాన కామాఖ్యా దేవి ఆలయంలోనే షోడశి రూపంలో కొలువై ఉంటారు. మాతంగి దేవి కూడా ప్రధాన ఆలయ గర్భగుడిలోనే అంతర్భాగంగా కొలువై పూజలందుకుంటారు. లక్ష్మీ స్వరూపమైన కమలా దేవి స్థానం కూడా ప్రధాన ఆలయం లోపలే ఉంటుంది.

కాళీ ఆలయం కామాఖ్యా ప్రధాన ఆలయ సముదాయంలోనే విడిగా ఉంటుంది.తారా ఆలయం ప్రధాన ఆలయ ప్రవేశ మార్గానికి సమీపంలో ఉంటుంది.భువనేశ్వరి ఆలయం నీలాచల్ కొండల ఎత్తైన శిఖరంపై ఉంది. ఇక్కడి నుండి బ్రహ్మపుత్రా నది అందాలు కనిపిస్తాయి.

భైరవి ఆలయం ప్రధాన ఆలయానికి దక్షిణ భాగంలో కొద్దిగా కిందికి మెట్లు దిగి వెళ్తే కనిపిస్తుంది. ఛిన్నమస్తా ఆలయం కామాఖ్యా గుడికి వెళ్లే దారిలోనే ఉంటుంది. ధూమావతి ఆలయం ప్రధాన ఆలయ ప్రాంగణానికి వెనుక వైపు ఒక సందు గుండా మెట్లు దిగితే కనిపిస్తుంది. బగలాముఖి ఆలయం భువనేశ్వరి దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉంటుంది.  

కామాఖ్య ఆలయం దశాబ్దాలుగా చేతబడికి ప్రసిద్ధి చెందింది. చేతబడిని తొలగించడానికి .. అరికట్టడానికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ పూజలను ఆలయ ప్రాంగణంలో సాధువులు, అఘోరాలు చేస్తారు.

సాధారణ భక్తుల దర్శనాలు ముగిసిన తర్వాత, ఆలయ తలుపులు మూసివేసిన రాత్రి వేళల్లో తాంత్రికులు, అఘోరాలు ఆలయ ప్రాంగణంలో రహస్యంగా తమ సాధనలు,హోమాలు చేస్తారు. ప్రధాన ఆలయంతో పాటు చుట్టుపక్కల ఉన్న దశమహావిద్యల ఆలయాలు, నీలాచల్ కొండల్లోని శ్మశాన వాటికలు, గుహలు తాంత్రిక సాధనలకు ముఖ్య వేదికలు.

ఈ పూజలో చేతబడికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడే ఆచారాలు ఉంటాయి.దెయ్యాలను తరిమికొట్టడానికి పూజలు కూడా జరుగుతాయి. ఈ తాంత్రికులు చేసే పూజలు వారి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను వదిలించుకోవడానికి సహాయపడతాయి.

ముఖ్యంగా అంబుబాచి మేళా సమయంలో వేలాది మంది తాంత్రికులు ఆలయాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ కనపడని ఏదో శక్తి ప్రాణం పోసుకుంటుందని చెబుతారు. ఈ తాంత్రికులు  అవసరమైన వారికి సహాయం చేస్తుంటారు.ఇక్కడ వశీకరణ తెలిసిన తాంత్రికులు కూడా ఉంటారు.మంచి పనుల కోసం వశీకరణ మంత్రాలూ ప్రయోగిస్తుంటారు.

శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటి, సతీ దేవతకు అంకితం చేయబడిన ఆలయం. సతీ దేవి శరీర భాగాలు ఇక్కడ పడ్డాయని భక్తులు నమ్ముతారు. నీలాచల్ శైలిలో నిర్మితమైన ఈ ఆలయ సముదాయం అస్సాం కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

పురాణాలను ఆధ్యాత్మిక చిహ్నాలను వర్ణించే శిల్పాలు యాత్రీకులను ఆకట్టుకుంటాయి.నవరాత్రి, కార్తీక పూర్ణిమ, ఇతర పండుగలు ఉత్సాహంగా నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు.గౌహతి రైల్వే స్టేషన్ నుంచి బస్సు ,టాక్సీ ,ఆటో లలో కామాఖ్య ఆలయం కు చేరుకోవచ్చు.
దాదాపు గా అన్ని రైళ్లు కామాఖ్య స్టేషన్ లో ఆగుతాయి.అక్కడ దిగి ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు . హోటల్ సదుపాయాలు ఉన్నాయి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!