Melody Maharaj………………………………
ఇళయ రాజా .. ఈ పేరు వినని వారు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. సంగీతం గురించి అంతగా తెలియని వారు కూడా ఇళయరాజా పాటలు అంటే చెవి కోసుకుంటారు. ఆయనో స్వర మాంత్రికుడు. ఆయన స్వరాలు మంత్రముగ్దులను చేసి మనల్ని మరొక లోకంలోకి తీసుకెళతాయి. రాజా స్వరాలు వేసవిలో శీతల పవనాలు…ఆయన బాణీలు జానపద జావళీల జలపాతాలు. అమృత జల ధారల గలగలలు. ఆయన సినీ సంగీత సామ్రాజ్యానికి రారాజు..
‘కథగా.. కల్పనగా’ అంటూ హృదయాలను మెలిపెట్టే స్వరాలు .. ఓపాప లాలీ .. అంటూ మనసును తాకే బాణీలు కూర్చడం రాజా కే చెల్లు.. ఒకటా రెండా వేల పాటలకు అద్భుత స్వరాలు అందించిన ఖ్యాతి ఇళయరాజాది. తన సంగీత మాధుర్యంతో ప్రేక్షకులను పరవశింపచేసిన మ్యూజికల్ మ్యాస్ట్రో .. నిరంతర సంగీత ప్రవాహం.
ఆయన సినీప్రస్థానం ప్రారంభించి యాభై ఏళ్లు అవుతోంది. ఇళయరాజా అందించిన పాత పాటలు కూడా ఇప్పటికి తాజా పరిమళాలు వెదజల్లుతుంటాయి. దక్షిణ తమిళనాడు తేని జిల్లా పన్నైపురంలో 1943 జూన్ 2న.. రామస్వామి, చిన తాయమ్మ దంపతులకు ఇళయరాజా జన్మించారు. ఆయన అసలు పేరు జ్ఞాన దేశికన్. ఇద్దరు సోదరులు ఆర్డీ భాస్కర్, గంగై అమరన్. పెద్దనాన్న కుమారుడు పావలార్ వరదరాజన్లతో జ్ఞానదేశికన్ బాల్యం హాయిగా గడిచింది. ఆయన ట్రూప్ లో చేరి పాటలు పాడుతుండేవాడు.
తండ్రి తేయాకు తోటలో చిరుద్యోగి, తల్లి పొలం పనులు చేసేది. అమ్మతో పొలం పనులకు వెళితే.. అక్కడ ఆమె పాడే జానపద గీతాలు జ్ఞానదేశికన్లో స్ఫూర్తిని .. శక్తిని నింపాయి . కొడుకు సంగీతంపై చూపిస్తున్న శ్రద్ధను .. మక్కువ ను గమనించిన ఆ తల్లి ఓ పాత హార్మోనియం పెట్టె ను రాజాకు కొనిపెట్టింది. అదే అతగాడిని ఓ సంగీత సామ్రాట్టు గా మారుస్తుందని అప్పట్లో ఆ తల్లి అపుడు ఊహించి ఉండరు.
ఇళయరాజా స్వరాలు సమకూర్చిన తమిళ చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యేయి. అవన్నీ తెలుగులో డబ్ కావడం..ఆసినిమాలో పాటలు కూడా ప్రేక్షకుల మెప్పు పొందడంతో ఎవరీ ఇళయరాజా అని నిర్మాతలు,దర్శకులు ఆరా తీశారు. ప్రముఖ దర్శకుడు బాలచందర్ డైరెక్ట్ చేసిన సింధు భైరవి సినిమాకు ఇళయ రాజా సంగీతం అందించారు. అందులో సుహాసిని కీలక పాత్రలో నటించారు. ఆసినిమా లోని “నేనొక సింధు” … “పాడలేను” అనే పాటలు రాజా ప్రతిభకు మచ్చుతునకలు.
తమిళంలో ఇళయ రాజా స్వరాలు అందించిన మొదటి సినిమా అన్నక్కలి కాగా భద్రకాళి తొలి తెలుగు సినిమా. అక్కడ నుంచి ఇళయ రాజా ఇటు తెలుగు లోను తమిళ్ లోను బిజీ అయ్యారు. నిర్మాతలు ఆయన బాణీల కోసం క్యూ కట్టారు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు.అభినందన సినిమాలో “ప్రేమ ఎంత మధురం” పాట భగ్నప్రేమికులకు ఇష్టమైన పాట. ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ . ఇప్పటికి ఎక్కడో ఒక చోట వినిపిస్తుంటుంది. అలాగే అదే సినిమాలో మరోపాట ” ఎదుట నీవే ఎదలోన నీవే” పాట కూడా అప్పట్లో పెద్ద హిట్.
మొదట్లో కొత్త దర్శకులు ,కొత్త నిర్మాతలు ఇళయరాజా చే పాటలు చేయించుకునే వారు. ఇళయరాజా పాపులారిటీ దశదిశలా వ్యాపించడం తో దిగ్దర్శకులు బాపు ,కె.విశ్వనాధ్ ,కె. రాఘవేంద్రరావులు కూడా ఇళయరాజాను తమ సినిమాలకు బుక్ చేసుకున్నారు. కె. విశ్వనాథ్ ఎక్కువగా మహదేవన్ అంటే ఇష్టపడేవారు. ఆయన కూడా సాగర సంగమం సినిమాకు ఇళయరాజా ను తీసుకున్నారు. ఆ సినిమాలో పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
సాగర సంగమం లో ‘నరుడి బతుకు నటన .. ఈశ్వరుడి తలపు ఘటన’ …. ‘వేదం అణువణువునా నాదం’ పాటలు ఆ సినిమా కు ఎంతో బలాన్ని ఇచ్చాయి. ఆ సినిమా ఆడియో క్యాసెట్స్ కూడా అప్పట్లో పెద్ద ఎత్తున అమ్ముడు పోయాయి.
ఇక రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఆఖరిపోరాటం సినిమాలో పాటలు కూడా హిట్ అయ్యాయి. తెల్లచీరకు తక ధిమి తపనలు , అబ్బ దీని సోకు సంపంగి రేకు … అంటుకుంటె షాకు … నన్నంటుకోకు పాటలకు రాఘవేంద్రుడి స్టైల్ కి అనుగుణంగా ట్యూన్స్ రాజా అందించారు. ఇక జగదేకవీరుడు .. అతిలోక సుందరి సినిమాలో ‘అబ్బా నీ కమ్మని దెబ్బ’ పాట అప్పట్లో ప్రేక్షకులను ఓ ఊపు ఊపింది.
ఇక ప్రముఖ దర్శకుడు బాపు కూడా శ్రీ రామ రాజ్యం సినిమాకు ఇళయ రాజానే ఎంచుకున్నారు. లవకుశ సినిమా పాటలకు ధీటుగా రామరాజ్యం పాటలకు రాజా మధుర స్వరాలను అందించారు. “రామాయణం … శ్రీ రామాయణం ” “దేవుళ్ళే మెచ్చింది” పాటలు జనం లోకి బాగా వెళ్లాయి. అలా తెలుగులో కూడా ఎన్నో పాటలకు సుస్వరాలు అందించిన ఖ్యాతి ఆయనది.
సన్నివేశం ఏదైనా.. సందర్భం ఎలాంటిదైనా.. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆయన సంగీతామృతంలో తెలిపోతాడు. నటులతో పనిలేదు.. దర్శకుడెవరో అవసరం లేదు.. సినిమా ఎలా ఉందొ అంతకంటే అక్కరలేదు. ఆ స్వరరాజు సంగీతం ఉందా చాలు. ఒక్కసారన్నా ఆ సినిమా చూడాల్సిందే. ఈ కేటగిరి అభిమానులు కూడా ఆయనకు ఉన్నారు.