కాశీలో దెయ్యం కథ !!

Sharing is Caring...

Bharadwaja Rangavajhala………………………………..

అనగనగా ….  ఓ ఊళ్లో ఓ శాస్త్రిగారికి ముగ్గురు కొడుకులు. ఆయన పిల్లలందరికీ విద్యాబుద్దులు సమానంగానే నేర్పాడు. అయితే ఆఖరు కొడుకును శాస్త్రిగారూ ఆయన భార్యా కూడా విపరీతంగా గారాబం చేయడం వల్ల వాడు క్లాసు వినకుండా తోటల వెంటా కాలువల వెంటా తిరిగి ఏ వేళో ఇంటికొచ్చి ఇంత తినేసి పడుకుని మళ్లీ పొద్దున్నే వీధిన పడేవాడు. అన్నలు మాత్రం బాగా చదువుకుని హాయిగా మంచి కొలువులు సంపాదించుకుని పెళ్లాడేసి కాపురాలు చేసుకుంటూండేవారు.

చివరి వాడు మాత్రం జులాయిగా తిరుగుతూ కాలక్షేపం చేస్తూనే యుక్తవయసులోకి కూడా ప్రవేశించేశాడు. శాస్త్రిగారు తప్పు తెలుసుకుని రెండు మూడు సార్లు మందలించబోయారుగానీ భార్య అడ్డు పడడంతో ఆగిపోవాల్సి వచ్చేది.
ఇలా కాలం గుడుస్తూ ఉండగా … ఓ నాడు అనుకోకుండా శాస్త్రిగారు కన్నుమూశారు. ఆ తర్వాత కొలది కాలానికే శాస్త్రిగారి భార్య కూడా ఉత్తమలోకాలను చేరింది.

ఇంట్లో వదినల రాజ్యం మొదలయ్యింది. జులాయి మరిదిని వారు ఆదరణగా చూడ్డం మానేశారు. పైగా ఈ మరిది ప్రభావం పడి తమ పిల్లలు ఎక్కడ చెడిపోతారో అన్నట్టు వ్యవహరించేవారు.భోజనం కూడా ముందే కంచంలో పెట్టేసి దొడ్డి వసారాలో పడేసేవాళ్లు. మరిది మొదట్లో సర్దుకుపోయినా … నెమ్మదిగా తన పరిస్థితి అర్ధం కావడం మొదలైంది. అన్నలతో మాట్లాడే ప్రయత్నం చేశాడుగానీ వాళ్లు ఇతన్ని వినిపించుకున్న పాపాన పోలేదు.

ఏదో అలా పడుండు .. ఇంకేం చేస్తాం నువ్వా ఏవీ చదువుకోలేదు మరి .. అది మా తప్పు కాదుగదా అనేసేవారు.
ఆ రోజులు కూడా వెళ్లిపోయి అడిగితే తప్ప అన్నం పెట్టని రోజులొచ్చేశాయి. పైగా ఏమిటి మనకీ అదనపు లగేజీ అన్నట్టు చూసేవారు. ఇలా ఉండగా … ఓ రోజు … చిన్నోడు ఇంటికి రాలేదు.ఊరి చివర అడవిలో ఉండిపోయాడు. తెల్లారింది. తనతో ఆడుకున్న ఫ్రెండ్సు కూడా ఎవరూ వీడ్ని పట్టించుకోలేదు. ఆ రోజంతా అక్కడే ఏవో కాయలూ అవీ కోసుకుతినేసి ఏటి నీళ్లు తాగేసి కాలక్షేపం చేశాడు.

ఎవరూ తనని వెతక్కుంటూ రావడంగానీ తన గురించి మాట్లాడుకోవడం గానీ జరగలేదు. మూడో రోజు సాయంత్రం ఇంటికెళ్లాడు. చిన్న వదిన అప్పుడే అరుగుమీద నుంచీ లేచి ఇంట్లోకి పోతూ ఈ కుర్రాణ్ణి చూసీ చూడనట్టుగా లోపలికి పోయి తలుపేసుకుంది. చిన్నోడు ఇక ఆగలేదు. గిర్రున వెనక్కి తిరిగి ఊరును దాటి అడవిని దాటి అలా నడుస్తూ పోతూనే ఉన్నాడు. దారిలో పొద్దుపోతే ఎవరో ఒకరి అరుగుమీద పడుకోవడం … వాళ్లేదైనా పెడితే తినడం మళ్లీ ముందుకు నడవడం. అతని లక్ష్యం ఒక్కటే ఎలాగైనా కాశీనగరం చేరుకోవాలి. అక్కడ ఓ యోగ్యుడైన గురువును పట్టుకుని సకల శాస్త్రాలూ అభ్యసించాలి. అన్నలతో ధీటైన పండితుడు అనిపించుకోవాలి.

అప్పుడే ఊరికి తిరిగి రావాలి …ఇదొక్కటే అతన్ని నడిపిస్తోంది. ఇలా నడుస్తూ కొద్ది రోజులకు కాశీ నగరం చేరుకున్నాడు.
చిన్నోడు కాశీ నగరం చేరేసరికి బాగా పొద్దుపోయింది. ఓ సందులోంచీ తను నడుస్తున్నాడు. వీధంతా నిర్మానుష్యంగా ఉంది. ఒక్క ఇంట్లో మాత్రం దీపాలు వెలుగుతున్నాయి. ఆ ఇంటి ముదు అరుగు మీద ఓ ఘనాపాటి కూర్చుని ఉన్నాడు.
ఆయన తెల్లగా పసిమి ఛాయతో మెరిసిపోతున్నాడు. ఆయన చుట్టూ కాంతి వలయం ఏర్పడి ఉంది. పట్టు వస్త్రాలు ధరించి శుచిగా ఉన్నారాయన. ఆయన ముందు నిలబడి … అయ్యా … నాకు తినడానికేమైనా పెడతారా? అని అడిగారు చిన్నోడు.

పెడతానుగానీ నువ్వెవరు? ఏం పని మీద ఇక్కడ తిరుగుతున్నావు చెప్తేనే అన్నారు ఘనాపాటి. చిన్నోడు తన కథంతా చెప్పేశాడు. చెప్పి మీరీ రాత్రికి ఆశ్రయం ఇస్తే తెల్లారాక ఊళ్లోకెళ్లి ఏదో ఒక గురువును పట్టుకుని ఆయనకు శుశ్రూషలు చేసుకుంటూ విద్యలన్నియూ నేర్చుకుని మా అన్నలంతటివాడిని అవుతాను అని కోరాడు. ఘనాపాటి నవ్వి వేరే గురువెందుకు … నేనే నీకు అన్నీ నేర్పుతాను. నువ్వు నాకే శుశ్రూషలూ చేయక్కరలేదు కూడాను. అయితే ఒక్క మాటగానీ ఇస్తివా నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తాను అన్నారాయన. ఏమిటా మాట గురువుగారూ … తప్పక ఇస్తాను .. నిస్సంకోచంగా సెలవియ్యండి అన్నాడు మనోడు.

ఏంలేదు నాయనా నువ్వు విద్య నేర్చుకున్నంత కాలం ఈ ఇంట్లోంచీ బయటకు కదలకూడదు. నీ భోజనము నిద్ర చదువు అంతా లోపలే. ఈ గుమ్మం దాటి బయటకు వెళ్లకూడదు. దీనికి నువ్వు అంగీకరిస్తే ఈ క్షణమే నిన్ను నా శిష్యుడుగా స్వీకరిస్తాను అని వివరించారు ఘనాపాటి. చిన్నోడు సరి అని వాగ్దానం చేశాడు. విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు గడప దాటి బయటకు వెళ్లను అంటాడు. మర్నాటి ఉదయం నుంచే చదువు మొదలైపోయింది.

ఆ ఇంట్లో గురువుగారు శిష్యుడు తప్ప ఇంకెవరూ కనిపించేవారే కాదు. వంట కూడా ఎవరో చేసి పట్టుకొచ్చినట్టు గా ఏర్పాటై ఉండేది. చాలా రుచిగా ఉండేది. ఇలా తింటూ చదుకుంటూ ఏళ్లు గడిచిపోతున్నాయి. చిన్నోడు సకల శాస్త్రాల్లోనూ ఆరితేరిపోయాడు.గురువుగారు మధ్య మధ్యలో కనిపించకుండా పోయేవారు. ఒక్కోసారి మంచం మీద పడుకుందామని శిష్యుడు వెడితే అందుమీద చెయ్యి వేసిన మరుక్షణం గురువుగారు నిద్రపోతూ ప్రత్యక్షమయ్యేవారు. అదంతా యోగ విద్యలే అని సర్దుకునేవాడు మనోడు. ఇలా కాలం గడిచి చిన్నోడి చదువు క్లైమాక్సుకు చేరింది.

ఇక రేపే ఎల్లుండో చదువు పూర్తై పోతుందనుకుంటున్న దశలో గురువుగారు కనిపించడం మానేశారు. కాశీ వచ్చి ఇంతకాలం అయింది. ఒక్కరోజు కూడా బయటకు పోలేదు. ఇప్పుడు చదువుకోడానికి ఏమీ లేదు కనుక ఒక్కసారి బయటకు వెళ్లొద్దామంటే ఈయన కనబడడేమిటని తనలో తానే గొణుక్కోసాగాడు. ఇక లాభం లేదని సాయంత్రం అడుగు బయట పెట్టాడు. నెమ్మదిగా నడుచుకుంటూ ఊరంతా తిరిగేశాడు. ఇలా తిరుగుతూండగా … ఓ విజ్ఞాన మందిరం కనిపించింది. అక్కడ ఏదో శాస్త్ర విషయమై వాదోపవాదాలు జరుగుతున్నాయి.

మనోడు అసంకల్పితంగానే ఆ చర్చలో వేలు పెట్టాడు. క్రమంగా పండిత చర్చలో మనోడిదే పైచేయి అవుతోంది.
అందరూ ఆశ్చర్యపోతున్నారు.కానీ …. సభలో ఓ మూలగా కూర్చుని గమనిస్తున్న ఓ వృద్దుడు మాత్రం తీక్షణంగా మనవాణ్ణి గమనిస్తున్నాడు. అంతిమంగా చర్చలో చిన్నోడే గెల్చినట్టుగా ప్రకటించింది వారణాసి పండిత లోకం. ఆ సందర్భంగా చిన్నోడిని సన్మానించదల్చుకుని … అయ్యా ఇంత అద్భుతంగా వాదించారు. అందరి నోళ్లూ మూయించారు.

ఇంత విజ్ఞాన ఖనిని ఈ మధ్య కాలంలో చూడలేదు. తమరి గురువు ఎవరో సెలవిస్తారా? అని అడిగారు పండిత సభాధ్యక్షులు. ఫలానా ఘనాపాటి అని సమాధానం చెప్పాడు చిన్నోడు. అంతే సభంతా అల్లకల్లోలం అయిపోయింది. అందరూ హాహాకారాలు చేస్తూ బయటకు పారిపోయారు. కానీ ఇందాకటి నుంచీ గమనిస్తున్న వృద్దుడు మాత్రం నెమ్మదిగా చిన్నోడి వైపు వస్తూంటాడు. మనోడు ఆశ్చర్యంతో అలా శిలలా నిలబడిపోయి ఉన్నాడు. వృద్దుడు నెమ్మదిగా చిన్నోడి దగ్గరకు వచ్చి … బాబూ … నువ్వు ఎప్పట్నంచీ ఆయన దగ్గర చదువుకు కుదిరావు అని అడిగారు.

అయ్యా … నేను దాదాపు పదేళ్లుగా ఆయన దగ్గర చదువు నేర్చుకుంటున్నాను అన్నాడు. ఆ వృద్దుడు నవ్వి పిచ్చివాడా నీ గురువు చచ్చిపోయి ముప్పై ఏళ్లైంది తెల్సా? అన్నాడు. దీంతో మనోడు ఖంగారు పడిపోయాడు. అప్పుడు వృద్దుడు మాట్లాడడం ప్రారంభించాడు. నీకు చదువు చెప్పిన ఘనాపాటిగారిని మించిన పండితుడు ఈ పట్టీన లేడు. విద్య చేత వినయం రావాలి కానీ ఆయనకు గర్వం వచ్చింది. తన తర్వాత తనంత పండితుడు ఉండకూడదనే స్వార్ర చింతనతో తన పిల్లలకు కూడా విద్య నేర్పలేదు.

ఎవరినీ శిష్యులుగా అంగీకరించలేదు. చివరకు అలాగే చనిపోయాడు. ఆ తర్వాత ఓ రోజు రాత్రి ఎవరో తలుపు కొడుతున్నట్టనిపించి వాళ్లావిడ వెళ్లి తీసి చూస్తే … ఎదురుగా ఘనాపాఠి. ఆవిడ మూర్ఛపోయింది. కొంతకాలం అదే ఇంట్లో పెళ్లాం, పిల్లలతో కలసి ఉండేవాడు. ఆయన తిధి రోజు మాత్రం ఇంట్లో కనిపించేవాడు కాదు. ఈ లోగా ఘనాపాటి విషయం ఆనోటా ఈ నోటా అందరికీ తెలియడంతో ఆ సందు సందంతా ఇళ్లు ఖాళీ చేసేశారు. ఘనాపాటి కుటుంబం కూడా ఈ పడమర వైపు వీధిలోకి మారిపోయింది. అదీ కథ అని ఆ ముసలాయన వెళ్లిపోయాడు..

చిన్నోడు ఆలోచనలో పడ్డాడు. తిరిగి ఆ దెయ్యం దగ్గరకు వెళ్లడమా? లేక ఇట్నుంచీ ఇటే తన ఊరు పారిపోవడమా అనుకున్నాడు. గురువు ఎటూ దెయ్యం అని తేలిపోయింది కనుక తన అజ పట్టుకోవడం ఆయనకు పెద్ద కష్టం కాదు.
కనుక బుద్దిగా గురువు దగ్గరకే వెళ్లి ఈ రెండు రోజులూ గడిపేసి వెళ్లిపోవడమే మేలు అనుకున్నాడు. నెమ్మదిగా భయం భయంగా నడచుకుంటూ గురువు ఇంటికి చేరాడు. గురువు గుమ్మంలోనే ఎదురుచూస్తూ కనిపించారు. ఏవయ్యా ఏంటి కొత్తగా భయపడుతున్నావ్ అన్నారు గురువుగారు నవ్వుతూ … శిష్యుడేం మాట్లాడలేదు.

నాకు తెలుసులేవయ్యా … నా గురించి నీకంతా తెలిసిపోయింది కదా … ఏం పర్లేదు. నిన్ను నా అంతటి పండితుడుగా తీర్చిదిద్దాను … నాకంతే చాలు అన్నారు నవ్వుతూ … నేను ఈ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ది పొందిన పండితుణ్ణి. అయితే నా విద్య ఎవరికీ నేర్పలేదు. కారణం నా అంత వాడు మరొకడు ఉండకూడదని. నా పిల్లలకు కూడా నేర్పలేదు. ఇంతలో కాలం తీరి కన్నుమూశాను. తీరా పైకెళ్తే … అక్కడ స్వర్గద్వారం దగ్గర ప్రవేశం లేదనేశారు. కారణం అడిగితే నువ్వు నీ విద్య ఎవరికీ నేర్పకుండా వచ్చావు. కనుక నీకు పరలోక ప్రవేశం లేదు. ఇప్పటికైనా కిందకి వెళ్లి ఓ శిష్యుడ్ని సంపాదించి నీకు తెల్సినదంతా వాడికి నేర్పి వస్తేనే నీకు ప్రవేశము అని సెలవిచ్చారు పరలోక గేటు దగ్గరున్న గుమాస్తాగారు.

దీంతో తిరిగొచ్చి నా పిల్లల్ని బతిమాలాను. నా దగ్గర చదువుకోండిరా అని వాళ్లు కుదరదనేశారు. మరి అప్పట్నించీ వెతుకుతుంటే చివరకి నువ్వు దొరికావన్నమాట.. ఉంటాను మరి ఏ క్షణంలో అయినా అంటూ ఉండగానే ఓ పెద్ద వెలుగు వచ్చి గురువు మాయమై పోయారు. గురువు మాయమైపోగానే ఆ ఇల్లు పాడుపడిన ఇల్లులా మారిపోయింది. ఆ సందంతా చెట్లతో గందరగోళంగా మారిపోయింది. చిన్నోడు అతి కష్టం మీద అక్కడ నుంచీ బయటపడి ఇంటికి చేరుకున్నాడు. అబ్బాయిలూ అదీ కథ.

అందుచేత చదువు చెప్పడం అనేది గురువుకు చాలా అవసరం. ఏ విద్యైనా పక్కవాడికి చెప్పేస్తేనే అది పెరిగేది. తనలో దాచుకుంటే నరకంలోకి కూడా ఎంట్రీ దొరకదని అర్ధమయ్యింది కదా అని ముగించారు పరతంతు మహర్షి.

(ఈ ఘనాపాఠి కథ స్తానాపతి రుక్మిణమ్మ రాసిన దయ్యాలు కథాసంపుటిలోనిది…)

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!