గాంధీ హత్యకు కుట్ర పన్నిన వాళ్లలో తెలుగోడు !

Sharing is Caring...

సుమ పమిడిఘంటం……………………………………………..

గాంధీ ని ఎవరు హత్య చేశారు అన్న విషయం నిజంగా ఇప్పుడు అవసరం లేదు. కానీ గాంధీని హత్య చేసేందుకు కుట్ర పన్నిన వారిలో శంకర కిష్టయ్య అనే తెలుగు వాడొకడున్నాడనేది ఆశ్చర్యపరిచే అంశం. ఇతగాడికి యావజ్జేవ శిక్ష కూడా పడింది. జనవరి ౩౦ వ తేదీకి పదిరోజుల ముందు నాధూరాం గాడ్సే బృందం హత్యకు ఒక ప్రయత్నం చేసింది.

ఢిల్లీలో జనవరి 20వ తేదీన బిర్లాహౌస్ లో ప్రసంగ వేదిక వెనుక సర్వెంట్సు క్వార్టర్సు నుంచి గాంధీజీ ని కాల్చే పని దిగంబర్ బడ్గే అనే అతనికి అప్పగించారు. తీరా వెళ్ళేసరికి అతగాడికి గుమ్మంవద్ద ఒంటికంటి మనిషి ఒకతను కనిపించాడు. అది అపశకునమని భావించి గిరుక్కున అతను వెనుదిరిగి వచ్చాడు.(సాంప్రదాయ వాదులకు హత్య చేయడానికి కూడా శకునాలుంటాయి గాబోలు)

ఆ తర్వాత  కిటికిలోనుంచి బాంబు విసిరే పని గోపాలరావు గాడ్సేకు (ఇతను గాంధీని హత్యచేసిన గాడ్సే సోదరుడు)అప్పగించారు. కిటికీ బాగా ఎత్తుగా వుండటంతో అతను ఆపని చేయలేకపోయాడు. ఇంతలో మదన్ లాల్ అనే అతను హడావుడిగా బాంబు పేల్చి పట్టు బడ్డాడు. మదన్ లాల్ నుంచి ఈకుట్రలో భాగస్తులు ఏడుగురి పేర్లు,వివరాలు, చిరునామాలు పోలీసు వారు తెలుసుకున్నారు గానీ హత్యను నిరోధించ లేకపోయారు.

ఇక ఫైనల్ గా నాధూరాం గాడ్సే స్వయంగా రంగంలోకి దిగాడు. అది … 1948, జనవరి 30…సాయంత్రం వేళ ..ఢిల్లీలో ఒక ప్రార్థనా సమావేశానికి మహాత్మాగాంధీ కొంచెం ఆలస్యంగా వచ్చారు. అప్పటికే సమయం కోసం ఎదురుచూస్తున్న నాథూరామ్ వినాయక్ గాడ్సే గాంధీని అక్కడే పాయింట్ బ్లాంక్‌లో తుపాకీతో కాల్చారు.

గాడ్సే మితవాద ‘హిందూ మహాసభ’ సంస్థలో సభ్యుడు. హిందూ మహాసభలో చేరడానికి ముందు గాడ్సే ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’ (ఆర్ఎస్ఎస్)లో సభ్యుడిగా ఉండేవారు.ముస్లింలకు అనుకూలంగా, పాకిస్తాన్ పట్ల సున్నితంగా వ్యవహరిస్తూ గాంధీ హిందువులకు ద్రోహం చేశారని హిందూమహాసభ అంతకుముందు ఆరోపణలు చేసింది.  దేశ విభజన సమయంలో రక్తపాతానికి కూడా గాంధీనే కారణమని నిందించింది.

గాంధీ హత్య జరిగిన ఏడాది పిదప ట్రయల్ కోర్టు గాడ్సేకి మరణశిక్ష విధించింది. ఈ తీర్పును హైకోర్టు కూడా అంగీకరించడంతో 1949 నవంబర్‌లో గాడ్సేను ఉరితీశారు.ఈ కుట్రలో గాడ్సేకు తోడుగా నిల్చిన నారాయణ్ ఆప్టేకి కూడా మరణశిక్ష విధించారు. మరో ఐదుగురికి జీవిత ఖైదు శిక్ష విధించారు.

ముందే చెప్పినట్టు  మదన్ లాల్ నుంచి సేకరించిన సమాచారం మేరకు కుట్రలో భాగస్తులు .. 1)నాథూరామ్ గాడ్సే 2) నారాయణ్ ఆప్టే 3) విష్ణుకర్కరే 4) గోపాల్ గాడ్సే 5) మదన్ లాల్ పహ్వా 6) దిగంబర్ బడ్గే 7)శంకర్ కిష్టయ్య. వీరిలో దిగంబర్ బడ్గే ఆయుధ వ్యాపారి. అతని వద్ద పనిచేసిన తెలుగువాడు శంకర్ కిష్టయ్య.కాగా వినాయక్ దామోదర్ సావర్కర్ అనే వ్యక్తి ని పోలీసులు విచారించి వదిలేశారు.  
(కల్లూరి భాస్కరం గారు రాసిన “మహాభారతం మన చరిత్రే” కొన్ని అంశాల ఆధారంగా )

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!