ఆచార్య దేవా ..ఏమంటివి.. ఏమంటివి ?

Sharing is Caring...

Dvs Karna…………………………..

“ఆగాగు……….ఆచార్య దేవ..  ఏమంటివి? ఏమంటివి ? జాతి నెపమున సూత సుతున కిందు నిలువ అర్హత లేదందువా ..ఎంత మాట ఎంత మాట . ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ! కాదు కాకూడదు ఇది కులపరీక్షయే అందువా ? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ?? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది ??

మట్టి కుండలో పుట్టితివికదా ! నీది ఏ కులము?ఇంతయేల అస్మతపితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా !ఈయన దే కులము ?? నాతో చెప్పింతువేమయ్యా…..మా వంశమునకు మూలపుర్షుడైన వశిష్టుడు దేవ వేశ్యయగు ఊర్వశీపుత్రుడు కాడా ??

ఆతడు పంచమజాతి కన్యయగు అరుంధతి యందు శక్తిని ఆశక్తి చండాలాంగాన యందు పరాశరుని .. ఆ పరాశరుడు పల్లెపడుచు..మత్యగంధియందు మా తాత వ్యాసుని .. ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పిన పితామహి అంబాలికతో ..మా పినతండ్రి పాండురాజును… మా ఇంటిదాసితో ధర్మనిర్మానజనుడని… మీచే కీర్తింపబడుచున్నఈ విదురదేవుని కనలేదా??

సందర్భావసరములనుబట్టి క్షేత్ర బీజ ప్రాదాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది, కాగా నేడు కులము కులము అను వ్యర్ధవాదములెందుకు?” ఈ సుదీర్ఘమైన డైలాగు సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ నటించి .. నిర్మించి … దర్శకత్వం వహించిన ‘దానవీరశూర కర్ణ’ సినిమా లోది అని చెప్పనక్కర్లేదు.

ఈ సినిమా విడుదలై 45 ఏళ్ళుఅవుతోంది. ఈ సినిమా ఎన్నోరికార్డులు బద్దలు కొట్టింది. కేవలం 43 రోజుల్లో షూటింగ్ ముగించి ఎన్టీఆర్ అప్పట్లో రికార్డు సృష్టించారు. సినిమా నిడివి కూడా నాలుగు గంటల పైనే ఉంటుంది. అయినా సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. మహాభారత గాథలో కీలకమైన ఘట్టాలను గుదిగుచ్చి కృష్ణ, దుర్యోధన, కర్ణ పాత్రల్లో నటించి ఎన్టీఆర్ ఈ సినిమా తీశారు.

అప్పట్లోనే ‘దానవీరశూర కర్ణ’ చిత్రం కోటి రూపాయలు పైగా వసూలు చేసింది.ఎన్టీఆర్ ఈ సినిమాకు పెట్టిన ఖర్చు10 లక్షలు మాత్రమే అంటారు. అప్పటి వసూళ్లను ఇప్పటి లెక్కలకు వర్తించి చూస్తే దాదాపు రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసినట్టు అంటారు ట్రేడ్ పండితులు.1963 నాటి ‘లవకుశ’ తరువాత కోటి రూపాయలు వసూలు చేసిన సినిమా గా ‘దానవీరశూర కర్ణ’ చరిత్ర సృష్టించింది.

1994లో రెండో మారు రిలీజ్ అయినపుడు కూడా కోటి రూపాయలు వసూలు చేయడం ఇంకో రికార్డు. ఇలా సెకండ్ రిలీజ్ లో కూడా భారీ వసూళ్లను రాబట్టిన మరో సినిమా లేదు. అది కూడా ఒక రికార్డ్. 1960లో ఇండియా మొత్తం రిలీజైన ‘మొఘల్-ఏ-ఆజమ్’ కోటి రూపాయలు పైగా వసూలు చేసింది. కానీ ‘దానవీరశూర కర్ణ’ కేవలం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని కొన్ని కేంద్రాలలో ప్రదర్శితమై కోటి వసూలు చేయడం కూడా రికార్డు అని చెప్పుకోవాలి.

అప్పట్లో ‘దానవీరశూర కర్ణ’ డైలాగులతో కూడిన ఆడియో రికార్డులు కూడా పెద్ద ఎత్తున అమ్ముడు బోయాయి. మరే చిత్రానికీ ఆ స్థాయిలో డైలాగ్ క్యాసెట్స్ అమ్మిన చరిత్ర లేదు. 1977 లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘దానవీరశూర కర్ణ’ పోటీ చిత్రాలను పూర్తిగా పక్కకు నెట్టేసి దూసుకుపోయింది. హీరో కృష్ణ తీసిన కురుక్షేత్రం సినిమా కర్ణ ముందు నిలబడలేకపోయింది. కురుక్షేత్రం లో నటించిన నటులు ఎన్టీఆర్ కర్ణలో కూడా నటించారు.

మూడు పాత్రల్లో ఏ పాత్ర కా పాత్ర కు ప్రత్యేకమైన అభినయంతో ప్రేక్షకులను ఎన్టీఆర్ మంత్ర ముగ్దులను చేశారు. 1986- 87 ప్రాంతంలో భారతీయ సంస్కృతి పై అధ్యయనం చేయడానికి వచ్చిన రష్యాకి చెందిన సాంస్కృతిక బృందం దానవీర శూరకర్ణ ను చూసి ఈ మూడు పాత్రలను చేసిన నటుడు ఎన్టీఆరే అంటే నమ్మలేక పోయారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ వెరైటీగా  దుర్యోధనుడికి.. భార్య భానుమతికి డ్యూయెట్ సాంగ్ పెట్టి విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచారు.

కొండవీటి వేంకటకవి రాసిన డైలాగులు ఇప్పటికి అక్కడక్కడా వినబడుతుంటాయి. సుయోధనుడికి రాసిన సుదీర్ఘమైన డైలాగులను ఎన్టీఆర్ అవలీలగా డిఫరెంట్ మాడ్యులేషన్ లో చెప్పి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇక పద్యాల సంగతి చెప్పనక్కర్లేదు. శ్రీకృష్ణ రాయబారం పద్యాల హక్కులు ఎన్టీఆర్ దగ్గర ఉన్నాయి. శ్రీకృష్ణావతారం(1967) సినిమా కు ముందే చెళ్ళపిళ్ళ వెంకటకవులు రాసిన పద్యాల హక్కులు ఎన్టీఆర్ కొన్నారు. కర్ణ కు అవే ప్లస్ అయ్యాయి. కురుక్షేత్రం లో ఆ పద్యాలు లేకపోవడం మైనస్ అయింది.

———-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!