Bharadwaja Rangavajhala ………………………….
ఘంటసాల… ఈ పేరు వినగానే తెలుగువారి మనసు ఉప్పొంగుతుంది.ఆ కంఠం మూగబోయి ఐదు దశాబ్దాలైనా…ఇప్పటికీ తెలుగు సినిమా ప్రేక్షకులు ఆ సమ్మోహనం నుంచి బైటకు రాలేని పరిస్ధితి. ఎప్పటికీ రాలేకపోవచ్చు.కృష్ణాజిల్లా చౌటపల్లి గ్రామంలో వందేళ్ల క్రితం పుట్టిన ఘంటసాల చిన్నతనంలోనే భజనగీతాలు పాడుతూ సంగీత ప్రపంచంలోకి కాలుపెట్టారు.
ఆ తర్వాత విజయనగరం సంగీత కళాశాల నుంచి సంగీతంలో సర్టిఫికెట్ సంపాదించారు. పట్రాయని సీతా రామశాస్త్రిగారి దగ్గర శాస్త్రీయ సంగీతపు మెలకువలు నేర్చుకున్నారు.సముద్రాల రాఘవాచార్యులు సాయంతో ముందు ఆకాశవాణిలోనూ తర్వాత సినిమా సంగీత ప్రపంచంలోనూ ప్రవేశించారు. స్వర్గసీమ చిత్రం కోసం భానుమతితో కల్సి తన తొలిపాట పాడారు ఘంటసాల.
ఆకాశవాణి బాలాంత్రపు రజనీకాంతరావు కూడా ఘంటసాలను సినిమాల్లోకి ప్రోత్సహించిన వారిలో ఉన్నారు. స్వర్గసీమ తర్వాత ఘంటసాల వెనక్కితిరిగి చూడలేదు.పాట పాడినప్పటికీ ఘంటసాల దృష్టి సంగీత దర్శకత్వం మీద ఉండేది.అక్కినేని తొలినాటి చిత్రాలు బాలరాజు,కీలుగుర్రంలతో పాటు… ఎన్.టి.ఆర్ నటించిన తొలి చిత్రం మనదేశంలకు ఘంటసాలే సంగీత దర్శకత్వం వహించారు. కీలుగుర్రం చిత్రంలో కాదు సుమా కల కాదు సుమా పాటతో నేపధ్యగాయకుడుగా పాపులర్ అయ్యారు.
నిజానికి అక్కినేనికి పాట నేర్పించే క్రమంలో నిర్మాతగారు విని … నువ్వే పాడేయకూడదా? అనడంతో పాడేశారు. అలా జనం పాడుకునే పాటలను స్వరపరచడంలో సిద్దహస్తుడు ఘంటసాల అనిపించుకున్నారు. ఘంటసాలది ప్రత్యేక బాణీ. జనం పాడుకునేలా సినిమా పాట ఉండాలనేది ఆయన నిశ్చితాభిప్రాయం. అలాగని శాస్త్రీయ సంగీతపు పునాదులను ఎన్నడూ వీడలేదు. ఆ పరిధిలోనే జనం నాలుకల మీద పదికాలాల పాటు నిల్చిపోయే పాటలు కంపోజ్ చేశారు.
హిందూస్తానీ రాగాలనూ సినిమా పాటల కోసం విరివిగా వాడారు ఘంటశాల. ఘంటసాల సంగీతం అందించిన విజయావారి చంద్రహారంలో హిందూస్తానీ రాగేశ్వరి లో ఓ పాట కంపోజ్ చేశారు. ఇది నా చెలి ఇది నాసఖి…అంటూ సాగే పింగళి వారి గీతం ఎత్తుగడ వింటుంటే…ఎంత కాదనుకున్నా…పాతాళబైరవి ఎంత ఘాటు ప్రేమయో తో పాటు సారంగధర పాట కూడా గుర్తొచ్చి తీరుతుంది. కావాలంటే మీరూ చూడండి.
తెలుగు సినిమా తొలి తరం మాస్ హీరోలు అక్కినేని, నందమూరిలతో పాటే సినిమా ప్రవేశం చేశారు ఘంటసాల. ఇద్దరికీ ఘంటసాల ప్లేబ్యాక్ పాడితేనే జనం వింటారు అనేంతగా పాడారు. నటుడి నట ధర్మాన్ని ఆకళింపు చేసుకుని పాడితే చాలు…ప్రేక్షకులు ఆ నటుడే పాడుతున్న అనుభూతి పొందుతారనేవారు ఘంటసాల. ప్లేబ్యాక్ సింగింగ్ కు ఆయన ఒరవడి తీర్చారు అనేది ఇందుకే. గాత్రంతో నటించడం ఆయన ప్రత్యేకత. ప్లేబ్యాక్ సింగర్ కు ఉండాల్సిన మొదటి లక్షణం గాత్రంతో నటించగలగడం … అలా పాడేస్తే నటుడి పని సులువైపోదూ?
ఘంటసాల చిన్నతనంలో స్టేజ్ పెర్ఫామెన్స్ ఇచ్చేవారు. అలా ఆయనలో నటుడు… కవి ఉన్నారు.బహుదూరపు బాటసారి పాట ఆయన రాసినదే. సంగీత దర్శకుడు ఉన్నాడు. ఈ త్రివేణీ సంగమం ఆయనతో అద్భుతాలు చేయించింది.కవి భావాన్ని, పాత్ర స్వభావాన్ని అర్ధం చేసుకుని…పాత్రలో లీనమై గాత్రంతో నటించేవారాయన.
అందుకే తెర మీద ఆ పాటలు ఆ నటుడే పాడుతున్నట్టుగా ప్రతిఫలించేవి. ఇదే ఆయన సక్సస్ మంత్రా … ఈ రోజుకీ మన మనసులతో ఆ గానం వీడని బంధం వేసుకుని పెనవేసుకుపోడానికి అదే కారణం. సందర్భాన్ని బట్టి స్వరాలు అందించినా … డ్యూయట్లు చేసేప్పుడు మెలోడీకి అధిక ప్రాథాన్యత ఇచ్చేవారు ఘంటసాల. బందిపోటు చిత్రం కోసం సుమనేశ రంజని రాగంలో ఓ ట్యూన్ చేశారు ఘంటసాల.
దర్శకుడు విఠలాచార్య అబ్బే బీటేది…హిట్టు కావాలి కదా…అన్నారు. అవుతుంది…అంతే కాదు…పదికాలాల పాటు నిలచిపోతుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పారు ఘంటసాల. ఆ పాట ఇప్పటికీ మన చెవుల్లో గుస గుసలాడుతూనే ఉంది.
ఘంటసాల తెలుగు సినిమా నేపధ్య సంగీతానికి గ్లామర్ తీసుకు రావడంతో పాటు కొత్త గ్రామర్ నిర్దేశించారు. ముఖ్యంగా పద్యాలు పాడడంలో ఆయన కొత్త బాణీని తీసుకువచ్చారు. పౌరాణిక చిత్రాలు విస్తృతంగా వస్తున్న సందర్భం అది. స్టేజ్ పద్యాలు యధాతథంగా సినిమాల్లోనూ ఆలపించేవారు. ఘంటసాల పద్యంలో భావానికి ప్రాధాన్యత ఇచ్చి…ఆలాపనలను కుదించి…కొత్త సొగసు తీర్చారు.