Great Dancer ………………………………….
ప్రముఖ నటి,నర్తకి శోభన భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారిణులలో ఒకరు.ప్రస్తుతం శోభన నాట్యరంగానికే పరిమితమయ్యారు. భరత నాట్యంలో ఆమె దిట్ట. ఎందరో కళాకారిణులకు శోభన నాట్యంలో శిక్షణ ఇస్తున్నారు.1994లో ఆమె కళార్పణ అనే సంస్థను ప్రారంభించింది.భరతనాట్యం పట్ల ఆసక్తి గలవారికి శిక్షణ ఇవ్వడం .. దేశమంతటా నృత్యప్రదర్శనలు ఇవ్వడం ఈ సంస్థ లక్ష్యం.
ఇప్పటికే కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చింది. శోభన అసలు పేరు శోభన చంద్రకుమార్ పిళ్ళై. బహుభాషా నటిగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీషు సినిమాల్లో తన సత్తా చాటుకున్నశోభన నర్తకిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది.
శోభన వ్యక్తిగత జీవితం గురించి ఎవరితో షేర్ చేసుకోరు. పబ్లిసిటీ అన్నా అంత మోజులేదు. 51 ఏళ్ళ శోభన ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఓ అయిదేళ్ల క్రితం అనంత నారాయణి అనే పాపను దత్తత తీసుకుంది. పెళ్లి చేసుకుంటేనే సంతోషం గా ఉంటామన్న వాదనతో శోభన ఏకీభవించదు. జీవిత పరమార్ధం పెళ్లి మాత్రమే కాదు అంటుంది.
శోభన పెళ్లి చేసుకోకపోవడానికి ప్రేమ వైఫల్యమే అన్న ఊహాగానాలు ప్రచారం లో ఉన్నాయి. ఒక మలయాళీ నటుడిని ఆమె ప్రేమించింది అంటారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఆ ఇద్దరూ దూరమయ్యారని అంటారు. ఆ నటుడు తన కుటుంబానికి నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకుని వైవాహిక జీవితాన్ని గడుపుతుండగా శోభన మాత్రం అవివాహిత గానే ఉండిపోయారని మలయాళీ పత్రికల కథనం.
శోభన ఒకప్పటి ప్రముఖ నటీమణులు లలిత, పద్మిని రాగిణిలకు మేనకోడలు అవుతుంది. చంద్రముఖి సినిమాకు మూలమైన మలయాళ “మణి చిత్ర తాళు” లో గంగ పాత్రను శోభన పోషించింది. ఆ పాత్రకు శోభన నూరు శాతం న్యాయం చేసింది. తన అసమాన నటనతో ఆకట్టుకున్నశోభన సినిమా ఘనవిజయం సాధించడంలో కీలకపాత్ర పోషించింది. జాతీయ స్థాయిలో ఆమెకు ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది. మిత్ర మై ఫ్రండ్ కు జాతీయ అవార్డు అందుకున్నది. 2006 లో ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
కేరళలో పుట్టినా, తెలుగు చిత్రసీమలోకూడా శోభన రాణించింది.రెండేళ్ళ ప్రాయంలో రాజేశ్ ఖన్నా ‘అమర్ ప్రేమ్’ లో ఓ సీన్ లో అలా కొన్ని క్షణాలు మాత్రమే తెరపై కనిపించింది శోభన. ఆ తరువాత పన్నెండేళ్ళ వయసులో నటి భానుమతీ రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘భక్త ధ్రువ మార్కండేయ’ లో శోభన నటించింది. ఆ తరువాత నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్’తోనే శోభన కూడా నాయికగా తెలుగువారికి పరిచయమయ్యారు.
చిరంజీవి సొంత సినిమా ‘రుద్రవీణ’లో శోభన నాయికగా నటించారు. ఆ సినిమా అవార్డులు దక్కించుకుంది. ఇక ‘రౌడీ అల్లుడు లో కూడా చిరంజీవితో నటించారు. బాలకృష్ణ సరసన శోభన నటించిన “మువ్వగోపాలుడు, నారీ నారీ నడుమ మురారి” చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా పేరు గాంచాయి.’వెంకటేశ్ జోడీగా “అజేయుడు, త్రిమూర్తులు” చిత్రాలలో నటించారు. మోహన్ బాబు సరసన నటించిన “అల్లుడుగారు, రౌడీగారి పెళ్ళాం” సినిమాలు జనాన్ని మురిపించాయి. వీరితోనే కాకుండా హీరో కృష్ణ, రాజేంద్రప్రసాద్, భానుచందర్, కార్తీక్ వంటి వారితోనూ శోభన నటించి మెప్పించారు.
దాదాపుగా 200 పైగా చిత్రాల్లో నటించిన శోభన క్రమంగా సినిమాలు తగ్గించేసింది. 2006 లో మోహన్ బాబు ‘గేమ్’ సినిమా తర్వాత శోభన… 2013 విడుదలైన ‘తీరా’ మలయాళ చిత్రంలో నటించారు. తర్వాత ఆమె 2020 లో ‘వరనే అవశ్యముండ్’ సినిమా లో ఒంటరి తల్లి పాత్రను పోషించింది. ఇక ఆ తర్వాత సినిమాల్లో నటించలేదు.
ప్రస్తుతం శిష్యురాళ్ళకు డాన్స్ నేర్పిస్తూ … వాటి తాలూకు వీడియోలను యూట్యూబ్ లో పెడుతున్నారు. కళారాధనకే జీవితం అంకితం చేశారు.