తాను ఇక శాసనసభకి రానని.. సీఎం అయిన తరువాతనే వస్తానంటూ టీడీపీ అధినేత..ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ప్రకటన పై పార్టీ వర్గాల్లో చర్చజరుగుతోంది. బాబు ప్రకటన వ్యూహాత్మకమా ? ఉద్వేగంలో తీసుకున్నారా ? ఈ నిర్ణయం వలన సానుభూతి వస్తుందా ? వచ్చినా ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ప్రయోజనం ఏమిటి ? అని పార్టీ నేతలు చర్చిస్తున్నారు.
బాబు అనూహ్య నిర్ణయం తీసుకుని పార్టీ వర్గాలకు షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉంది. మరి అప్పటివరకు సభలో పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తారు ? అందరిని ఎవరు కలుపుకుపోతారనేది ఇపుడు కీలకం కానుంది. బాబు తొందరపడ్డారేమో అని కూడా పార్టీ నాయకులు కొంతమంది భావిస్తున్నారు.
స్థానిక సంస్థల్లో వరుస ఓటములు ఎదురుకావడం బాధాకరమైనప్పటికీ.. అవన్నీ బాబుకి కొత్తేమి కావు. విమర్శలు కూడా బాబుకి కొత్త కాదు. పార్టీ వేదికపై మాట్లాడం వేరు .. అసెంబ్లీ లో మాట్లాడటం .. ఎమ్మెల్యేలకు మార్గదర్శనం చేయడం వేరు. బాబు ప్రత్యక్షంగా రంగంలో లేకపోతే ఆ లోటు వేరేగా ఉంటుందని పార్టీ నేతలు అంటున్నారు. బాబు అంత ఉద్వేగానికి ఎందుకు గురయ్యారనేది ఎవరికి అర్ధం కావడం లేదు. ఈ పరిణామాలు ఎటు వైపు దారితీస్తాయా అని సీనియర్ నేతలు మధన పడుతున్నారు.
కాగా రెండున్నరేళ్లుగా ప్రభుత్వం తనను వేధిస్తోందని..తన కుటుంబ సభ్యుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తోందంటూ బాబు ఆవేదన వ్యక్తం చేస్తూ తన నిర్ణయం సభా ముఖంగా తెలియజేశారు. సభలో మాట్లాడుతూ బాబు తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. ఒక దశలో కంట తడి పెట్టారు. తనను ఏమన్నా భరించానని చెప్పుకొచ్చారు. అంతకుముందు అంతకు ముందు సభలో వ్యవసాయం పైన చర్చ జరిగింది.
ఈ సందర్భంగానే హెరిటేజ్ మీదకు చర్చ మళ్లింది. అపుడు చంద్రబాబు మాట్లాడే ప్రయత్నం చేసారు.వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతుండగా.. టీడీపీ ఎమ్మెల్యేలు బాబాయి గొడ్డలి అంటూ కేకలు వేశారు. దానిపై స్పందించిన అంబటి రాంబాబు హత్యల గురించి చెప్పుకోవాలంటే వంగవీటి రంగా.. ఎలిమినేటి మాధవరెడ్డి హత్యల గురించి మాట్లాడాలన్నారు . ఆ సమయంలో చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.
ఆ వెంటనే సభ నుంచి వెళ్లి .. మళ్ళీ వచ్చి సభలో తన సతీమణి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. “ఈ సభలో 78 నుంచి హేమాహేమీలతో కలిసి పని చేశాను. జాతీయ స్థాయిలో ఇంకా పెద్ద నేతలతో పని చేశాను. గత రెండున్నరేళ్ల కాలంలో ఎన్నో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నాం. ప్రజలకోసం ఇన్నేళ్లూ ఎన్నో అవమానాలు భరించాను.
ప్రజల కోసం పోరాడాం. బాధాకర సందర్భాలున్నాయి. అధికారంలోనూ, ప్రతిపక్షంలోనూ ఇలాంటి అవమానాలను తానెప్పుడూ చూడలేద”ని ఉద్వేగ పూరితంగా మాట్లాడారు. సీఎం అయ్యే వరకూ కాలు పెట్టనంటూ.. రెండు చేతులు జోడిస్తూ సభ నుంచి నిష్క్రమించారు.
తొలుత బయటకు వెళ్లిన చంద్రబాబు లోకేష్ ,యనమలతో చర్చించి తన నిర్ణయం సభలో ప్రకటించారు.
చంద్రబాబు చేసిన ప్రకటనపై మంత్రులు స్పందించారు. చంద్రబాబు మైక్ లేకుండా జగన్ కుటుంబ సభ్యుల గురించి వ్యాఖ్యలు చేసారని..వాటిని పరిశీలించాలని మంత్రి అప్పలరాజు స్పీకర్ ను కోరారు.
మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందని చెప్పుకొచ్చారు. గతంలో జయలలిత.. ఏపీలో జగన్ ఇదే విధంగా శాసనసభ నుంచి వెళ్లి సీఎంలు అయ్యారని గుర్తు చేసారు. చంద్రబాబు క్షణికావేశంలో నిర్ణయం తీసుకోరని.. కేవలం సానుభూతి కోసమే ఈ రకంగా చేస్తున్నారంటూ నానీ విమర్శించారు.తన ఇంటి మహిళలను తానే అల్లరి చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.