హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రసవత్తరంగా జరుగుతున్న పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. మొదట్లో కొంత డల్ గా ఉన్న తెరాస బాగా పుంజుకుంది. తెరాస కు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం కాబట్టి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈటల కూడా తన గెలుపు పై నమ్మకంతో ఉన్నారు.
గతంలో తెరాస లో కీలకంగా పనిచేసిన నేతలు ఆ పార్టీని వదిలి బీజేపీలో చేరి ఉపఎన్నికల్లో విజయం సాధించారు. యెన్నం శ్రీనివాసరెడ్డి, రఘునందన్ రావులు ఆ కోవలో వారే. అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేదా అనేది చెప్పలేం. బీజేపీ నేతలు మటుకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ఆశిస్తున్నారు. కాంగ్రెస్ కు గెలుపు పై నమ్మకాలు లేవు.
ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభానికి కేవలం కొద్ది గంటలే మిగిలాయి.ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఎన్నికను రద్దుచేసి ..మళ్ళీ నిర్వహించాలని ఈసీకి లేఖ రాశారు. హుజూరాబాద్‌లో ఒక్కో ఓటుకు రూ.10వేల వరకు పంపిణీ చేస్తున్నారు. చీరలు, వంట పాత్రలు, స్పోర్ట్స్ కిట్లు, గడియారాలు, బంగారు, వెండి ఆభరణాలు అందజేస్తూ ఓటర్లను పలువిధాలుగా ప్రలోభ పెడుతున్నారు. ఎక్కడా చూసినా మద్యం ప్రియులకు కిట్లు అందిస్తున్నారు.
ఈ క్రమంలో ఎన్నిక నిష్పాక్షికం గా జరిగే అవకాశాలు లేవు కాబట్టి ఉప ఎన్నికను రద్దు చేయాలనీ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.తెరాస .. బీజేపీ పార్టీలు అడుగడుగునా అధికార దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.
ఉప ఎన్నిక పోరు క్లైమాక్స్‌కు చేరుకున్నక్రమంలో కాంగ్రెస్ ఆరోపణలపై ఎన్నికల కమీషన్ ఉపఎన్నిక ను రద్దు చేస్తుందని భావించలేం. ఎవరైనా బరిలో ఉన్న అభ్యర్థులు చనిపోయినపుడు మాత్రమే ఎన్నికను రద్దు చేసే సంప్రదాయం ఉంది. ఇలా ఒకపార్టీ ఆరోపణలను ఆధారం చేసుకుని ఎన్నికను రద్దు చేస్తారా అనేది సందేహమే.
కాకపోతే చివరి గంటల్లో పార్టీలు ఓటర్లను ప్రలోభానికి గురిచేయకండా గట్టి చర్యలు తీసుకోమని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయవచ్చు. ఇలా ఒకపార్టీ డిమాండ్ ను అనుసరించి ఉప ఎన్నికను రద్దు చేస్తే అదొక సంప్రదాయంగా మారే అవకాశాలున్నాయి. నిన్ననే ఇవే ఆరోపణలపై ఈ సి స్పందించి పరిశీలకులు ,, అధికారులతో సమావేశం నిర్వహించింది. పోలింగ్ విషయంలో కఠినంగా మార్గదర్శకసూత్రాల మేరకు కఠినంగా వ్యవహరించాలని ఈ సి ఆదేశించింది.