మోడీ దృష్టికి హనుమ జన్మస్థల వివాదం !

Sharing is Caring...

Becoming a big controversy……………………………………………..హనుమంతుని జన్మస్థలంపై నెలకొన్న వివాదం ఇంకా సమసి పోలేదు. ఈ వివాదాన్ని కిష్కింద హనుమద్ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ అంత తేలికగా వదలడానికి సుముఖంగా లేదు. కర్ణాటక ఎంపీల సహాయంతో ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నది. కొప్పల్ బీజేపీ ఎంపీ సంగన్న తో ట్రస్ట్ సభ్యులు చర్చిస్తున్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులను కలవాలని భావిస్తున్నారు.అంజనాద్రి బెట్ట ను హనుమ జన్మస్థలంగా అధికారికం గా ప్రకటించాలని డిమాండ్ చేయనున్నారు. ప్రధాని మోడీ , యూపీ సీఎం యోగి అంజనాద్రి బెట్ట గురించి ఎన్నికల ప్రసంగాలలో మాట్లాడిన విషయాన్నికూడా ట్రస్ట్ సభ్యులు ఉదహరిస్తున్నారు. అయోధ్య లో రామాలయం  తీరులోనే అంజనాద్రి బెట్టను అభివృద్ధి చేయడానికి కర్ణాటక సర్కార్ కూడా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసి పర్యాటక కేంద్రంగా మార్చడానికి మాస్టర్ ప్లాన్స్ సిద్ధం చేసింది. ఇంతలోనే వివాదం నెలకొన్నది. 

కొద్దీ రోజులక్రితం తిరుపతిలో జరిగిన చర్చలో టీటీడీ తిరుమలే హనుమంతుడి జన్మస్థలమని వాదించింది. కానీ కర్ణాటకలోని కిష్కింద హనుమద్ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి మాత్రం టీటీడీ వాదన తప్పుల తడకని తేల్చిచెప్పారు.పండితులపై ఒత్తిడి తెచ్చి తిరుమలను హనుమ జన్మస్థలంగా టీటీడీ ప్రకటించిందని గోవిందానంద సరస్వతి ఆరోపిస్తున్నారు. టీటీడీ విడుదల చేసిన పుస్తకం అసంపూర్ణ జ్ఞానంతో ఉందని … అన్ని తప్పులే అని ఆయన వాదన. శంకర,రామానుజ,మధ్వ పీఠాధిపతుల సమక్షంలో ఈఅంశంపై చర్చజరగాలని గోవిందానంద డిమాండ్ చేశారు. తిరుమల పెద్ద జీయర్ కు గౌరవం ఇవ్వకుండా, సంప్రదించకుండా, ఏకపక్షంగా టీటీడీ ప్రకటించడం సమంజసం కాదని ఆయన అంటున్నారు.

ఇప్పటికైనా తప్పుఅంగీకరించాలని టీటీడీ కి సూచించారు. దేశవ్యాప్తంగా చర్చజరిగి తుది నిర్ణయం తీసుకునే వరకు హనుమ జన్మస్థలం తిరుమల అంటే తమకు అంగీకారం కాదని గోవిందానంద సరస్వతి స్పష్టంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే గోవిందానంద సరస్వతి  రామాయణమే ప్రమాణమని వితండవాదం చేశారని పండిత కమిటీ సభ్యులు చెబుతున్నారు.  ఉత్తరకాండలో ఎక్కడా  హంపీ ప్రస్తావన లేదని పండిత కమిటీ చైర్మన్,రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వీసీ ఆచార్య మురళీధర శర్మ అంటున్నారు. గోవిందానంద వ్యవహార శైలి సన్యాసిలా లేదని … కొన్నేళ్ల క్రితం షిరిడి సాయిబాబా పైనా ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారని చెబుతున్నారు. మొత్తం మీద ఈ వివాదం ఇప్పట్లో తేలే సూచనలు కనిపించడం లేదు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!