Action spy thriller………..
దళపతి విజయ్ ద్విపాత్రాభినయం (తండ్రి, కొడుకులుగా) చేసిన ‘ది గోట్’ (The Greatest of All Time – 2024) ఒక హై-వోల్టేజ్ యాక్షన్ స్పై థ్రిల్లర్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ₹450 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి వాణిజ్యపరంగా విజయం సాధించింది.
కథ ఏమిటంటే ?
గాంధీ (విజయ్) భారత దేశానికి చెందిన ‘స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్’ (SATS) లో అత్యంత సమర్థవంతమైన ఏజెంట్. తన సహచరులు సునీల్ (ప్రశాంత్), కళ్యాణ్ (ప్రభుదేవా), అజయ్ (అజ్మల్)లతో కలిసి రహస్య ఆపరేషన్లు నిర్వహిస్తుంటాడు.
ఒకసారి కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్ వెళ్ళినప్పుడు, పాత శత్రువు మీనన్ (మోహన్) చేసిన దాడిలో గాంధీ తన చిన్న కొడుకు జీవన్‌ను కోల్పోతాడు. ఈ విషాదంతో గాంధీ భార్య అనురాధ (స్నేహ) అతనికి దూరమవుతుంది.
15 ఏళ్ల తర్వాత, రష్యా వెళ్ళినపుడు అక్కడ భారత రాయబార కార్యాలయంపై జరిగిన దాడిని అడ్డుకోవడానికి గాంధీ రంగంలోకి దిగుతాడు. అక్కడ అచ్చం తనలాగే ఉన్న యువకుడిని చూసి గాంధీ షాక్ అవుతాడు. థాయ్‌లాండ్‌లో చనిపోయాడనుకున్న తన కొడుకు జీవన్ బ్రతికే ఉన్నాడని తెలుసుకుని అతడిని తీసుకుని ఇండియా వస్తాడు.
తర్వాత జీవన్ క్రూరమైన నేరస్థుడిగా మారి తన బృందాన్నే అంతం చేయడానికి వచ్చాడని గాంధీ తెలుసుకుంటాడు. చెన్నై చెపాక్ స్టేడియంలో IPL మ్యాచ్ సమయంలో)జీవన్ ప్లాన్ చేసిన బాంబ్ బ్లాస్ట్ కుట్రను గాంధీ ఎలా ఆపాడనేదే మిగిలిన కథ.
తండ్రి గాంధీగా హుందాగా నటిస్తూనే, కొడుకు జీవన్‌గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విజయ్ చెలరేగిపోయారు. ముఖ్యంగా జీవన్ పాత్రలో ఆయన చూపించిన క్రూరత్వం, బాడీ లాంగ్వేజ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. పాత్ర ధారులంతా వారి పరిధిలో చక్కగా నటించారు. స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, జయరామ్. పాత్రల పరిధి చాల తక్కువే.
రష్యాలో వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్, చెన్నై చెపాక్ స్టేడియంలో IPL మ్యాచ్ నేపథ్యంలో సాగే క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.సినిమా ప్రారంభంలోనే కెన్యాలో కదులుతున్న రైలుపై గాంధీ (విజయ్) అతని బృందం చేసే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ బాగుంటుంది.
ఈ సన్నివేశం ముగింపులో AI టెక్నాలజీతో దివంగత నటుడు కెప్టెన్ విజయకాంత్ ని తెరపై చూపించిన విధానం తమిళ, తెలుగు ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ సర్ప్రైజ్ ఇచ్చింది..రష్యాలో అచ్చం తనలాగే ఉన్న జీవన్ ను చూసి గాంధీ ఆశ్చర్యపోయే సన్నివేశం సినిమాకే అతిపెద్ద హైలైట్. తండ్రీకొడుకుల మధ్య జరిగే మెట్రో స్టేషన్ ఫైట్ సీన్స్ ను బాగా చిత్రీకరించారు.
సినిమా దాదాపు 3 గంటల నిడివి (183 నిమిషాలు) ఉండటం కొంత భారంగా అనిపిస్తుంది. ప్రథమార్థంలో కథ అసలు పాయింట్లోకి రావడానికి చాలా సమయం తీసుకుంది. నిడివి తగ్గితే బాగుండేది. యువ విజయ్ పాత్ర కోసం వాడిన డీ-ఏజింగ్ గ్రాఫిక్స్ కొన్ని సన్నివేశాల్లో సహజంగా కనిపించవు.
మెయిన్ విలన్ మీనన్ (మోహన్) పాత్రలో బలం లేకపోవడం, జీవన్ అంత క్రూరంగా మారడానికి చూపించిన కారణం బలహీనంగా ఉంది .స్టేడియం లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరిగే ఉత్కంఠభరితమైన IPL మ్యాచ్ సమయంలో, బాంబ్ బ్లాస్ట్ ఆపడానికి గాంధీ చేసే పోరాటం సినిమాకు ప్రధాన ఆకర్షణ. మ్యాచ్‌లో ఎం.ఎస్. ధోని బ్యాటింగ్‌కు దిగే ఆర్కైవ్ విజువల్స్ అభిమానులను అలరిస్తాయి.
‘కెప్టెన్ మిల్లర్’ ఫేమ్ సిద్ధార్థ నూని కెమెరా పనితనం (సినిమాటోగ్రఫీ) ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో ఉన్నది. కదులుతున్న రైలుపై జరిగే ఓపెనింగ్ ఫైట్, థాయ్‌లాండ్ వీధులు, రష్యాలోని మంచు వాతావరణం, మెట్రో స్టేషన్ ఛేజింగ్ సన్నివేశాలను చాలా రిచ్‌గా, హాలీవుడ్ యాక్షన్ సినిమాల స్థాయిలో చిత్రీకరించారు.క్లయిమాక్స్ చిత్రీకరణ కూడా బాగుంది.
ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. పాటలతో పోలిస్తే ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా కుదిరింది. ముఖ్యంగా విలన్ జీవన్ పాత్రకు వచ్చే ఇంటెన్స్ థీమ్ మ్యూజిక్, ఇంటర్వెల్, చెపాక్ స్టేడియం క్లైమాక్స్ సన్నివేశాల్లో వచ్చే బీజీఎం ఉత్కంఠను పెంచాయి.
ది గోట్’ కథ పరంగా కొత్తది కాకపోయినా, దళపతి విజయ్ వన్-మ్యాన్ షో, వెంకట్ ప్రభు మార్క్ కమర్షియల్ అంశాలతో సాగే యాక్షన్ ఎంటర్టైనర్. ఆసక్తి ఉన్నవారు netflix లో ఈ సినిమాను తెలుగు వెర్షన్ లో చూడవచ్చు.

