కథ తక్కువ ..యాక్షన్ ఎక్కువ !!

Sharing is Caring...

Action thriller ……..

‘సిగ్మా’ (Sigma). దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమా ఇది.  లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ పీరియడ్ హైస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం అక్టోబర్ 2, 2026న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా  తెలుగు వెర్షన్  Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ ఏమిటంటే ?

అప్పుల్లో కూరుకుపోయిన లైబ్రరీ యజమాని గురు (సందీప్ కిషన్)కి ఒక వాల్ట్ కీ (Vault Key), కపాలం ఆకారంలో ఉన్న ఒక పెన్ డ్రైవ్ లభిస్తాయి. ఆ తాళం చెవి ఒక గ్యాంగ్‌స్టర్ / క్యాసినో సామ్రాజ్యానికి చెందిన రూ. 1000 కోట్ల రహస్య లాకర్‌కు చెందిందని తెలుస్తుంది. పెన్ డ్రైవ్ లో డ్రగ్స్ అమ్మే విల్సన్ వ్యవహారాలన్నీ ఉంటాయి.

అతగాడిని బ్లాక్ మెయిల్ చేయాలని  గురు భావిస్తాడు. అదే సమయంలో గ్యాంగ్‌స్టర్ వీరయ్య రెడ్డి (సంపత్ రాజ్ రహస్య లాకర్ కీ కోసం రంగంలోకి దిగుతాడు. ఈ రెండు ముఠాల నుండి గురు తన  ప్రాణాలను ఎలా కాపాడుకున్నారు? లాకర్ లో  సొమ్ముని  ఎలా దక్కించుకున్నాడు అనేది మిగతా కథ.

ఈ సినిమాకు ప్రధాన బలం సందీప్ కిషన్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్. అప్పుల్లో ఉండే సాధారణ యువకుడిగా, ఆ తర్వాత మాస్టర్ మైండ్‌గా తన పాత్రలో చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు. యాక్షన్ సీన్స్‌లో ఆయన బాగా నటించాడు. విలన్‌గా సంపత్ రాజ్, ఒక వింతైన పాత్రలో రాజు సుందరం (డాక్టర్ నీల్), అన్బుదాసన్,శివ పండిట్ కొన్ని సీన్స్‌లో తమ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. కొన్ని చోట్ల దర్శకుడు చూపించిన మేకింగ్ స్టైల్ (స్క్రీన్ టేకింగ్) పర్వాలేదనిపిస్తుంది. 

దర్శకుడిగా జాసన్ సంజయ్ టెక్నికల్‌గా మంచి విజన్ చూపించినప్పటికీ.. కథనంలో  పూర్తిగా విఫలమయ్యారు. చాలా సీన్స్ కేవలం కాకతాళీయంగా  జరిగిపోతున్నట్లు అనిపిస్తాయి తప్ప, ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఫీల్‌ రాదు. ఒక పెద్ద క్రైమ్ ముఠా లాకర్‌ను దోపిడీ చేసే సీన్స్ చాలా సిల్లీగా, సులభంగా జరిగిపోతాయి.

ఒక సాదాసీదా లైబ్రేరియన్ రాత్రికి రాత్రే మాస్టర్ హ్యాకర్ , కంబ్యాట్ ఫైటర్ (యుద్ధ నైపుణ్యాలు) లాగా మారిపోవడం అంతగా కన్విన్సింగ్‌గా లేదు. ప్రధాన పాత్రల మధ్య బలమైన భావోద్వేగాలు లేవు. హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా ఫోర్స్‌డ్‌గా అనిపిస్తుంది. దీనివల్ల పాత్రలు ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా ఆడియన్స్‌కు ఆ త్రిల్ లేదా సింపతీ కనెక్ట్ అవ్వదు.

సినిమా నిడివి (146 నిమిషాలు) చాలా చోట్ల సాగదీతగా, బోర్ కొట్టించేలా ఉంటుంది.ఈ సినిమాకు కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వహించారు. కథలో పాత హాలీవుడ్ యాక్షన్ చిత్రాల వైబ్ ఉంటుంది. గ్యాంగ్‌స్టర్ డెన్‌లు, క్యాసినో బ్యాక్‌డ్రాప్స్, భారీ దోపిడీ సీక్వెన్స్‌లలో లైటింగ్ ప్యాటర్న్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. కెమెరా మూవ్‌మెంట్స్ చాలా స్టైలిష్‌గా ఉండి సినిమా స్థాయిని పెంచాయి.

ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించారు. థమన్ సాధారణంగా అందించే భారీ డ్రమ్స్, లవుడ్ మ్యూజిక్ కాకుండా.. ఈ హైస్ట్ థ్రిల్లర్ కోసం కొద్దిగా కొత్త తరహా ఎలక్ట్రానిక్, సింథ్-పాప్ (Synth-pop) సంగీతాన్ని ఉపయోగించారు. కొన్ని ప్రధాన యాక్షన్ ఛేజ్ సీన్లలో ఈ బిజీఎమ్ సీన్‌ను బాగానే ఎలివేట్ చేసింది.

స్క్రీన్‌ప్లేలో ఎమోషన్స్, సస్పెన్స్ లోపించడం వల్ల, థమన్ తన మ్యూజిక్‌తో సీన్లను లేపాలని చూసినా కొన్ని చోట్ల అది వర్కవుట్ అవ్వలేదు. కథనంలో బలం లేకపోవడంతో బిజీఎమ్ కూడా కొన్ని సీన్స్ లో కాస్త రొటీన్‌గా అనిపిస్తుంది.

మొత్తం గా ‘సిగ్మా’ (Sigma) లో మంచి విజువల్స్ ఉన్నప్పటికీ.. సరైన స్క్రిప్ట్ బలం లేకపోవడం వల్ల నిరాశపరిచిన ఒక యావరేజ్ హైస్ట్ డ్రామా. దళపతి విజయ్ కొడుకు తొలి ప్రయత్నం కాబట్టి మేకింగ్ పరంగా చూడొచ్చు కానీ,విపరీతమైన సస్పెన్స్ ఆశిస్తే నిరాశ తప్పదు. స్టైలిష్ విజువల్స్, సందీప్ కిషన్ కోసం ఓటీటీలో ఓసారి టైంపాస్ వాచ్ చేయవచ్చు. 

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!