A movie worth watching ………
‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ (Jurassic World Rebirth) ఇదొక యాక్షన్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మూవీ. జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో వచ్చిన 7వ చిత్రం.’గాడ్జిల్లా’, ‘రోగ్ వన్’ చిత్రాల దర్శకుడు గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2025లో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియోలలో అందుబాటులో ఉంది.
కథ ఏమిటంటే ?
‘జురాసిక్ వరల్డ్ డొమినియన్’ సంఘటనలు జరిగిన ఐదేళ్ల తర్వాత ఈ కథ సాగుతుంది. భూమిపై వాతావరణ మార్పుల వల్ల డైనోసార్ల మనుగడ కష్టమై, అవి కేవలం భూమధ్యరేఖకు సమీపంలో ఉండే ఒక ప్రత్యేక ఉష్ణమండల దీవికే పరిమితమవుతాయి.
మానవాళిని రక్షించే ఒక అద్భుతమైన ఔషధం (Life-saving drug) తయారీ కోసం అక్కడున్న మూడు భారీ డైనోసార్ల డీఎన్ఏ (DNA) సేకరించడానికి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రయత్నిస్తుంది. ఈ రహస్య మిషన్‌కు కోవర్ట్ ఆపరేషన్స్ ఎక్స్పర్ట్ జోరా బెన్నెట్ (స్కార్లెట్ జోహాన్సన్) నాయకత్వం వహిస్తుంది. ఈ క్రమంలో సముద్రంలో నౌక ప్రమాదానికి గురైన ఒక సాధారణ కుటుంబాన్ని వారు రక్షిస్తారు. ఆ తర్వాత ఆ దీవిలోడైనోసార్ల దాడి నుండి వారు ఎలా తప్పించుకున్నారు? అనేది మిగతా కథ.
దర్శకుడు గారెత్ ఎడ్వర్డ్స్ మార్క్ మేకింగ్ ఇందులో కనిపిస్తుంది. 35mm ఫిల్మ్‌పై తీసిన విజువల్స్, నైట్ సీన్స్, రివర్ ఛేజ్, కొండ అంచు సీక్వెన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. డైనోసార్ల సైజ్,వాటి భీభత్సాన్ని స్క్రీన్‌పై భారీగా చూపించారు. సినిమా ప్రారంభంలో వచ్చే హారర్ ఎలిమెంట్స్,డైనోసార్ల ఛేజింగ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సౌండ్ డిజైన్ టాప్ నాచ్గా ఉన్నాయి.
స్కార్లెట్ జోహాన్సన్ (Zora) యాక్షన్ పాత్రలో చాలా స్టైలిష్‌గా, ఫిట్‌గా కనిపించి మెప్పించింది. జోనాథన్ బెయిలీ (Dr. Henry) తన చామింగ్ యాక్టింగ్‌తో సినిమాకు కాస్త ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చారు. మహెర్షలా అలీ తన పరిధి మేర బాగానే నటించారు.
సినిమా మొదటి భాగంలో పాత్రల పరిచయాలు, సంభాషణలు చాలా ఎక్కువగా ఉండి కథనం నెమ్మదిగా సాగుతుంది.డైనోసార్ల యాక్షన్ సీన్లు బాగున్నప్పటికీ, మనుషుల పాత్రల మధ్య ఎమోషన్స్, డ్రామా చాలా వీక్‌గా ఉన్నాయి. క్యారెక్టర్ రైటింగ్ లోతుగా లేకపోవడం వల్ల ఏ పాత్రతోనూ ప్రేక్షకుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వలేడు.
నౌక ప్రమాదానికి గురైన డెల్గాడో ఫ్యామిలీ (డ్యాడ్ & చిల్డ్రన్) సబ్‌ప్లాట్ కథకు కొంత మేరకు హెల్ప్అయింది. అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు గ్రూప్ మొత్తం ఒక భారీ ‘టైటానోసారస్’ డైనోసార్ల జంటను/మందను చూస్తుంది. ఆ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఒరిజినల్ ‘జురాసిక్ పార్క్’ క్లాసిక్ మ్యూజిక్, డైనోసార్ల మధ్య ఉన్న ప్రేమను చూపిస్తూ సాగే ఈ సీన్ 1993 నాటి మొదటి సినిమా జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది.
డాక్టర్ హెన్రీ లూమిస్ డైనోసార్‌ను తాకే సీన్ బాగుంది. సముద్రంలో నౌక ప్రమాదానికి గురై డైనోసార్ల దీవిలో చిక్కుకుపోయిన ఒక సాధారణ కుటుంబానికి (తండ్రి అతని ఇద్దరు పిల్లలు) సంబంధించిన ఎపిసోడ్స్ సినిమాలో కాస్త ఎమోషన్ తీసుకొస్తాయి. డైనోసార్లు చుట్టుముట్టిన భయానక వాతావరణంలో తన పిల్లలను కాపాడుకోవడానికి ఆ తండ్రి పడే తాపత్రయం, వారి మధ్య ఉండే సెంటిమెంట్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది.
కేవలం ఒక ఫార్మాస్యూటికల్ మిషన్ కోసం, డబ్బు ఆశించి డైనోసార్ల డీఎన్ఏ సేకరించడానికి వచ్చిన జోరా బెన్నెట్ అక్కడ చిక్కుకుపోయిన పిల్లలను చూశాక తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆ అమాయక కుటుంబాన్ని కాపాడటానికి ఆమె చేసే ప్రయత్నం, ఒక కఠినమైన అధికారి నుండి ఎమోషనల్ పర్సన్‌గా ఆమె మారే క్రమం బాగుంటుంది. నటీ నటులంతా బాగా నటించారు.
పాత జురాసిక్ పార్క్ చిత్రాల ఫార్ములానే ( డైనోసార్ల దీవికి వెళ్లడం, అవి దాడి చేయడం, వీరు తప్పించుకోవడం) మళ్లీ రిమిక్స్ చేసినట్లు ఉంటుంది తప్ప కథ పరంగా ఎలాంటి కొత్తదనం కనిపించదు.అయితే కొత్తగా చూసే వారికి ఆ ఫీలింగ్ ఉండదు.
సినిమాకు కెమెరా వర్క్, సంగీతం చాలా ప్రత్యేకమైన టెక్నికల్ అసెట్స్‌గా నిలిచాయి. దర్శకుడు గారెత్ ఎడ్వర్డ్స్ తన మునుపటి చిత్రాల (‘గాడ్జిల్లా’, ‘ది క్రియేటర్’) తరహాలోనే ఈ సినిమాను కూడా విజువల్స్, ఆడియో పరంగా చాలా రిచ్‌గా ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ జాన్ మాథీసన్ (John Mathieson) కెమెరామన్ గా పనిచేశారు.
భారీ గ్రీన్ స్క్రీన్ సెట్లకు బదులుగా థాయిలాండ్ అడవులు, నదుల వంటి రియల్ లొకేషన్లలో షూట్ చేయడం వల్ల విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. నైట్ ఛేజింగ్ సీన్స్, వర్షంలో వచ్చే డైనోసార్ల దాడులు, కొండ అంచు సీక్వెన్స్‌లలో కెమెరా మూవ్మెంట్స్ ప్రేక్షకుడికి గూస్బంప్స్ తెప్పిస్తాయి.
మనుషుల పక్కన డైనోసార్లు ఎంత భారీగా ఉన్నాయో చూపించే లో-యాంగిల్ షాట్స్ … వైడ్ షాట్స్ సినిమాటోగ్రఫీలో టాప్-నాచ్గా నిలిచాయి.
ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత అలెగ్జాండ్రే డెస్ప్లాట్ (Alexandre Desplat) సంగీతం అందించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) భయం , వింతతో కూడిన వాతావరణాన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసింది. రాక్షస డైనోసార్లు స్క్రీన్‌పైకి వచ్చేటప్పుడు వచ్చే బ్రాస్ (Brass) డ్రమ్స్ మ్యూజిక్ బాగుంది.కథలో కాస్త రొటీన్ ఫార్ములా ఉన్నప్పటికీ.. ఒక అద్భుతమైన విజువల్ అండ్ ఆడియో ట్రీట్‌గా నిలిచాయి. కుటుంబంతో కలసి చూడదగిన సినిమా ఇది.

