త్రినాధ్ రావు గరగ………
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అంటే వినడానికి ఎంతో హాయిగా ఉంటుంది.. వీరి కలయిక అంటే ప్రేక్షకులకు గుర్తొచ్చేది ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి వినోదాల జ్ఞాపకాలు. అలాంటి అంచనాల మధ్య ఆదర్శ కుటుంబం ఏకే 47 పేరుతో మళ్లీ మన ముందుకు వచ్చారు వీరిద్దరూ..
సినిమా పరంగా చూస్తే త్రివిక్రమ్ తనకు ఎప్పుడూ తెలిసిన దారిలో కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశారనిపించింది.. ఆయన నుంచి ప్రేక్షకులు ఆశించేది చమత్కారమైన మాటలు, సహజమైన హాస్యం, కుటుంబ అనుబంధాలు. ఈ సినిమాలో కూడా ఆ అంశాలను వదలకుండా వాటికి క్రైమ్ థ్రిల్లర్‌ను జోడించే ప్రయత్నం చేశారు.. అది ఫస్ట్ హాఫ్ వరకు బాగానే త్రివిక్రమ్ స్టైల్లోనే కొనసాగింది.. సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి కొంచెం కథనం దారి తప్పినట్లనిపించింది.
సెకండాఫ్ అక్కడక్కడా కొన్ని మంచి సన్నివేశాలు, మరికొన్ని తేలిపోయే ఎపిసోడ్స్‌తో సినిమా ముందుకు సాగుతుంది. ప్రేక్షకుడిని ఒకే స్థాయిలో ఎంగేజ్ చేయడంలో మాత్రం విఫలమవుతుంది. ద్వితీయార్థంలో ఓ రెండు సాంగ్స్ పడుంటే ఆ కధే వేరుగా ఉండేది.. దానికి తోడు ట్రైలర్ లో ఉన్న కామెడీ పంచలన్నీ ఫస్ట్ హాఫ్ లోనే వాడేసాడు.
క్రైమ్, ట్విస్టులు, యాక్షన్‌కు కుటుంబ భావోద్వేగాలను జోడించే ప్రయత్నం ఆసక్తికరంగా ఉంటుంది.కొన్ని మలుపులు మరింత బలంగా రాసి ఉంటే సినిమా స్థాయి పెరిగేది.. కుటుంబ బంధాలను బలంగా చెప్పడంలో త్రివిక్రమ్ ది అందె వేసిన చేయి.. ఈసారి ఎందుకో ఆ చేయి తడబడింది.. అయినా కూడా అక్కడక్కడ మాటలు తూటాల్లా పేలాయి.
ఉదాహరణకు.. చచ్చే సైన్యం లేకుండా గెలిచే యుద్ధం ఎక్కడుంటుంది సార్.. ద్వితీయార్ధం డైనింగ్ టేబుల్ దగ్గర హీరో పెద్దరికం గురించి చెప్పే మాటలు, పదివేల రూపాయలను రెండుసార్లు లెక్క పెడితే ఇరవైయ్ వేలు అవుతాయి అనుకునే అమాయకురాలు.. ఈ పెద్దోళ్ళు ఇంతే ఉన్నంతకాలం ఆగ్రహం, పోయాక విగ్రహం.. వంటి మాటలు ఆకట్టుకుంటాయి.
ఇక నటీనటుల గురించి ప్రస్తావించుకుంటే ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ గురించి కొత్తగా చెప్పుకునేది ఏముంటుంది.. చాలా ఈజ్ తో చిట్టిబాబు పాత్రను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. చాలా సందర్భాల్లో సినిమా డౌన్ అవుతున్నప్పుడు నిలబెట్టాడు కూడా.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కెమిస్ట్రీ బానే ఉంది . వెంకటేష్ కూతురిగా యువినా కొడుకుగా రాజ్ ప్రజ్వల్ ఆకట్టుకున్నారు.
నివేదా పేతురాజ్, నారా రోహిత్ సినిమాకు అసలు అవసరం లేదు. నారా రోహిత్ స్క్రీన్ ప్రజెన్స్ బాగున్నా కూడా ఏదో త్రివిక్రమ్ ఫాంటసీ కోసం వీళ్లిద్దరినీ పెట్టుకున్నారనిపించింది.. మెయిన్ విలన్‌గా ఉదయ్ బీర్ సంధు బాగానే చేశాడు. రఘుబాబు తనదైన కామెడీతో అక్కడక్కడా మెరిశారు.ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వెంకటేష్ తో పాటు సమానంగా కామెడీని పండించిన కమెడియన్ సత్య గురించి.
సినిమా అంతాఒక ఎత్తు.. సత్య కామెడీ ఒక ఎత్తు..రావు రమేష్, బ్రహ్మాజీ తమ పాత్రలకు న్యాయం చేశారు.. ఇక టెక్నికల్ గా చూసుకుంటే త్రివిక్రమ్ సినిమాలలో తమన్ మొట్టమొదటిసారి ఫెయిల్ అయ్యాడు.నేపధ్య సంగీతం కొంత వరకు ఒకే కానీ పాటలు పర్వాలేదు అన్నట్టు ఉన్నాయి.
రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. చాలా రిచ్‌గా, క్లాస్‌గా సన్నివేశాలను చూపించారు. ఆర్ట్ వర్క్ ఈ సినిమాను మరింత క్వాలిటీ మార్చారు. ఈ సినిమా నిర్మాణ విలువలు హై రేంజ్లో ఉన్నాయి..చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా టైటిల్ లో ఉన్న ఆదర్శం సినిమాలో అస్సలు కనబడలేదు.. దీపావళి పండుగ నేపథ్యంలో కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా ఆదరిస్తారన్నది వేచి చూడాలి.

