కనిపించని ఆత్మ కథ !!

Sharing is Caring...

Psychological horror thriller…………

‘డీయస్ ఈరే’ (Dies Irae) 2025 నాటి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా.. ‘భూతకాలం’, ‘భ్రమయుగం’ వంటి విలక్షణమైన హారర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు రాహుల్ సదాశివన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించారు. 

కథ ఏమిటంటే ? 

రోహన్ (ప్రణవ్ మోహన్‌లాల్) ఒక సంపన్న కుటుంబానికి చెందిన ఆర్కిటెక్ట్. సరదాగా గడుపుతూ ఉండే రోహన్, ఒకరోజు తన క్లాస్‌మేట్ అయిన కణి (సుస్మితా భట్) ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని తెలిసి వారింటికి వెళ్లి పరామర్శించి వస్తాడు. ఆ తర్వాత నుండి రోహన్ కు ఎవరో తనను వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది. అది కణి అని అనుకుంటాడు.

ఆత్మహత్య చేసుకున్న కణి ఆత్మ రోహన్‌ను ఎందుకు వెంటాడుతోంది? అసలు కణి మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటి? తప్పు చేశాననే భావన వల్ల రోహన్‌కు మతి చలించిందా ? నిజంగా అది ఆమె ఆత్మేనా ? మరొకరిదా ?  ప్రణవ్ ఎలా బయట పడ్డాడు ? అనేది ఈ సినిమా కథ.

ఈ సినిమాకు అతిపెద్ద బలం క్రిస్టో జేవియర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఎం.ఆర్. రాజకృష్ణన్ సౌండ్ మిక్సింగ్. ఎలాంటి జంప్ స్కేర్స్ (హఠాత్తుగా దెయ్యం రావడం) లేకపోయినా, కేవలం శబ్దాలతోనే భయపెట్టేలా సౌండ్ డిజైన్ చేశారు.  

రోహన్ పాత్రలో ప్రణవ్ మంచి నటన కనబరిచారు. ఒక పక్క గిల్ట్ ఫీలింగ్, మరోపక్క భయం వల్ల వచ్చే సైకలాజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను ఆయన కళ్ళతోనే అద్భుతంగా పండించారు.ప్రణవ్ కి సహాయం చేసే ‘మధు’ పాత్రలో జిబిన్ గోపీనాథ్ బాగా చేశారు. ఎల్సమ్మ పాత్రలో జయ కురూప్ నటన సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది.

ప్రణవ్ మోహన్‌లాల్ కణి గదిలోకి వెళ్లి, అక్కడి వాతావరణాన్ని గమనిస్తూ ఒక చిన్న జ్ఞాపికను (హెయిర్ క్లిప్)  జేబులో వేసుకునే సీన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ రూమ్‌లోని సైలెన్స్, లైటింగ్ ప్రేక్షకుల్లో ఒక తెలియని భయాన్ని, ఉత్కంఠను రేకెత్తిస్తాయి.

పగటిపూట కూడా ఇంట్లో సడన్‌గా గాలి వీచడం, ఎవరూ లేకపోయినా నాట్యగత్తె కాలిగజ్జల సవ్వడి వినిపించడం, కణి వాడే హెయిర్ క్లిప్ నుంచి క్లిక్ అనే శబ్దం రావడం వంటి దృశ్యాలు బాగుంటాయి. జంప్ స్కేర్స్ వాడకుండా కేవలం సౌండ్ డిజైన్‌తోనే భయపెట్టిన అద్భుతమైన బ్లాక్ ఇది.థియేటర్ లో ఆఫీలింగ్ వేరేగా ఉంటుంది. 

సినిమా ద్వితీయార్థంలో ఎల్సమ్మ ఇంటి ఎపిసోడ్ బాగుంటుంది. ఆమె ప్రణవ్ పై దాడి చేసే సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. చివరి 20 నిమిషాల్లో వచ్చే క్లైమాక్స్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. మంటల్లో చిక్కుకున్న ఆ ఇల్లు, అక్కడ ఫిలిప్ అస్థిపంజరం నుంచి కట్ చేసిన కాళ్లను,గజ్జెలను ప్రణవ్ కాల్చివేసి ఆత్మకు విముక్తి ప్రసాదించే దృశ్యాలు ఆకట్టుకుంటాయి. 

కానీ కథలో కణి ఆత్మహత్య కేసు గురించి పోలీసుల విచారణ చేశారా ? చేయలేదా ? అన్న అంశాలు లేవు.కణి ఎలా మరణించింది అనే ప్రశ్నలకు సరైన ముగింపు ఇవ్వకుండా వదిలేసినట్లు అనిపిస్తుంది.సాధారణంగా హారర్ సినిమాలు చీకట్లో సాగుతాయి.

కానీ ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్ షెహనాద్ జలాల్ వెలుతురును ఉపయోగించి భయాన్ని సృష్టించిన విధానం మెప్పిస్తుంది. పెద్ద బంగళా, ఆ రూములు చూసేటప్పుడే ఒక రకమైన ఒంటరితనం, భయం కలుగుతాయి.సినిమా చివరి 20 నిమిషాలు వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ సినిమా రేంజ్‌ను పెంచేశాయి.

కథలోకి వెళ్ళడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్లు చాలా నెమ్మదిగా సాగుతూ సాగదీసినట్లు అనిపిస్తాయి. ఇంటర్వెల్ వరకు చాలా ఆసక్తికరంగా సాగిన సినిమా, సెకండ్ హాఫ్‌లోకి వచ్చేసరికి కొన్నిచోట్ల కాస్త ఊహాజనితంగా మారుతుంది. కథ పరంగా చూస్తే ఇది మనం రెగ్యులర్‌గా చూసే రివెంజ్ డ్రామా తరహా హారర్ లైన్ లాగే అనిపిస్తుంది. కాకపోతే ఎక్కడా దెయ్యాన్ని/ఆత్మను చూపించరు.  

‘డీయస్ ఈరే’ రొటీన్ హారర్ సినిమాల్లాంటిది కాదు. హాలీవుడ్ తరహా మేకింగ్ వాల్యూస్, ఒళ్లు గగుర్పొడిచే సౌండ్ ఎఫెక్ట్స్‌తో సాగే ఒక సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్.ఆసక్తి ఉన్నవారు ఈ సినిమా చూడవచ్చు.జియో హాట్ స్టార్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!