చూడదగిన పేట్రియాటిక్ స్పై థ్రిల్లర్!!

Sharing is Caring...

 Spy thriller …………

‘మిషన్ మజ్ను’ (Mission Majnu) ఇదొక పీరియడ్ స్పై థ్రిల్లర్ మూవీ.. సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. Netflix లో ఈ మూవీ తెలుగు వెర్షన్లో స్ట్రీమింగ్ అవుతోంది.  

కథాంశం

1970ల కాలంలో పాకిస్తాన్ రహస్యంగా అణుబాంబు (Nuclear Bomb) తయారు చేస్తోందని ‘రా’ (R&AW) కు సమాచారం అందుతుంది. ఆ రహస్య అణు కర్మాగారం ఎక్కడ ఉందో కనుగొనే బాధ్యతను అమన్‌దీప్ సింగ్ (సిద్ధార్థ్ మల్హోత్రా) అనే అండర్ కవర్ ఏజెంట్‌కు అప్పగిస్తారు.

అమన్‌దీప్ ‘తారిఖ్’ అనే  పేరుతో పాకిస్తాన్‌లోని రావల్పిండిలో దర్జీ గా స్థిరపడతాడు.ఆ క్రమంలోనే నస్రీన్ (రష్మిక మందన్న) అనే చూపులేని అమ్మాయితో ప్రేమలో పడి, ఆమెను పెళ్లి చేసుకుంటాడు. తన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటూనే, పాకిస్తాన్ అణు రహస్యాలను అమన్‌దీప్ ఎలా బయటపెట్టాడు? ఈ క్రమంలో అతను ఎలాంటి త్యాగాలు చేశాడు? అనేదే మిగతా కథ.

అండర్ కవర్ ఏజెంట్‌గా సిద్ధార్థ్ మల్హోత్రా తన నటనతో, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. రష్మిక మందన్న నటన చాలా సహజంగా, సున్నితంగా ఉంది. సినిమా ముగింపు సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా, ఉత్కంఠభరితంగా సాగుతాయి.మిగిలిన నటీనటులు తమ పాత్రలలో అద్భుతంగా నటించి సినిమాకు పెద్ద అండగా నిలిచారు.

సినిమా లో ఇందిరా గాంధీ పాత్రను అవంతిక అకెర్కర్, మొరార్జీ దేశాయ్  పాత్రను ప్రముఖ నటుడు అవిజిత్ దత్, జనరల్ జియా-ఉల్-హక్ పాత్రను అశ్వత్ భట్, పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో పాత్రను సీనియర్ నటుడు రజిత్ కపూర్  పోషించారు. వీరంతా  తమ పాత్రలకు తగ్గట్టుగా ఆనాటి రాజకీయ ప్రముఖుల గెటప్స్, బాడీ లాంగ్వేజ్‌ను చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు.

సిద్ధార్థ్ మల్హోత్రా ఒక సాధారణ పాకిస్తానీ దర్జీగా శత్రు దేశంలో ఎలా కలిసిపోయాడో చూపించే సీన్ చాలా సహజంగా ఉంటుంది. అతని వేషధారణ, మాట్లాడే విధానం కథ లోకి మనల్ని తీసుకెళ్తాయి. పాకిస్తాన్ అణు కర్మాగారానికి సంబంధించిన క్లూస్ సేకరించడానికి సిద్ధార్థ్ ఆర్మీ ఆఫీసర్లు ఉండే ప్రదేశంలోకి అత్యంత చాకచక్యంగా ప్రవేశించి, సమాచారాన్ని దొంగిలించే మైండ్ గేమ్ సీన్ ఉత్కంఠను పెంచుతుంది.

సినిమా లో వచ్చే రైలు యాక్షన్ సీన్ చాలా స్టైలిష్‌గా, గ్రిప్పింగ్‌గా డిజైన్ చేశారు. ఒక స్పై ఏజెంట్‌గా సిద్ధార్థ్ తన తెలివితేటలతో శత్రువుల నుండి తప్పించుకునే విధానం ఆకట్టుకుంటుంది. సినిమా ముగింపులో వచ్చే చివరి 20 నిమిషాలు ఈ చిత్రానికే హైలైట్. ముఖ్యంగా విమానాశ్రయం లో సన్నివేశాలు, దేశం కోసం హీరో చేసే త్యాగం, ఆ సమయంలో రష్మిక పడే వేదన ప్రేక్షకులను తీవ్రమైన భావోద్వేగానికి గురిచేస్తాయి.  

సినిమాలో స్పై థ్రిల్లర్ కి ఉండాల్సిన లాజిక్స్ కొన్నిచోట్ల మిస్ అయ్యాయి. గూఢచారులు శత్రుదేశంలో చాలా సులభంగా ఆధారాలు సేకరిస్తున్నట్లు చూపించడం అంతగా కన్విన్సింగ్‌గా అనిపించదు. ఫస్ట్ హాఫ్‌లో లవ్ స్టోరీ,  ఫ్యామిలీ డ్రామాపై ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల సినిమా కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది.

ఈ సినిమాకు రోచక్ కోహ్లీ, తనిష్క్ బాగ్చీ వంటి మల్టిపుల్ కంపోజర్స్ సంగీతం అందించగా, కేతన్ సోధా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) అందించారు. సినిమాలో పాటలు చాలా ప్లెజంట్‌గా ఉంటాయి… క్లైమాక్స్ సన్నివేశాల్లో వచ్చే భావోద్వేగపూరితమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది.

ఈ చిత్రానికి బిజితేష్ దే (Bijitesh De) సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. పీరియడ్ సినిమాలకు విజువల్స్ చాలా ముఖ్యం, ఆ విషయంలో ఆయన వంద శాతం న్యాయం చేశారు.1970ల కాలం నాటి రావల్పిండి నగరాన్ని, అక్కడి దర్జీ దుకాణాలను, పాతకాలపు ఇళ్లను తన కెమెరాలో చాలా సహజంగా బంధించారు. 

ట్రైన్ పై జరిగే యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ లో వచ్చే రన్-చేజ్ సీన్లను కెమెరాలో చాలా గ్రిప్పింగ్‌గా, డైనమిక్‌గా క్యాప్చర్ చేశారు. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. దేశ భక్తి , వార్ సినిమాలు చూసే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు. 

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!