Investigative crime thriller…….
ఆర్యన్’ (Aaryan) ఇదొక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. ఇది 2025 లో విడుదల అయినా తమిళ సినిమా. విష్ణు విశాల్, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు.
కథాంశం
కథ చాలా భిన్నమైన, ఆసక్తికరమైన పాయింట్‌తో మొదలవుతుంది. ఆత్రేయ అనే (సెల్వ రాఘవన్) ఓ రైటర్ తన రచనా ప్రతిభను సమాజం గుర్తించలేదని బాధపడుతుంటాడు. ఓ న్యూస్ ఛానల్లో నయన అనే (శ్రధ్ధా శ్రీనాథ్) యాంకర్ ఓ యువ నటుడిని లైవ్ లో ఇంటర్వ్యూ చేస్తుండగా ఆత్రేయ ప్రేక్షకుడిలా వచ్చి స్టూడియోని కంట్రోల్ లోకి తీసుకుంటాడు.
ఆ నటుడిపై కాల్పులు జరుపుతాడు.ఆహ్వానితులంతా భయభ్రాంతులకు గురవుతారు.ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అందరిని కూర్చోమని చెబుతాడు. తనొక ఫెయిల్యూర్ రైటర్‌నని, తన ప్రతిభను ఎవరూ పట్టించుకోకపోగా అవమానించారంటూ వాపోతాడు.
తను అయిదు హత్యలు చేయబోతున్నానని, మొదట తనని తానే చంపుకుంటానని, ఆ తర్వాత మిగిలిన 5 గురిని వరుసగా 5 రోజుల్లో హత్య చేస్తానని, హత్య చేసే గంట ముందు వారి పేరు చెబుతానని చెప్పి …తనని తాను కాల్చుకుని చనిపోతాడు. ఆఘటన పెద్ద సంచలనంగా మారుతుంది.
ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ నంది (విష్ణు విశాల్) చేతికి వస్తుంది. ఆత్రేయ చనిపోయిన తర్వాత వరుసగా ఐదు రోజుల పాటు తను చంపబోయేవారి పేర్లను వివిధ మాధ్యమాల ద్వారా ప్రకటించి చంపుతూ ఉంటాడు. ఆత్రేయ చంపుతున్నది ఎవరిని? వారిని ఎందుకు చంపాలనుకుంటాడు? ఆత్రేయ ప్రకటించిన వారిలో ఎవరినైనా పోలీసులు కాపాడతారా? అన్నదే మిగతా కథ.
సినిమా ఫస్ట్ హాఫ్, కథను మొదలుపెట్టిన విధానం చాలా ఫ్రెష్‌గా, ఉత్కంఠభరితంగా ఉంటుంది.
పోలీస్ ఆఫీసర్‌గా విష్ణు విశాల్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఆత్రేయ పాత్రలో సెల్వరాఘవన్ తన నటన, వాయిస్ మాడ్యులేషన్‌తో సినిమాకు ప్రధాన బలంగా నిలిచాడు.
శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి వంటి హీరోయిన్స్ నటించినప్పటికీ, కథలో వారికి పెద్దగా ప్రాధాన్యత లేదు. మిగిలిన పాత్రలన్నీ చిన్నవే ..ఎవరి పరిధిలో వారు బాగానే చేశారు.
ఆత్రేయ మైండ్ గేమ్‌ను పరిచయం చేసే సన్నివేశాలు,సెల్వరాఘవన్ తన విలక్షణమైన వాయిస్, నటనతో పోలీస్ డిపార్ట్మెంట్ను కన్ఫ్యూజ్ చేసే మైండ్ గేమ్స్ పీక్స్‌లో ఉంటాయి. చనిపోయిన కిల్లర్ ఛాలెంజ్ చేసినట్లే మొదటి హత్య జరిగినప్పుడు, పోలీస్ ఆఫీసర్‌గా విష్ణు విశాల్ ఆ క్రైమ్ సీన్‌ను క్లూస్ ఆధారంగా డీకోడ్ చేసే సన్నివేశాలు చాలా గ్రిప్పింగ్‌గా ఉంటాయి.
హంతకుడు తదుపరి టార్గెట్‌ను ఎలా చంపబోతున్నాడో తెలుసుకుని హీరో అతనిని పట్టుకోవడానికి ప్లాన్ చేసే చేజింగ్ సీక్వెన్స్, దానికి తోడు వచ్చే జిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి.ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఉత్కంఠ సెకండ్ హాఫ్‌లో కనిపించదు. కథనం కాస్త నెమ్మదించి, కథ ట్రాక్ తప్పుతుంది.ఆత్రేయ హత్యలు చేయడానికి గల కారణాలు అంతగా కన్విన్సింగ్‌గా అనిపించవు. సమాజంలోని రుగ్మతలపై ఇచ్చే సందేశం కాస్త బలవంతంగా చొప్పించినట్లు ఉంటుంది.
హత్యకు గురైనవారంతా మంచి వారే ..వారిని సమాజం గుర్తించలేదని చనిపోయిన తర్వాత అయినా గుర్తిస్తుందనే వాదన కూడా అంత బాగాలేదు. ఆర్యన్’ సినిమాలో కథాంశం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, లాజికల్ లోపాలు, రొటీన్ క్యారెక్టరైజేషన్, సాగదీసిన క్లైమాక్స్ సినిమా ను దెబ్బతీశాయి.
జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) థ్రిల్లర్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. మర్డర్ మిస్టరీలు, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారైతే,పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చిత్రాన్ని చూడవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా Netflix ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉంది.

