చూడదగిన యాక్షన్ థ్రిల్లర్ !!

Sharing is Caring...

 Martial arts action drama ……..

‘తుడక్కమ్’ …. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమార్తె విస్మయ లీడ్ రోల్‌లో ఎంట్రీ ఇచ్చిన మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం. ‘2018’ ఫేమ్ జుడే ఆంథోని జోసెఫ్  ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కమర్షియల్‌గా రూ. 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం జియో హాట్ స్టార్ లో తెలుగు వెర్షన్  స్ట్రీమింగ్ అవుతోంది.

కథ ఏమిటంటే ?

ఒక విలేజ్ ఆఫీసర్ రవి (సాయి కుమార్) ఒక ఏరియాకు బదిలీ అయి వచ్చి అద్దె ఇంట్లో దిగుతాడు.. అతని కూతురు మీను (విస్మయ )ఒక పెంపుడు కుక్క ఆయన ఆ ఇంట్లో నివసిస్తుంటారు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన మీను ఒకరోజు ఎగ్జామ్ రాయడానికి సిటీకి వెళ్లి ఎంతకీ తిరిగి రాదు. కంగారుపడిన తండ్రి పోలీసులను ఆశ్రయిస్తాడు.

కొద్దిసేపటికి మీను క్షేమంగానే ఇంటికి తిరిగి వచ్చినట్లు అనిపించినా, ఒక సైకో విలన్ (ఆశిష్ జో ఆంటోని) కూడా ఆమెను ఫాలో అవుతూ వస్తాడు. ఆ తర్వాత వారి జీవితాల్లో జరిగిన ఊహించని పరిణామాలు ఏంటి? ఆ ప్రమాదం నుండి మీను తన మార్షల్ ఆర్ట్స్ విద్యతో ఎలా ఎదురొడ్డి పోరాడింది? అనేదే కథ.

మొదటి సినిమా అయినప్పటికీ విస్మయ యాక్షన్ సీన్స్‌లో అద్భుతంగా నటించింది.ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ స్టంట్స్, క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంతోనే పరిచయమైన నిర్మాత ఆంటోని పెరంబవూర్ కొడుకు ‘ఆశిష్ జో ఆంటోని’ క్రూరమైన విలన్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు.

అతని క్రూరమైన చూపులు, డైలాగ్స్ లేకుండా కేవలం నటనతోనే భయపెట్టే మేనరిజం సినిమాకు పెద్ద అసెట్. మిగతా పాత్రధారులు కూడా వారి పరిధిలో బాగానే నటించారు.
 
ఫస్టాఫ్‌లో కథానాయిక మీను (విస్మయ ) సిటీకి వెళ్లి కనిపించకుండా పోవడం దగ్గర నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత తండ్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం ..పోలీసుల ఇన్వెస్టిగేషన్ కి  సంబంధించిన ప్రతి సీన్ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. కొంతమంది  పోలీసుల వ్యవహార శైలి ఎలావుంటుందో  సందర్భంగా బాగా చూపారు. ప్రథమార్ధంలో వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్లు, వేగంగా సాగుతూ ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తిస్తాయి.  

సినిమాలో విలన్‌ ఆశిష్ జో ఆంటోని ఎంట్రీ సీన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అతని క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను ఒక్కసారిగా సీరియస్ థ్రిల్లర్ మోడ్‌లోకి మారుస్తాయి.

సినిమా మొత్తానికి బిగ్గెస్ట్ హైలైట్ క్లైమాక్స్‌లో వచ్చే సుదీర్ఘమైన యాక్షన్ బ్లాక్. మార్షల్ ఆర్ట్స్‌లో నిజంగానే శిక్షణ పొందిన విస్మయ ,విలన్‌తో చేసే ఈ రియలిస్టిక్ స్టంట్స్ బాగా వచ్చాయి. సాయి కుమార్ (తండ్రి), విస్మయల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్లు, ముఖ్యంగా కూతురు కనిపించనప్పుడు ఒక వికలాంగుడైన తండ్రి పడే ఆరాటం గుండెలను పిండేసేలా ఉంటుంది.

నేటి సమాజంలో అమ్మాయిలు చదువుతో పాటు ఖచ్చితంగా ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే మంచి సందేశాన్ని సినిమా ఇస్తుంది. బ్లాస్ట్ పేరిట ఒక సినిమా ఆమధ్య వచ్చింది ..అందులో కుటుంబం మొత్తం కరాటే నేర్చుకుంటారు

సినిమాలో మోహన్‌లాల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్‌గా గెస్ట్ రోల్‌లో కనిపిస్తారు.ఆయన ఫైట్స్ అభిమానులను అలరిస్తాయి. ఆయన విస్మయతో “నీ తండ్రి గర్వపడేలా చెయ్” (Make your father proud) అని చెప్పే డైలాగ్ సినిమాలో సాయి కుమార్ క్యారెక్టర్‌ను ఉద్దేశించి అన్నదే అయినప్పటికీ.. నిజ జీవితంలో మోహన్‌లాల్ తన కూతురి సినీ ఎంట్రీని ఉద్దేశించి అన్నట్లుగా ఉండటంతో ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.  

ద్వితీయార్ధంలో కథ పాత కాలపు రివెంజ్ డ్రామా తరహాలోకి మారిపోతుంది. సినిమా కొంత స్లో గా సాగుతుంది. విలన్ నుండి కుటుంబాన్ని కాపాడుకోవడం అనే పాయింట్ చాలా ముందే ఊహించేలా సాగుతుంది. విలన్ ఎక్కడ ఉన్నాడో  మీను కి నర్స్ చెప్పినప్పటికీ ఆమె పోలీసులకు చెప్పదు.. చెబితే కథ వేరే మలుపు తిరుగుతుంది.

ఇలా చిన్నలోపాలతో స్క్రిప్ట్ వర్క్ బలహీనంగా ఉంది. డైలాగ్స్ కొన్ని చోట్ల చాలా రొటీన్‌గా అనిపిస్తాయి.సినిమాలో వచ్చే థ్రిల్లింగ్ సీన్స్, ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే చేజింగ్ ఎపిసోడ్స్, ఫైట్ సీక్వెన్స్‌లకు జేక్స్ బిజోయ్ ఇచ్చిన నేపథ్య సంగీతం బాగుంది.

ఈ చిత్రానికి ప్రధాన సినిమాటోగ్రాఫర్స్‌గా జోమోన్ టి. జాన్ ,అఖిల్ జార్జ్ వ్యవహరించారు. వీరిద్దరితో పాటు అదనపు సినిమాటోగ్రఫీ బాధ్యతలను సుదీప్ ఎలామన్ చూసుకున్నారు. విజువల్స్ అన్ని బాగున్నాయి. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా  అందులో సందేహం లేదు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!