ఈ అఘోరకాళి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ?

Sharing is Caring...

Famous for Tantric worship….

తమిళనాడులోని తిరుచిరాపల్లి (త్రిచి), అరియమంగళంలో ఉన్న శ్రీ జై అఘోరకాళి ఆలయం దక్షిణ భారతదేశంలోనే అత్యంత అరుదైన, విశిష్ట తాంత్రిక ఉపాసనా కేంద్రం. ఈ ఆలయం కేవలం ఒక సాధారణ పూజా స్థలం కాదు… ఇక్కడ తాంత్రిక పూజలు కూడా జరుగుతాయి.

ఈ ఆలయం కాశీ (వారణాసి) సంప్రదాయానికి చెందిన అఘోర అఖాడా ఆశ్రమం పరిధిలో ఉన్న ఆలయం.  దీనిని అఘోర పీఠాధిపతి డాక్టర్ అఘోరి గురు మణికంఠన్ మహారాజ్ పర్యవేక్షిస్తున్నారు.ఇక్కడ సాధువులు నివసిస్తూ కఠినమైన ఆధ్యాత్మిక సాధనలు చేస్తుంటారు.

సాధారణ దేవాలయాలలో ఉండే అర్చకుల లాగా కాకుండా, ఇక్కడ అఘోర సంప్రదాయాన్ని పాటించే సాధువులు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అఘోర సంప్రదాయం ప్రకారం వీరు ఒంటి నిండా భస్మం (బూడిద) ధరించి, రుద్రాక్ష మాలలు వేసుకుని, ప్రత్యేక తాంత్రిక, సాత్విక పద్ధతులలో అఘోరకాళి అమ్మవారిని ఆరాధిస్తారు.

ఆలయం ప్రాంగణంలోకి వెళ్ళగానే డమరుకం శబ్దాలు, శంఖ నాదాలు వినిపిస్తాయి. మంత్రోచ్ఛారణల మధ్య అఘోరీలు చేసే ‘మహా యజ్ఞం లేదా హోమం’ భక్తులకు ఒక అద్భుతమైన,ఒళ్లు గగుర్పొడిచే ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది.

ఈ ఆశ్రమంలో భక్తులకు భయాన్ని పోగొట్టి, అంతర్గత శక్తిని పెంచే అత్యంత శక్తివంతమైన ‘మహా అఘోరకాళి దీక్ష’  తాంత్రిక ఉపాసనా శిక్షణను గురువుల సమక్షంలో ఇస్తారు. ఇక్కడ నిరంతరం జరిగే అఘోర హోమాలు చాలా ప్రసిద్ధి.

తీవ్రమైన నరదిష్టి, శత్రుపీడన, గ్రహ దోషాలు, మానసిక ఇబ్బందులు లేదా నెగటివ్ ఎనర్జీ లతో బాధపడేవారు ఈ పూజలలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

ఈ ఆలయం సర్ప నది ఒడ్డున, శ్మశాన వాటికకు సమీపంలో ఉంటుంది. ముఖ్యంగా ప్రతి అమావాస్య, పౌర్ణమి,  నవరాత్రి పర్వదినాల్లో అర్ధరాత్రి వేళల్లో ఇక్కడ జరిగే అఘోరకాళి ఆరతులు,నృత్య సాధనలు భక్తులలో తీవ్ర ఆధ్యాత్మిక ప్రకంపనలను కలిగిస్తాయి. 

ఆలయ నిర్మాణం కొత్తదే అయినప్పటికీ, ఇక్కడ అనుసరించే అఘోర సంప్రదాయాలు, మంత్రోచ్ఛారణలు, తాంత్రిక క్రియలు, గురు-శిష్య పరంపర మాత్రం శతాబ్దాల నాటి పురాతనమైన సనాతన సిద్ధాంతాలకు చెందినవి. 

దేశ విదేశాల నుండి అనేకమంది భక్తులు, ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకులు,ఘోర సాధన చేసేవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.ఇక్కడ అమ్మవారు భయంకరమైన, అదే సమయంలో భక్తులను రక్షించే అత్యంత శక్తివంతమైన ‘అఘోర కాళీ’ రూపంలో కొలువై ఉన్నారు.ఈ ఆలయం భక్తుల సందర్శనార్థం, సాధన కొరకు రోజంతా తెరిచే ఉంటుంది.

తిరుచ్చి సెంట్రల్ బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ నుండి అరియమంగళం వైపు వెళ్లే లోకల్ ఆటోలు లేదా బస్సుల ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

ఈ ఆలయ నిర్వహణ కేవలం పూజలకే పరిమితం కాకుండా ‘శ్రీ జై అఘోర కాళి చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా పేద ప్రజల ఆకలి తీర్చడం, ఉచిత వైద్యం అందించడం,  నిరుపేద పిల్లల చదువుకు సహాయం చేయడం వంటి సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!