An impressive adventure movie……
‘A.R.M’ (అజయంతే రండం మోషణం) ఇదొక భారీ పిరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ చిత్రం. మలయాళ హీరో టోవినో థామస్ 50 వ చిత్రంగా, జితిన్ లాల్ దర్శకత్వంలో రూపొందింది. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రస్తుతం జియో హాట్‌స్టార్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.
కథాంశం ఏమిటంటే ?
ఈ చిత్ర కథ ఉత్తర కేరళలోని ‘చేయోతికవు’ అనే గ్రామ నేపథ్యంలో, మూడు వేర్వేరు కాలక్రమాలలో (1900, 1950, 1990) సాగుతుంది.కుంజికేలు (1900) ఒక ఉల్క ముక్కతో చేసిన, అపారమైన మహిమలు గల ‘శ్రీభూతి దీపం’ (అమ్మవారి విగ్రహం) ను ఒక మహారాజు నుండి తన గ్రామానికి కానుకగా తెస్తాడు. ఈ విగ్రహం చుట్టూనే కథ నడుస్తుంది.
మణియన్ (1950) కుంజికేలు వంశానికి చెందిన క్రూరమైన, తెలివైన దొంగ. ఊరి ప్రజలు ఇతని పేరు చెబితేనే భయపడతారు.అజయన్ (1990) మణియన్ మనవడు. తాత చేసిన దొంగతనాల వల్ల ఊరి ప్రజలు అజయన్‌ను అనుమానిస్తూ, అవమానిస్తూ ఉంటారు.
ఆ ఊరి జమీందారు కూతురు లక్ష్మి (కృతి శెట్టి) ని అజయన్ ప్రేమిస్తాడు.అతని ప్రేమ గెలిచిందా ? లేదా ?అనేదే మిగిలిన కథ.
కేలు, మణియన్,అజయన్ అనే మూడు విభిన్న పాత్రలలో టోవినో అద్భుతమైన నటనను కనబరిచారు. ముఖ్యంగా క్రూరమైన ‘మణియన్’ పాత్రలో ఆయన చూపించిన రౌద్రం, పౌరుషం సినిమాకే అతిపెద్ద హైలైట్. ఆయన తర్వాత రోహిణి దే కీలక పాత్ర.
తన తండ్రి (మణియన్) చేసిన తప్పుల వల్ల సమాజం నుండి వచ్చే నిందలను భరిస్తూ, మరోవైపు తన కొడుకు ఎక్కడ తప్పుదారి పడతాడో అని ఆందోళన చెందే తల్లి వేదనను రోహిణి తన కళ్లల్లో, హావభావాలలో ఎంతో అద్భుతంగా పండించారు.
టోవినో థామస్,రోహిణిల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు ఆకట్టుకుంటాయి. మణియన్ భార్యగా సురభి లక్ష్మి నటన బాగుంది. కృతి శెట్టి కేవలం అందంగా కనిపించడానికే పరిమితమైంది. ఐశ్వర్య రాజేష్ పాత్రకు కూడా పెద్దగా ప్రాధాన్యత లేదు. మిగిలిన నటులంతా బాగానే చేశారు.
కేరళ జానపద నేపథ్యం ఉన్న కథ కావడం వల్ల తెలుగు ప్రేక్షకులకు కొన్ని చోట్ల కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది.సినిమా లో కథ 1990లలో మొదలై, మధ్యమధ్యలో 1900, 1950ల కాలంలోకి వెళ్తూ మూడు తరాల కథను ముడిపెడుతుంది. ఈ నాన్-లీనియర్ పద్ధతి కొంచెం కన్ఫ్యూస్ చేస్తుంది.
జోమోన్ టి. జాన్ కెమెరా వర్క్ విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. అడవి నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీన్లు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి . దిబు నినన్ థామస్ నేపథ్య సంగీతమే ఈ సినిమాను నిలబెట్టింది. ఫాంటసీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ వచ్చే ప్రతి సీన్‌ను తన సంగీతంతో వేరే లెవెల్‌కు తీసుకెళ్లారు.
జానపద కథలు..దైవత్వంతో కూడిన పాయింట్‌ను కథకు ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంటుంది.మూడు తరాల కథను చెప్పడం వల్ల ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయాలకే ఎక్కువ సమయం పడుతుంది, దీనివల్ల కథనం కొంత నెమ్మదిగా సాగుతుంది.
కేరళ సాంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ అయిన కలరిపయట్టు (Kalaripayattu) విన్యాసాలను ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు. స్క్రీన్‌పై ఈ యాక్షన్ సీన్లు అంత సహజంగా, పవర్‌ఫుల్‌గా రావడానికి టోవినో థామస్ ఆరు నెలల కఠిన శిక్షణ తీసుకున్నారు.
కథలో మూడు తరాల పాత్రలకు వాటికి తగ్గట్టుగా మూడు ప్రత్యేకమైన శైలులను డిజైన్ చేశారు.ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్సులను కేవలం సాంప్రదాయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో లార్జర్-ద్యాన్-లైఫ్‌గా చూపించడానికి స్టంట్ మాస్టర్స్ పనిచేశారు.సినిమా లోని యాక్షన్ సీన్లు అన్నీ కేరళలోని దట్టమైన అడవులు, కొండ ప్రాంతాలలో, బురద నేలల్లో రాత్రి వేళల్లో ఎక్కువగా షూట్ చేశారు. మొత్తం మీద సినిమా చూడదగినదే.

