Spy action thriller ………
‘మిస్టర్ ఎక్స్’ (Mr. X). ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్. మను ఆనంద్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్ స్టార్ లోకి వచ్చింది. తమిళ హీరో ఆర్య, గౌతమ్ కార్తీక్, మంజు వారియర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
కథ ఏమిటంటే ?
1965లో చైనాపై నిఘా పెట్టేందుకు భారత్-అమెరికా కలిసి నందాదేవి పర్వత శ్రేణుల్లో ఒక శక్తివంతమైన న్యూక్లియర్ డివైజ్‌ను ఇన్‌స్టాల్ చేసేందుకు ప్రయత్నిస్తాయి. కానీ ఆ ఆపరేషన్ విఫలమై, ఆ ప్రమాదకరమైన డివైజ్ మాయమవుతుంది. తర్వాత కాలంలో ఆ రేడియోధార్మిక న్యూక్లియర్ డివైజ్ శత్రువుల చేతికి చిక్కుతుంది.
చెన్నైలో జరగబోయే G20 సదస్సును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దానిని పేల్చాలని ప్లాన్ చేస్తారు.ఈ ముప్పు నుండి దేశాన్ని కాపాడటానికి రా (R&AW) ఏజెంట్ గౌతమ్ (ఆర్య), రా చీఫ్ ఇందిరా వర్మ (మంజు వారియర్) లీడ్ తీసుకుంటారు. డబుల్ ఏజెంట్ అమరన్ (గౌతమ్ కార్తీక్),అతని గ్యాంగ్ నుండి ఆ డివైజ్‌ను వీరు ఎలా స్వాధీనం చేసుకున్నారు? అసలు ఈ కథలో సీనియర్ ఏజెంట్ పరమేశ్వర్ (శరత్ కుమార్) పాత్ర ఏంటి? అనేదే మిగిలిన కథ.
స్పై ఏజెంట్‌గా ఆర్య తన ఫిజిక్, యాక్షన్ సీన్లతో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. రా చీఫ్‌గా మంజు వారియర్ స్టైలిష్ లుక్, గన్ ఫైట్ సీన్లు సినిమాకు ప్రధాన హైలైట్. 153 నిమిషాల (2 గంటల 33 నిమిషాలు) సుదీర్ఘమైన రన్‌టైమ్ ఈ సినిమాకు పెద్ద మైనస్. అవసరం లేని మల్టిపుల్ ఫ్లాష్‌బ్యాక్‌లు, బ్యాక్‌స్టోరీలు కథనాన్ని దెబ్బతీశాయి.
హాలీవుడ్ తరహా స్పై థ్రిల్లర్‌గా మలచాలని చూసినా,సెకండాఫ్‌లోకి వచ్చేసరికి కథనం చాలా రొటీన్‌గా, సులభంగా ఊహించేలా మారిపోతుంది.సినిమా ప్రారంభంలో నందాదేవి పర్వత శ్రేణుల్లో భారత్-అమెరికా సంయుక్తంగా నిర్వహించిన న్యూక్లియర్ డివైజ్ ఆపరేషన్ విఫలమయ్యే దృశ్యాలు చాలా ఆసక్తికరంగా, సస్పెన్స్‌తో సాగుతాయి.
ఆర్య షర్ట్‌లెస్ బాడీతో నీటి అడుగున చేసే అద్భుతమైన ఎక్సర్‌సైజ్ సీన్‌తో ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. న్యూక్లియర్ డివైజ్ శత్రువుల చేతికి చిక్కినప్పుడు, దానిని కాపాడటానికి రా ఏజెంట్లు ప్లాన్ చేసే సన్నివేశాలు బాగున్నాయి.
పవర్‌ఫుల్ ఎమోషనల్ పాత్రల్లో కనిపించే మంజు వారియర్, ఇందులో రా చీఫ్ ఇందిరా వర్మగా నటించారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె గన్ పట్టి శత్రువులను వేటాడే సీన్స్ ప్రేక్షకులకు నచ్చుతాయి. నటుడు శరత్ కుమార్ (ఏజెంట్ పరమేశ్వర్ పాత్ర) స్క్రీన్‌పైకి వచ్చిన ప్రతిసారీ తనదైన రాయల్ లుక్, డైలాగ్ డెలివరీతో సీన్లను ఎలివేట్ చేశారు.
సినిమాలో గౌతమ్ కార్తీక్ విలన్ ‘అమరన్ ‘ గా బాగా నటించారు. కూల్ గా,నవ్వుతూ విలనిజం పండించారు. సాధారణంగా రొటీన్ లవ్, యాక్షన్ పాత్రలు చేసే గౌతమ్ కార్తీక్.. ఈ చిత్రంలో పూర్తి స్థాయి నెగెటివ్ షేడ్స్ ఉన్న రోగ్ ఏజెంట్‌గా కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా, స్టైలిష్‌గా సాగుతుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన అంతర్జాతీయ యాక్షన్ సీక్వెన్సులు, చేజింగ్ సీన్లు,నందాదేవి పర్వత శ్రేణుల నేపథ్యంలో వచ్చే విజువల్స్‌ను కెమెరాలో చాలా గ్రాండ్‌గా ఆవిష్కరించారు. హాలీవుడ్ యాక్షన్ సినిమాల తరహా కలర్ గ్రేడింగ్, లైటింగ్ ఈ చిత్రానికి మంచి లుక్‌ను తీసుకువచ్చాయి.
ఈ సినిమాకు పాటల కంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. స్పై థ్రిల్లర్‌కు కావాల్సిన సస్పెన్స్, ఇంటెన్సిటీని, ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ యాక్షన్ బ్లాకులను తన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో థిబు నినన్ థామస్ వేరే లెవెల్‌కు ఎలివేట్ చేశారు.
మొత్తంగా ‘మిస్టర్ ఎక్స్’ కొన్ని అద్భుతమైన యాక్షన్ సీన్లు ,బలమైన సాంకేతిక విలువలు ఉన్నప్పటికీ, కథనంలో లోపాల వల్ల యావరేజ్‌గా మిగిలిపోయిన స్పై థ్రిల్లర్. లాజిక్‌లను పక్కన పెట్టి, కేవలం భారీ యాక్షన్ డ్రామాలను ఇష్టపడే వారు ఓటీటీ లో ఒకసారి దీనిని చూడవచ్చు.

