Suspense thriller………
మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘అంజామ్ పాతీరా’ (Anjaam Pathiraa) చిత్రానికి అధికారిక తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఈ ‘మిడ్నైట్ మర్డర్స్’ (Midnight Murders) సినిమా. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. మిథున్ మ్యానువల్ థామస్ దర్శకత్వంలో కుంచకో బోబన్ ప్రధాన పాత్రలో నటించారు.
కథ ఏమిటంటే ?
అన్వర్ హుస్సేన్ (కుంచకో బోబన్) ఒక క్రిమినాలజిస్ట్, సైకాలజిస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్‌గా చేరాలనేది అతని కోరిక. సరిగ్గా అదే సమయంలో కొచ్చి నగరంలో కేవలం పోలీస్ అధికారులను మాత్రమే టార్గెట్ చేస్తూ ఒక సైకో కిల్లర్ అర్ధరాత్రి వేళల్లో అత్యంత కిరాతకంగా హత్యలు చేయడం ప్రారంభిస్తాడు.
చంపడమే కాకుండా వారి గుండెను, కళ్లను తీసేసి, కళ్లు తెరచుకుని చూస్తున్న న్యాయ దేవత ప్రతిమలను కిల్లర్ అక్కడ వదిలి వెళ్తుంటాడు. ఈ నేపధ్యం లోనే పోలీస్ శాఖ ఈ కేసును ఛేదించడానికి అన్వర్ హుస్సేన్‌ను తమ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లో చేర్చుకుంటుంది. అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? పోలీసులనే ఎందుకు చంపుతున్నాడు? అతని వెనుక ఉన్న గతం ఏమిటి? అన్వర్ ఆ కిల్లర్‌ను ఎలా పట్టుకున్నాడు? అనేదే ఈ సినిమా కథ.
సినిమా ప్రారంభమైన 10వ నిమిషం నుంచే నేరుగా కథలోకి వెళతాం.ఎక్కడా అనవసరమైన లవ్ ట్రాక్‌లు, కామెడీ సీన్లు లేకుండా కేవలం ఇన్వెస్టిగేషన్ చుట్టూనే కథనం ఎంతో వేగంగా సాగుతుంది.సెకండ్ హాఫ్‌లో వచ్చే ప్రతి ట్విస్ట్ ప్రేక్షకుడిని అంచనా వేయనివ్వకుండా సర్ప్రైజ్ చేస్తుంది. కిల్లర్ ఎవరో తెలిసే ఆ క్షణం చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది.
ఈ రివేంజ్ డ్రామాను డైరెక్టర్ ఆసక్తికరం గా తెరకెక్కించారు. సీరియల్ కిల్లర్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందనే విషయాన్ని ఉరిశిక్ష పడిన ఖైదీ ద్వారా చెప్పించారు. కిల్లర్ తెలివితో ఎప్పటికప్పుడు పోలీసులను తప్పుదారి పట్టిస్తూ వారికే సవాల్ విసురుతుంటాడు. చర్చి ఫాదర్ దుర్మార్గం కారణంగా ఓ కుటుంబం ఎలా బలైపోయిందో ఫ్లాష్ బ్యాక్ లో చూపారు.
సూషిన్ శ్యామ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది. సీన్లలోని భయాన్ని, థ్రిల్‌ను ఆయన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. కథలోని సస్పెన్స్‌ను కేవలం డైలాగ్స్ ద్వారానే కాకుండా, ప్రతి ఫ్రేమ్ ద్వారా ప్రేక్షకుడికి అనుభూతి కలిగేలా చేయడంలో కెమెరా మ్యాన్ షైజు ఖలీద్ విజువల్స్ ఈ సినిమాకు ఒక మేజర్ అస్సెట్.
కుంచకో బోబన్ క్లాస్ లుక్‌తో చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డిసిపి కాథరిన్గా ఉన్నిమయ ప్రసాద్,ఏసీపీ అనిల్ మాధవన్ గా జీను జోసెఫ్, హ్యాకర్ ఆండ్రూగా శ్రీనాథ్ బసి తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు.
కిల్లర్ ఎందుకు హత్యలు చేస్తున్నాడో తెలిపే ఫ్లాష్‌బ్యాక్ పాత సినిమాలను గుర్తుచేస్తుంది. సినిమా అంతా చాలా స్పీడ్‌గా సాగినప్పటికీ, ముగింపు సీన్లు కాస్త నాటకీయంగా మారి వేగం తగ్గుతుంది. అంతా బాగున్నప్పటికీ ఒకరిద్దరు చేసిన తప్పుకు అమాయకులైన కొంత మంది పోలీసులను చంపడం అనే అంశాన్ని కథా పరంగా దర్శకుడు జస్టిఫై చేయలేకపోయారు.
‘మిడ్నైట్ మర్డర్స్’ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌ను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. ప్రస్తుతం ఆహా (Aha) అమెజాన్ ప్రైమ్ వీడియో,యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్న వారు చూడవచ్చు.

