చూడదగిన యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ !!

Sharing is Caring...

 Scary facts……..

‘The Freelancer’  యాక్షన్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది . ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే (స్పెషల్ ఆప్స్, బేబీ ఫేమ్) దీనిని క్రియేట్ చేయగా, భవ్ ధులియా దర్శకత్వం వహించారు. శిరీష్ థోరట్ రాసిన ‘ఎ టికెట్ టు సిరియా’ అనే నవల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది.  జియో హాట్‌స్టార్ లో  స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది.

కథ ఏమిటంటే ?

ముంబై మాజీ పోలీస్ అధికారి అవినాష్ కామత్ (మోహిత్ రైనా)  అంతర్జాతీయంగా పని చేసే ఒక ఫ్రీలాన్స్ మెర్సెనరీ (డబ్బు కోసం పనిచేసే ప్రైవేట్ సైనికుడు) గా మారుతాడు. అతని స్నేహితుడైన మరో మాజీ పోలీస్ అధికారి ఇనాయత్ ఖాన్ (సుశాంత్ సింగ్) కుమార్తె అలియా (కశ్మీర పరదేశి) పెళ్లి తర్వాత మోసపోయి, ఐసిస్ (ISIS) ఉగ్రవాదుల గుప్పిట్లో ఉన్న సిరియాలో చిక్కుకుపోతుంది.

నరకప్రాయమైన ఆ సిరియా ఉగ్రవాద స్థావరం నుండి ఆ అమాయకపు అమ్మాయిని అవినాష్ కామత్ ఎలా రక్షించాడు? దానికి అతను ఎలాంటి వ్యూహాలు పన్నాడనేదే ఈ సిరీస్ ప్రధాన కథ. అవినాష్ కామత్ పాత్రలో మోహిత్ రైనా అద్భుతమైన నటనను కనబరిచారు. ఒకవైపు కఠినమైన సైనికుడిగా, మరోవైపు ఎమోషనల్ బాబాయ్‌గా ఆయన బాడీ లాంగ్వేజ్, ఇంటెన్స్ లుక్స్ సిరీస్‌ను నిలబెట్టాయి.

భయంతో వణికిపోతూనే తప్పించుకోవాలని చూసే అలియా పాత్రలో కశ్మీర పరదేశి అద్భుతంగా నటించింది. ఆమె కళ్లలోనే భయం, నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తాయి. డాక్టర్ ఆరిఫ్ ఖాన్‌గా అనుపమ్ ఖేర్ తన అనుభవంతో కూడిన నటనతో కథకు మంచి డెప్త్ ఇచ్చారు. ఇతరులు కూడా పాత్రల పరిధిలో బాగా నటించారు. 

సిరియా బ్యాక్‌డ్రాప్‌ను చూపించిన విధానం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ చాలా రియలిస్టిక్‌గా,హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) ఉత్కంఠను పెంచింది. కథ సన్నివేశాల కూర్పుపై బాగానే కసరత్తు చేశారు. 

ఈ సిరీస్‌ రెండు భాగాలుగా అందుబాటులో ఉంది ..మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి.నీరజ్ పాండే గత చిత్రాల వలె ఇది ఫాస్ట్ పేస్ యాక్షన్ సిరీస్ కాదు. పాత్రలను పరిచయం చేస్కుంటూ అసలు కథలోకి వెళతారు. ముగింపు భాగం (ది కంక్లూజన్) లో వచ్చే కొన్ని ట్విస్టులు, ఎక్స్‌ట్రాక్షన్ (రెస్క్యూ) సీన్లను  బాగా చిత్రీకరించారు.

సిరీస్ చివరి ఎపిసోడ్ లో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఐసిస్ డెన్ (ఉగ్రవాద స్థావరం) లోకి చొరబడి, శత్రువుల బుల్లెట్ల వర్షం మధ్య అలియాను అవినాష్ కామత్ రక్షించే రెస్క్యూ ఆపరేషన్,  క్లైమాక్స్ ఫైట్ సీన్ ఈ ఎపిసోడ్‌కు ప్రాణంగా నిలిచాయి.  

ఈ వెబ్ సిరీస్ కేవలం ఒక యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాదు. నిజ జీవిత సంఘటనల నేపథ్యంలో తెరకెక్కింది. సిరీస్‌లో అలియా (కశ్మీర) ఒక సాధారణ ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి. ఒక మంచి లగ్జరీ జీవితం లభిస్తుందనే నమ్మకంతో ఒక ఎన్నారై (NRI) వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. పూర్తిగా ఆ కుటుంబం గురించి తెలుసుకోకుండా ఉచ్చులో చిక్కుకుంటుంది. 

ఆలియా అత్తగారి కుటుంబం మొదట్లో చాలా ఆధునికంగా, సాదాసీదాగా కనిపిస్తుంది. కానీ ఒక మతబోధకురాలి ప్రసంగాలు, తప్పుడు ప్రచారాల వల్ల వారు నెమ్మదిగా ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షితులవుతారు. అది ఎంత ప్రమాదమో తెరపై చక్కగా చూపారు .

సిరియాలోని భయానక వాస్తవాలు ఎలా ఉన్నాయో దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చూపారు. గ్లోబల్ పొలిటికల్ నెట్‌వర్క్స్, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), అమెరికా సీఐఏ (CIA) వంటి నిఘా సంస్థలు ఎలా పనిచేస్తాయి? టెక్నాలజీ సహాయంతో అపరిచిత ప్రాంతాలలో ఉన్న వ్యక్తుల లొకేషన్‌ను ఎలా ట్రాక్ చేస్తారు?ఎలా దాడి చేస్తారో కూడా చూపించారు.కథ కొంత స్లో గా నడిచినా చూడదగిన సిరీస్ ఇది. దర్శక నిర్మాతలు వ్యయప్రయాసల కోర్చి సిరీస్ ను నిర్మించారు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!