Bhavanarayana Thota…..
(ఒక చిన్నమాట: ఈ వ్యాసం చదివాక ఒకరిద్దరికి అనుమానం వచ్చింది. కార్తికేయన్ గారి పుస్తకంలో విషయాలే చదివినట్టుందని. అంటే, నేను సొంతగా చెప్పిందేమీలేదన్నది వాళ్ళ అభిప్రాయం కావచ్చు. నిజానికి కార్తికేయన్ గారి పుస్తకం 2008 లో ఇంగ్లీష్ వెర్షన్, ఆ తరువాత తెలుగు వెర్షన్ వచ్చాయి. నేను ఎంత చెప్పినా, ఆయనకంటే ఎక్కువ ఎలాగూ చెప్పలేను. కానీ 1998 లో .. అంటే ఆయన పుస్తకం రావటానికి పదేళ్ళ ముందే వార్త ఆదివారం అనుబంధంలో ఇలాంటి వ్యాసం రాశానని చెప్పుకోవటానికి ఈమధ్యనే నాకు ఆ వ్యాసం దొరికింది.)
రాజీవ్ గాంధీ హత్య జరిగి 35 ఏళ్ళు. 1991 మే 22 న సిట్ దర్యాప్తు మొదలైంది. రాజీవ్ గాంధీ హత్య జరిగిందన్న వార్త విన్నవాళ్ళు ఇంకా ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకోలేదు. మానవబాంబు పేలి 12 గంటలు కూడా కాకముందే సీఆర్పీఎఫ్ డీజీ కేపీఎస్ గిల్ నుంచి హైదరాబాద్ లో సీఆర్పీఎఫ్ ఐజీగా ఉన్న కార్తికేయన్ కు ఫోనొచ్చింది. కేసు విచారించే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) చీఫ్ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నది ఆ ఫోన్ సారాంశం.
రాజకీయ జోక్యం ఉండకూడదు, ఎట్టిపరిస్థితుల్లోనూ థర్డ్ డిగ్రీ ఉపయోగించను, సీఆర్పీఎఫ్ లోనే కొనసాగించాలి అనే మూడు షరతుల మీద కార్తికేయన్ సిద్ధమయ్యారు. ఢిల్లీ వెళ్ళాల్సిన విమానాన్ని రద్దు చేసి అప్పటికప్పుడు ఒక కంపెనీ సీఆర్పీఎఫ్ తో చెన్నై వెళ్ళటానికి ఏర్పాట్లు జరిగిపోయాయి.
అదే రోజు.. మే 22 న పనిమొదలైంది. కానీ, ఎక్కడినుంచి ఎలా మొదలుపెట్టాలో తెలియని కేస్ అది. ఐబీ గాని, రా గాని ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ చేయలేకపోయాయి. ఇది మహాత్మా గాంధీ హత్య లాగానో, ఇందిరాగాంధీ హత్యలాగానో దోషులు కళ్ళముందే కనిపించిన కేసు కాదు, రెడ్ హాండెడ్ గా పట్టుబడటానికి. లోతుగా దర్యాప్తు చేసి దోషులను గుర్తించలేకపోతే అమెరికాలో కెనడీ హత్యలాగే రకరకాల ఊహాగానాలతో ఎప్పటికీ వీడని మిస్టరీలాగే మిగిలిపోయేది.
నిజానికి అప్పటిదాకా ఆ రోజుకు అది బాంబు పేలుడు మాత్రమే. రాజీవ్ గాంధీ సహా 18 మంది చనిపోయారు. పుట్టినరోజునాడే చనిపోయిన చెంగల్పట్టు ఎస్పీ ఇక్బాల్ తోబాటు ఇంకో 8 మంది పోలీసులూ ఉన్నారు.
నేరం నుంచి నేరస్తులవైపు చూస్తూ ముందుగా జర్నలిస్టులతో భేటీ అయ్యారు కార్తికేయన్. ఏదైనా క్లూ దొరుకుతుందన్న ఆశ.
రాజీవ్ మరణవార్తను ముందుగా ప్రపంచానికి చెప్పిన పిటిఐ రంగరాజ్ ను ఆరోజు నుంచే కార్తికేయన్ సరదాగా ‘ది కిల్లర్ ఆఫ్ రాజీవ్ గాంధీ’ అనేవారు. జర్నలిస్టులతో భేటీ సరిగ్గా కార్తికేయన్ ఆశించిన ఫలితమిచ్చింది. ఈ ఘటనలో ఫొటోగ్రాఫర్ హరిబాబు చనిపోవటం గురించి అతడికి ఉద్యోగమిచ్చిన శుభాసుందరానికి ఫోన్ చేస్తే హరిబాబు మరణం కంటే అతని కెమెరాలో రీల్ గురించి ఎక్కువగా కలవరపడ్డాడని ఒక ఫొటోగ్రాఫర్ చెప్పాడు.
ఆ తరువాత కాలంలో ఈ కేసులో ఈ ఫొటోగ్రాఫర్ తో బాటు మరో ఇద్దరు జర్నలిస్టులు రహస్య సాక్షులుగా ఉన్నారు.ఘటనాస్థలంలో సేకరించిన వస్తువులనుంచి అప్పటికప్పుడు కెమెరా తెప్పించి రీల్ బయటికి తీసి ప్రింట్లు వేయించారు. 13 ఫోటోలు స్పష్టంగా ఉండగా 14వ ఫోటో మాత్రం నారింజ రంగు మెరుపులాంటి మంటతో రికార్డయింది. పేలుడులో తాను కూడా చనిపోతానని ఊహించని హరిబాబు తీసిన ఆఖరి ఫోటో అది.
వాటిని జాగ్రత్తగా గమనిస్తే వాటిలో ఒంటికన్ను శివరాసన్, థాను, నళిని చాలా ఫోటోల్లో ఉన్నారు. థాను చేతిలో గంధపు మాల, ఆమె రాజీవ్ కు పాదాభివందనం చేస్తున్నప్పుడే పేలుడు జరగటం గుర్తించగలిగారు. అక్కడ దొరికిన ఛిద్రమైన ఆమె శరీరభాగాలు, బెల్ట్ బాంబ్ అవశేషాలు చూశాక గాని అది మానవ బాంబ్ అనే నిర్థారణకు రాలేకపోయారు. అలా భారత్ లో మానవ బాంబును ప్రయోగించటం అదే మొదటిసారి.
ఇంకోవైపు శుభాసుందరం ప్రస్తావన తేకుండానే ఆయన కదలికల మీద నిఘాపెట్టారు. ఫొటోగ్రాఫర్ హరిబాబు పాత్రమీద కూడా దర్యాప్తు చేస్తామన్న ప్రకటన తగలాల్సిన చోట తగిలింది. శుభాసుందరం హడావిడిగా హరిబాబు తల్లిదండ్రుల సంతకాలతో ఒక పత్రికాప్రకటన తయారుచేసి పేపర్ ఆఫీసులన్నీటికీ పంపాడు.
ఆయన సూచన మీద హరిబాబు తల్లిదండ్రులు హరిబాబు వస్తువులన్నిటినీ సర్ది తెలిసినవాళ్ళ ఇంటికి పంపారు. అది కూడా కార్తికేయన్ నిఘా నుంచి తప్పించుకోలేకపోయింది. భయపడిన హరిబాబు బంధువులు వాటిని సిట్ కార్యాలయ భవనం ‘మల్లిగై’ కి పంపారు.
ఆ సామానులో హరిబాబు డైరీ దొరికింది. అందులో ఉన్న రశీదు అసలు రహస్యం చెప్పేసింది. అది మానవబాంబు థాను చేతిలో ఉన్న గంధపు మాల కొన్న రశీదు. కళాత్మక వస్తువులకు పెట్టింది పేరైన ‘పూంపుహార్’ నుంచి హత్య జరిగిన రోజు కొనుగోలు చేసినట్టు చెప్పిన డాక్యుమెంట్. ఈ పథకం హరిబాబుకు తెలుసుననటానికి అది నిదర్శనం. అదే డైరీలో ఉన్న కరెంట్ బిల్ ఆధారంగా ఒక ఇంటిని గుర్తించారు.ఈ కుట్రలో కీలకభాగస్వాములైన భార్యాభర్తలు నళిని, మురుగన్ ఉండే ఇంటి నుంచి వారు పారిపోతుండగా అరెస్ట్ చేశారు.
కుట్రను అమలు చేయటానికి ఎల్టీటీఈ తరఫున వచ్చిన శివరాసన్ కి, అఖిలకు ఆశ్రయమిచ్చింది వీళ్ళే. బెల్ట్ బాంబ్ అమర్చుకోవటానికి వీలుగా ఉండే బట్టలు కొనిపెట్టటమే కాదు, మానవబాంబు పేలుడు జరిగిన సమయంలో అక్కడ ఉండి కూడా ప్రాణాలతో బైటపడింది శివరాసన్, నళిని మాత్రమే. నళిని, ఆమె భర్త మురుగన్ చెన్నై సైదాపేట బస్టాండ్ లో అరెస్టయ్యారు. అప్పుడు నళిని రెండు నెలల గర్భవతి. ఇక మిగిలిన శివరాసన్, శుభ ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలింపు మొదలైంది.
ఆచూకీ చెప్పినవారికి బహుమతులంటూ పెద్దఎత్తున పోస్టర్లు వెలిశాయి.శ్రీపెరంబుదూరులో ఫెయిలైతే ఢిల్లీలో ప్లాన్ బి అమలు చేయాలనుకున్నారు. ఇందులో మానవబాంబుగా మారటానికి సిద్ధమైన యువతి 17 ఏళ్ల ఆదిరై. శ్రీలంక ప్రభుత్వోద్యోగిగా పనిచేసి రిటైరైన 65 ఏళ్ల కనకసభాపతి ఆ అమ్మాయికి తాత. చెన్నైలో ఒక ఎల్టీటీఈ సానుభూతిపరుడి ఇంట్లో వీళ్ళిద్దరూ మకాం వేశారు. అక్కడే ఒక రేడియో స్టేషన్ ఏర్పాటుచేసి జాఫ్నా నుంచి సూచనలు అందుకుంటూ వచ్చారు.
వాళ్ళకోసం కూడా గాలింపు ఉద్ధృతంగా సాగుతోంది. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో నిఘా పెరిగింది. రిజర్వేషన్ చార్టులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చారు.నెలరోజులు నిండక ముందే వీళ్ళిద్దరూ ఢిల్లీకి టికెట్స్ రిజర్వ్ చేసుకున్నట్టు గుర్తించి పోలీసులు అదే రైలెక్కారు. సింహళ భాష తెలిసిన పోలీస్ తేలిగ్గానే వాళ్ళ సంభాషణను పట్టేశాడు. వాళ్ళకోసం ఇంకెవరైనా వస్తారేమోనని ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు.
నాగపూర్ లో అరెస్ట్ చేద్దామనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. ఢిల్లీలో ఎవరైనా రిసీవ్ చేసుకొని ఆశ్రయమిస్తారేమో చూడాలనుకున్నారు. ఢిల్లీ పోలీసులను కూడా అలర్ట్ చేశారు. కానీ వాళ్ళు మామూలుగానే ఆటో మాట్లాడుకొని ఏదైనా హోటల్ కి వెళ్ళాలని నిర్ణయించుకోవటంతో వాళ్ళను అనుసరిస్తూ హోటల్ దాకా వెళ్ళి అక్కడ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.
కానీ వాళ్ళకు మద్రాసులో వాళ్ళున్న ప్రాంతం పేరు తెలియదు. ఇల్లు గుర్తుపట్టగలిగే మార్గం పోలీసులకు కనబడలేదు. ఆ ఇంట్లో వాళ్ళ పేర్లు మాత్రమే తెలుసు. కానీ ఈ ఆధారం చాలదు. మూడు రోజుల ఇంటరాగేషన్ తరువాత ఆ పిల్లల యూనిఫాం డిజైన్ మాత్రం పోలీసులు కనుక్కోగలిగారు. అలాంటి యూనిఫాం చెన్నైలో ఎక్కడెక్కడ వాడుతున్నారో ఆరా తీస్తే నాలుగు స్కూళ్ళు తేలాయి.
ఆ నాలుగు స్కూళ్ళలో ఈ పేర్లతో అక్కాచెల్లెళ్ళు ఉన్న స్కూలు ఏదో గుర్తించి ఆ పిల్లల ఇంటి అడ్రస్ పట్టుకోగలిగారు. తెలిసిన మరుక్షణం వెళ్ళి దాడిచేశారు గాని అప్పటికే ఆ ఇంటి యజమాని డిక్సన్ తప్పించుకున్నాడు. రేడియో పరికరాలు మాత్రం దొరికాయి. పోలీసుల వేట తీవ్రం కావటంతో భయపడి, తాను అజ్ఞాతంలో ఉండలేనని అర్థం చేసుకున్న డిక్సన్ ఆ తరువాత కొద్ది రోజులకే కోయంబత్తూరులో సైనైడ్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తమిళనాడుతోబాటు ఢిల్లీ, కోల్ కతా లాంటి చోట్ల కూడా గాలింపు సాగుతూ ఉంది. ఈ కేసులో అత్యంత కీలకమైన శివరాసన్, శుభ మిగిలారు. ఒక పాల టాంక్ లో దాక్కొని శివరాసన్, శుభ బెంగళూరు పారిపోయినట్టు ఆలస్యంగా గుర్తించగలిగారు. కార్తికేయన్ బృందానికి ఈ సమాచారం నిరాశ కలిగించినా, పట్టుదల పెంచింది. నిఘా మరింత పెంచారు.
ఎట్టకేలకు బెంగళూరు శివార్లలోని కొన్నకుంటెలో శివరాసన్ ల సహా ఆరుగురు ఉంటున్నట్టు సమాచారం అందింది. ప్రాణాలతో పట్టుకోవటానికి రకరకాలుగా ప్రయత్నించారు. ఆ ఇంటికి వెళ్ళే నీళ్ళపైపులలోనో, పాల పాకెట్లలోనో మత్తు మందు కలపాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి పోలీసులు చుట్టుముట్టి ఉన్నారని గ్రహించిన శివరాసన్ బృందం ఆత్మహత్యకే మొగ్గుచూపింది.
PL.Read it also ……………..రాజీవ్ హత్యకేసును కార్తికేయన్ ఎలా ఛేదించారు? ( 2 )

