గాడిద పాల సబ్బులమ్మి శ్రీమంతుడయ్యాడు !

Sharing is Caring...

గాడిద పాలతో సబ్బులేమిటి ? అని ఆశ్చర్యపోకండి. నిజమే గాడిద పాలతో సబ్బులు చేయవచ్చు. అలా చేసే అతగాడు ఇపుడు రెండుచేతులా సంపాదిస్తున్నాడు. గాడిద పాల సబ్బు తో ప్రయోజనాలు చాలా ఉన్నాయి. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.మృదువుగా మారుస్తుంది.  చర్మపు ముడుతలను తొలగిస్తుంది.చర్మాన్ని పునరుత్పత్తి చేస్తుంది. యాంటీ ఏజింగ్ కు దోహదపడుతుంది.

ఇవన్నే గమనించే జోర్డాన్‌కు చెందిన 32 ఏళ్ల ఎమాద్ అట్టియట్ గాడిద పాలతో వ్యాపారం మొదలెట్టేసాడు. మొదట్లో ఈ బిజినెస్ గురించి స్నేహితులతో మాట్లాడితే వాళ్లంతా ఎగతాళి చేశారు. అయినా ఎమాద్ నిరాశ పడలేదు. ఎమాద్‌ కి వ్యవసాయ నేపథ్యం కూడా లేదు. మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో పీజీ చేసి సరైన ఉద్యోగం దొరక్క ఇబ్బందులు పడ్డాడు.తల్లి జుబి ధైర్యం చెప్పడంతో వ్యాపారం ప్రారంభించాడు.కొత్తల్లో పెద్దగా ఆదరణ లభించకపోయినా సంవత్సరం తర్వాత వ్యాపారం పుంజుకుంది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.

“అటాన్ డాంకీ మిల్క్ సోప్స్” పేరిట మార్కెట్లోకి వెళ్లిన సబ్బులకు డిమాండ్ కూడా పెరిగింది. జోర్డాన్ రాజధాని అమ్మాన్ కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మడాబా అనే ప్రాంతంలో ఒక షెడ్ వేసి అందులో 12 గాడిదలను పెంచుతున్నాడు. ఒక్కో గాడిద రోజుకు రెండు లీటర్ల పాలు ఇస్తుంది.ఎలక్ట్రానిక్ హ్యాండ్ పంప్ సాయంతో అక్కడి సిబ్బంది పాలు పితుకుతారు. కొన్ని పాలు గాడిద పిల్లల కోసం వదిలేస్తారు.

అలా సేకరించిన పాలను శీతలీకరించి … తర్వాత వాటిని అమ్మాన్లో ఉన్న ప్రాసెసింగ్ సెంటర్‌కు పంపుతారు. అక్కడ ఎమాద్ తల్లి పర్యవేక్షణలో ఈ సబ్బులు తయారవుతాయి.ఈ గాడిద పాలలో ఇతర తైలాలు, వనమూలికలు కలుపుతారు. దాన్ని మూసలో గడ్డకట్టేలా చేస్తే గాడిద పాల సబ్బులు  తయారువుతాయి. లీటరు పాలతో 30 సబ్బులు చేయవచ్చు.

చర్మానికి మంచి నిగారింపు వస్తుంది అనే నమ్మకంతో వినియోగదారులు ఈ సబ్బులను వాడుతున్నారు. ప్రస్తుతం ఎమాద్  నెలకు 4500 సబ్బులను  ఉత్పత్తి చేస్తున్నాడు. మార్కెట్లో  85 గ్రాముల సబ్బు ధర 11 డాలర్లు ( దాదాపు రూ. 807) సబ్బులకు డిమాండ్ పెరిగే కొద్దీ ఆమేరకు ఉత్పత్తిని పెంచాలని ఎమాద్ ప్లాన్ చేస్తున్నాడు. కొంతమంది సిబ్బందిని తీసుకుని  క్రీమ్స్ .. లోషన్స్ ఉత్పత్తి  కూడా  మొదలుపెట్టే యోచనలో ఉన్నాడు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!