ఆ ‘సులేమాని’ టీ కథేమిటి ?

Sharing is Caring...

Specialty of Sulaimani Tea………..

‘సులేమాని’ టీ అనేది దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కేరళలోని మలబార్ తీర ప్రాంతంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఒక సాంప్రదాయక ‘బ్లాక్ టీ’ (పాలు లేని చాయ్) ఇది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, దీనికి అరబిక్ సంస్కృతితో ముడిపడి ఉన్న ఒక గొప్ప చరిత్ర ఉంది.

ఈ టీ కి అరబిక్ మూలాలు ఉన్నాయి.’సులేమాన్’ అంటే అరబిక్ భాషలో “శాంతి పురుషుడు” అని అర్థం. పూర్వం మలబార్ (కోజికోడ్) తీరానికి వ్యాపారం కోసం వచ్చిన అరబ్ వర్తకుల ద్వారా ఈ టీ కేరళకు పరిచయమైంది. ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం, ప్రవక్త మహమ్మద్ ‘అల్-గహ్వా’ (డేట్స్,నల్ల మిరియాలు వేసి మరిగించిన పానీయం) తాగేవారని, కాలక్రమేణా అరబ్బులు భారతదేశానికి వచ్చాక స్థానిక తేయాకును కలిపి దీన్ని ‘సులేమాని చాయ్’గా మార్చారని చెబుతారు.

ఈ సులేమాని టీ ప్రత్యేకత ఏమిటంటే …ఇందులో అస్సలు పాలు వాడరు. ఇది అచ్చమైన, స్పష్టమైన అంబర్ (గోల్డెన్ బ్రౌన్) రంగులో ఉండే లిక్విడ్ టీ.దీని రుచి చాలా విలక్షణంగా ఉంటుంది. మసాలాల ఘాటుతో పాటు, నిమ్మరసం వల్ల వచ్చే పులుపు, బెల్లం వల్ల వచ్చే తీపి కలగలిసి నాలుకకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.

మంచి నాణ్యమైన అస్సలు అస్సాం లేదా నీలగిరి తేయాకును నీళ్లల్లో మరిగిస్తారు తర్వాత కొన్ని చుక్కల నిమ్మరసం పిండుతారు. ఇది టీ రంగును బంగారు రంగులోకి మారుస్తుంది. అల్లం , ఏలకులు ,దాల్చినచెక్క ను దంచి అదనపు తాజాదనం కోసం కొన్ని పుదీనా ఆకులు వేస్తారు. ఇందులో  పంచదార కంటే బెల్లం లేదా తేనె వాడటం సాంప్రదాయ పద్ధతి.

ఈ టీ తాగడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.కేరళలో  ముస్లిం వివాహ భోజనాలు (ముఖ్యంగా మలబార్ బిరియాని) తిన్న తర్వాత కచ్చితంగా సులేమాని టీ ఇస్తారు. ఇందులో ఉండే అల్లం, నిమ్మరసం, పుదీనా మాంసాహారాన్ని చాలా వేగంగా జీర్ణం చేస్తాయి. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.

పాలు, చక్కెర లేకపోవడం వల్ల  యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.చలికాలంలో లేదా వర్షంలో తడిసినప్పుడు ఈ వేడి వేడి సులేమాని టీ తాగితే గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి.

దుల్కర్ సల్మాన్ నటించిన సూపర్ హిట్ మలయాళ సినిమా ‘ఉస్తాద్ హోటల్’ (Ustad Hotel) చూసిన వారికి ఈ టీ బాగా గుర్తుంటుంది.ఆ సినిమాలో తాత మనవడికి సులేమాని టీ ప్రాముఖ్యతను చెప్తూ—”ప్రతి సులేమాని టీ లోనూ కొద్దిగా మహబ్బత్ (ప్రేమ) కలవాలి, అప్పుడే అది నిజమైన సులేమాని అవుతుంది” అనే డైలాగ్ చాలా పాపులర్ అయింది.

కేరళకు వెళ్తే ప్రతి చిన్న టీ కొట్టు లోనూ సులేమాని దొరుకుతుంది.కోజికోడ్ / కాలికట్ ,మలప్పురం,  కొట్టక్కల్,కొచ్చి,త్రిసూర్ , గురువాయూర్, తిరువనంతపురం పట్టణాలలో ఈ టీ ని సేవించవచ్చు. అక్కడికి వెళ్ళినపుడు టేస్ట్ చూసి రండి .

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!