Sai Vamshi ………
హింస..నిట్టనిలువునా హింస..మనిషిని కోసి పారేసే హింస. మగాళ్లకు ఆవేశం వస్తే ఆడవాళ్ల మీద హింస. మగాళ్ల ఆనందం కోసం ఆడవాళ్లపై హింస. సుఖానికి, దు:ఖానికి, మంచికీ, చెడ్డకీ..అన్నింటికీ హింసే. ఆడవాళ్ల బతుకుల్లో అడివంత హింస.
ఊరిపెద్ద చంద్రెగౌడ భార్య కమలి. ఏం కోరుకుంది గొప్పగా? బిడ్డల్లేని బతుకు. అయినా మేనల్లుడు ఆ కొరత తీరుస్తున్నాడు. పాడిపంట, డబ్బుదస్కం ఉన్నాయి. చాల్లే ఈ జీవితానికి అనుకోవచ్చు. కానీ మొగుడనేవాడు ఇంట ఉండాలిగా! పగలంతా ఊళ్లో..తిండి వేళకు మాత్రం ఇంట్లో..ఆపై పక్కూళ్లో భర్త పోయిన బసక్క ఇంట్లో. రోజూ ఇదే తంతు.
‘గౌడ బసక్కను ఉంచుకున్నాడు..పెట్టుకున్నాడు..’ అని ఊళ్లోవాళ్ల మాటలు ఒకదిక్కు..భర్త తనకు దూరమైపోతున్నాడన్న బాధ మరో దిక్కు. కమలి జీవితానికి హింస. భరించలేని హింస.ఊరి ఆడవాళ్లది మరో రకం తీరు. భర్త ఉండగానే మరొకరి పొత్తు కోరే రకం ఒకరు. భర్తను తెలియకుండా చాటుమాటు వ్యవహారాలు నడిపి..ఆపై ఊరిపెద్దల ముందు దెబ్బలు తినే రకం మరొకరు.
ఆడది మాత్రమే తప్పు చేస్తుందా? ఆడదానికి ఒంటిగా తప్పు చేసే శక్తి ఉందా? మగాణ్ని ఎందుకు ఏమీ అనరు? అనరంతే! ఇది మొగాడి లోకం. మొగాడి కోసం నిర్మించిన లోకం. ఇక్కడ ఆడవాళ్లకు మిగిలేది హింసే. రెండు ఊళ్లకు మధ్య రచ్చ రగిలి, చూసుకుందాం అంటే చూసుకుందాం అనే స్థితికి వచ్చినప్పుడు కూడా మధ్యలో శలభాల్లా మాడిపోవాల్సింది ఆడవాళ్లే.
భర్త బసక్క గడప తొక్కకూడదని, తనతోనే ఉండాలని అడవికెళ్లి, మంత్రగాడితో పూజలు చేయించింది కమలి. ఏం లాభం? మగాడి బుద్ధి మంత్రాలకు మారుతుందా? మగాడు పెట్టే హింస పూజలతో తీరుతుందా? అలా పూజకోసం మేనల్లుణ్ని తీసుకొని అడవికి వెళ్లే వేళ పక్క ఊరి పెద్దమనుషులు అడ్డగించారు. చెయ్యి పట్టకున్నారు. బలవంతం చేసి అత్యాచారం చేశారు.
ఆమె భర్త మీద కసిని ఆమె మీద తీర్చుకున్నారు. హింస..తప్పని హింస..అయినా తట్టుకోవాల్సిన హింస. ఒంటికి, మనసుకు తగిలిన దెబ్బలతో కమలి ఇల్లు చేరింది. భర్త ఆవేశంతో ఊగిపోయి కత్తి పట్టుకొని పక్కూరికి కదిలాడు. అతని వెంట మిగిలిన మగాళ్లు వెళ్లారు. కనిపించినవాళ్లని తెగనరికారు. పోలీసులు వచ్చి వాళ్లని తీసుకెళ్లారు.
ఇక ఊరి ఆడవాళ్ల పరిస్థితి? ఆడవాళ్లకు కాసింత ఊరట, సాంత్వన దొరికేందుకు ఏదీ గతి?ఇద్దరు మగాళ్లు తిట్టుకున్నా సరే..‘నీయమ్మా’ అంటూ ఆడాళ్లు కావాలి. కొట్టుకుంటే ‘నేను చేతికి గాజులు తొడుక్కున్న ఆడదాన్ని కాదురా’ అని ముందుకు ఉరకాలి. ఒకరినొకరు పొడుచుకున్నా ‘నీ పెళ్లాం మెళ్లో తాళి తెగుతుంది’ అనాలి. పంతాలు, పట్టింపులు, పౌరుషాలు, పగలు, ప్రతీకారాలు..అన్నీ మగాళ్లవి.
హింస మాత్రం అచ్చంగా ఆడవాళ్లది. రామాయణం అంతేగా..భారతం అంతేగా..ఎన్ని కథలు కదిలించినా బాధపడేది ‘ఇంతే’గా!అలనహళ్లి సాయికృష్ణ అనే కన్నడ రచయిత బతికింది 40 ఏళ్లే కానీ, నిండుగా మిగిలిపోయే రచనలు చేసి వెళ్లిపోయారు. మైసూర్ యూనివర్సిటీలో లెక్చరర్‌గా పనిచేసి, ఆపై సెంట్రల్ యూనివర్సిటీ ఆప్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో మరికొంతకాలం పనిచేసి, ఆపై పూర్తికాలం రచయితగానే బతికారు.
పోతనలాగా వ్యవసాయం చేస్తూ ‘అలనహళ్లి తోట’ను పెంచారు. ఆయన తోట పక్కనే ప్రముఖ రచయిత యు.ఆర్.అనంతమూర్తి తోట ఉండేది. ఎటువంటి కాలాలవి! రచయిత అట్లా దర్జాగా బతికిన కాలాలు. తనున్న కాలంలోనే చాలా అడ్వాన్డ్ రచనలు చేశారన్న పేరు పొందిన సాయికృష్ణ 1989లో 41 ఏళ్లకే మరణించారు.
ఆయన రాసిన ‘కాడు’ నవల ఆధారంగా ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు గిరీశ్ కర్నాడ్ తెరకెక్కించిన కన్నడ సినిమా ఇది. ఇందులో ముఖ్యమైన చంద్రెగౌడ పాత్రను ప్రముఖ నటుడు అమ్రీష్‌పురి పోషించారు. ఇటు దర్శకుడిగా గిరీశ్..అటు నటుడిగా అమ్రీష్..వాహ్..ఇది కదా కాంబినేషన్! కమలిగా నందిని భక్తవత్సలం నటించారు. ఆమె నటించిన సినిమా ఇదొక్కటే.
ఒక్క సినిమాలోనే నటించినా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. అంత గట్టి పర్ఫార్మెన్స్ ఆమెది. భారతదేశంలో ప్యారలల్ సినిమా ప్రస్థానం శ్యామ్ బెనగల్ తీసిన ‘అంకుర్’(1974)తో మొదలైందని అంటారు కానీ, అంతకు ఏడాది ముందే ‘కాడు’ విడుదలైంది.
కాడు అంటే అడవి. చిత్రమంతా కిట్టీ అనే చిన్నకుర్రాడి వైపు నుంచి మనకు కనిపిస్తుంది. ఒకరకంగా అతనే ఈ సినిమాకు హీరో అనిపిస్తాడు. ఊరి మగాళ్లను పోలీసులు పట్టుకెళ్లిన తర్వాత ఆ ఊరంతా అతనికి అడవిలా తోస్తుంది. దిక్కుతోచక అడవిలోకి పారిపోతే అక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది. ఊరి కంటే అడవే ఉత్తమం అనిపించే స్థితిలోకి మనుషుల చుట్టూ పరిస్థితులు మారిపోతాయనే అర్థంతో సినిమా ముగుస్తుంది.
సినిమా యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.
PS: ‘కాడు’ తన ఫేవరేట్ సినిమా అని, ఈ సినిమా స్ఫూర్తితోనే ‘దేవర్‌మగన్’(తెలుగులో ‘క్షత్రియపుత్రుడు’) సినిమా కథ రాసుకున్నానని కమల్‌హాసన్ చెప్పారు.

