ఆకట్టుకునే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ !!

Sharing is Caring...

A gripping investigative thriller…………..

కేరళ క్రైమ్ ఫైల్స్’ (Kerala Crime Files)  మలయాళ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్. ప్రస్తుతం దీనికి సంబంధించి రెండు సీజన్లు అందుబాటులో ఉన్నాయి.మసాలా లేని ఇన్వెస్టిగేషన్ సిరీస్ ఇది. ఫామిలీ తో చూడ వచ్చు

సీజన్ 1: 

కేరళలోని ఒక లాడ్జిలో జరిగిన సెక్స్ వర్కర్ హత్యను ఛేదించే క్రమంలో పోలీసులు చేసే దర్యాప్తు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నిందితుడు ఇచ్చిన తప్పుడు చిరునామా ఆధారంగా పోలీసులు అతడిని ఎలా పట్టుకున్నారనేది ఆసక్తికరంగా చూపించారు.

సహజమైన పోలీసు విచారణ ఎలా ఉంటుందో వాస్తవికతకు దగ్గరగా చూపించడం ఈ సీజన్ ప్లస్ పాయింట్. ఆరు రోజుల విచారణ ను 6 ఎపిసోడ్స్ లో చూపించారు.ఒక చిన్న లాడ్జిలో హత్య జరిగిన తీరు, అక్కడ పోలీసులు క్రైమ్ సీన్‌ను పరిశీలించే విధానం చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. కేవలం ఒక ‘నకిలీ అడ్రస్’ తప్ప పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవడం కథపై ఆసక్తిని పెంచుతుంది.

రిజిస్టర్‌లో రాసిన ‘నీండకర’ అనే అడ్రస్ వెతుక్కుంటూ పోలీసులు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఊరి పేర్లు, ఇంటి పేర్లతో జరిగే గందరగోళం, పోలీసులు పడే కష్టం చాలా సహజంగా అనిపిస్తుంది.పోలీసులు పని ఒత్తిడి వలన వ్యక్తిగత జీవితాన్ని ఎలా కోల్పోతుంటారో పాత్రలు ద్వారా దర్శకుడు తెలియ జేస్తాడు.

టెక్నాలజీ అంతగా లేని 2003లో, ఒకే ఒక ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు చేసే ప్రయత్నాలు సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తాయి.ఈ సిరీస్ ప్రత్యేకత ఏంటంటే, ఇందులో అనవసరమైన ఫైట్లు లేదా మాస్ డైలాగులు ఉండవు. ఒక నిజమైన కేసును పోలీసులు ఎలా డీల్ చేస్తారో అంత రియలిస్టిక్‌గా ఉంటుంది.

అజు వర్గీస్, లాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అందరూ కూడా చక్కగా నటించారు. దర్శకుడు అహ్మద్ కబీర్ పోలీస్ విచారణ పద్దతులను లోతుగా  స్టడీ చేసి కథను తెరకెక్కించారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్, జితిన్ స్టానిస్లాస్  కెమెరా పనితనం ఆకట్టుకుంటాయి. 

 సీజన్ 2

ఈ సీజన్లో అదృశ్యమైన పోలీస్ అధికారి ‘అంబిలి రాజు’ (ఇంద్రాన్స్) అన్వేషణ చుట్టూ కథ సాగుతుంది. కేవలం ఒక రక్తపు మరకలున్న ఫోన్ క్లూగా దర్యాప్తు మొదలవుతుంది. ఇది మొదటి సీజన్ కంటే ఎక్కువ ఎమోషనల్ పాయింట్స్‌తో సాగుతుంది. ఎక్కడా అనవసరమైన పాత్రలు కనిపించవు.  అర్జున్ రాధాకృష్ణన్, ఇంద్రాన్స్ తమ నటనతో ఆకట్టుకున్నారు.  ఇందులో ప్రేక్షకులను ఆకట్టుకునే  ఇంట్రెస్టింగ్ సీన్స్ చాలా  ఉన్నాయి.

కథ ప్రారంభంలోనే కణియార్విల స్టేషన్‌లోని పోలీసులందరూ నేరస్తులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో బదిలీ అవుతారు. కొత్తగా వచ్చిన ఆఫీసర్లు అక్కడ బాధ్యతలు చేపట్టే లోపే, బదిలీ అయిన వారిలో ఒకరైన అంబిలి రాజు (ఇంద్రాన్స్) అదృశ్యమయ్యాడని తెలియడం ఉత్కంఠను పెంచుతుంది.

ఒక మ్యూజియంలో జరిగిన దొంగతనం విచారణ సమయంలో ఒక పోలీస్ డాగ్ (టెర్రీ) హఠాత్తుగా ఒక పిన్-హోల్డర్‌ను మింగేస్తుంది. ఈ సీన్ కథలో ఒక కీలకమైన మలుపుగా మారి, అసలు రహస్యం కుక్క కడుపులో ఉందనే విషయాన్ని పోలీసులు గుర్తించినప్పుడు వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి.

అంబిలి రాజు కేవలం ఒక కానిస్టేబుల్ అయినప్పటికీ, నేరస్థులపై అతను చూపే ప్రభావం, అతని నెట్‌వర్క్ గురించి పోలీసులు తెలుసుకునే సీన్లు అతని క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా చూపిస్తాయి.ఇక డాగ్ ఎపిసోడ్ బాగుంటుంది. ఒక కుక్క కదలికలను బట్టి విచారణ  సాగుతుంది. 

కిరణ్ దాస్ నేపథ్య సంగీతం (BGM),బహుళ్ రమేష్ (Bahul Ramesh) కెమెరా పనితనం సిరీస్ కి ప్లస్ పాయింట్. ఈయనే ఈ సీజన్‌కు దర్శకత్వం కూడా వహించారు. అనవసరమైన డ్రామా లేకుండా కథ సాగడం సిరీస్ కి ప్లస్ పాయింట్. కథనం కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుంది. తెలుగు డబ్బింగ్‌లో కొన్ని డైలాగులు అంతగా సెట్ కాలేదు.అయినా చూడవచ్చు.  
క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి, ముఖ్యంగా మలయాళ శైలి ఇన్వెస్టిగేషన్ నచ్చేవారికి ఇది ఒక మంచి వీకెండ్ వాచ్. మొదటి సీజన్ చూడకపోయినా నేరుగా రెండో సీజన్ చూడవచ్చు, ఎందుకంటే రెండు సీజన్ల కథలు వేర్వేరు. జియో హాట్ స్టార్ లో ఈ సిరీస్ ఉంది. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!