Political strategies ……………….
లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ అల్లుడు ఆధవ్ అర్జున హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తరపున విల్లివాక్కం అభ్యర్థిగా బరిలోకి దిగారు.విజయ్ పార్టీలో ఆధవ్ అర్జున ఇపుడు కీలక పాత్ర పోషిస్తున్న తీరు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఆపార్టీకి రాజకీయ వ్యూహకర్త కూడా అతగాడే.
ఆధవ్ అర్జున శాంటియాగో మార్టిన్ అల్లుడు కావడంతో ఆయనకు భారీ ఆర్థిక వనరులు ఉన్నాయి. విజయ్ పార్టీకి అవసరమైన వ్యూహరచనలో, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆధవ్ అర్జున గతంలో దళిత సంఘాలతో కూడా సన్నిహితంగా ఉండటంతో, నియోజకవర్గంలోని మైనారిటీ, ఎస్సీ ఓటర్లను ఆకట్టుకుంటారని పార్టీ భావిస్తోంది. ఆయన మామ శాంటియాగో మార్టిన్‌పై జరుగుతున్న ఈడీ దర్యాప్తులో భాగంగా గతంలో ఆధవ్ అర్జున నివాసాలపై కూడా సోదాలు జరిగాయి. ఈ అంశాన్నిడీఎంకే, ఏఐఏడీఎంకే నేతలు ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారు.
“లాటరీ కింగ్” అల్లుడు అనే ముద్ర ఆయనపై ఉండటం వల్ల, విజయ్ చెప్పే “అవినీతి రహిత రాజకీయాలు” అనే నినాదానికి ఇది ఇబ్బందిగా మారుతుందనే విమర్శలు కూడా వస్తున్నాయి.ఇక చెన్నై నగరంలోని అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో విల్లివాక్కం ఒకటి. ఇక్కడ ఓటర్లు విద్యావంతులు, మధ్యతరగతి వర్గానికి చెందినవారు.
ఆధవ్ అర్జున ఒక పక్కా వ్యూహంతో విల్లివాక్కంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువత, ఐటీ రంగం వారిని ఆకట్టుకోవడానికి డిజిటల్ క్యాంపెయినింగ్ను ఎక్కువగా వాడుతున్నారు.విల్లివాక్కంలో అధికార డీఎంకే (DMK) అభ్యర్థిగా కార్తీక్ మోహన్, ఏఐఏడీఎంకే తరపున విజయకుమార్ లతో తలపడుతున్నారు.
గత 11 ఎన్నికల్లో 8 సార్లు డీఎంకే ఇక్కడ విజయం సాధించి బలమైన పట్టు కలిగి ఉంది..ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కార్తీక్ కోసం సీఎం కుమార్తె, అల్లుడు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. వీరితో పోటీ పడి ఆధవ్ అర్జున ఎంతవరకు ఓట్లు చీల్చగలరనేది ఆసక్తికరంగా మారింది.
ఇక శాంటియాగో మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ తాను కొత్తగా స్థాపించిన లక్ష్య జననాయక కచ్చి (Latchiya Jananayaga Katchi – LJK) పార్టీ తరపున పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.ఆయన నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (NDA) కూటమి అభ్యర్థిగా కామరాజ్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో సుమారు ₹597 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. దీనితో ఆయన పుదుచ్చేరి ఎన్నికల్లో అత్యంత ధనిక అభ్యర్థిగా నిలిచారు.
మార్టిన్ భార్య లీమా రోజ్ తమిళనాడులోని లాల్గుడి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. శాంటియాగో మార్టిన్ కుటుంబం 2026 తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక విలక్షణమైన వ్యూహంతో బరిలోకి దిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కీలక సభ్యులు మూడు వేర్వేరు రాజకీయ పార్టీల తరపున పోటీ చేస్తున్నారు. ఈ వ్యూహం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడం, రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
pl. read it also …………………తమిళనాడు ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థి !!

