దావూద్ బలహీన పడ్డాడా ?సైలెంట్ అయ్యాడా ?

Sharing is Caring...

Dawood’s company weakened……

మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉంటున్నాడు. భారత నిఘా సంస్థలు (RAW, IB)  అంతర్జాతీయ సంస్థల (Interpol, UN) నిరంతర నిఘా వల్ల దావూద్ తన కదలికలను బాగా తగ్గించుకున్నాడు.ఫోన్ వాడకాన్ని దాదాపు నిలిపివేసి, కేవలం నమ్మకస్తులైన అనుచరుల ద్వారానే సందేశాలు పంపిస్తున్నాడని నిఘావర్గాల సమాచారం.

దావూద్‌ వయసు సుమారు 70 ఏళ్లు. గత కొన్ని ఏళ్లుగా దావూద్ గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం.వయస్సు పైబడటం వల్ల మునుపటిలా చురుగ్గా ఉండలేకపోతున్నాడు. గతంలో మాదిరిగా ఎక్కడకైనా స్వేచ్ఛగా వెళ్లే అవకాశాలు లేవు. శత్రువులు ఏ క్షణంలో ఎక్కడ దాడి చేస్తారో అనే భయం తో ఇంటి నుంచి బైటకు రావడం లేదు.  

దావూద్ ఏకైక కుమారుడు మొయిన్ కస్కర్ నేర సామ్రాజ్యానికి దూరంగా వెళ్లి మత గురువుగా మారడం దావూద్‌ను మానసికంగా దెబ్బతీసింది. తన తర్వాత తన సామ్రాజ్యాన్ని ఎవరు నడిపిస్తారనే ఆందోళనతో అతను కుంగుబాటుకు గురయ్యారని అంటారు.

భారత ప్రభుత్వం చేపట్టిన గట్టి చర్యల వల్ల అతని ముఖ్య అనుచరులు చాలా మంది పట్టుబడటం లేదా హతమవ్వడం వల్ల ‘డి-కంపెనీ’ నెట్‌వర్క్ బలహీనపడింది. ప్రస్తుతం అతను కేవలం ఛోటా షకీల్, తన సోదరుడు అనీస్ ఇబ్రహీం వంటి కొద్దిమందిపైనే ఆధారపడుతున్నాడు.

అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి వల్ల పాకిస్తాన్ కూడా అతన్ని బయటి ప్రపంచానికి కనిపించకుండా అత్యంత రహస్య ప్రాంతాల్లో ఉంచుతోంది. అతను పాకిస్తాన్‌లోని తన నివాసాల నుండి బయటకు రావడం దాదాపు నిలిపివేశాడు.

దావూద్ ఇబ్రహీం ప్రపంచవ్యాప్తంగా భారీ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. దావూద్ ఆస్తుల విలువ సుమారు $6.7 బిలియన్ల నుండి $10 బిలియన్ల (సుమారు ₹55,000 కోట్ల పైచిలుకు) వరకు ఉండవచ్చని సమాచారం. దావూద్‌కు భారత్, పాకిస్తాన్, యూఏఈతో పాటు బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, టర్కీ, స్పెయిన్, మొరాకో వంటి 16 దేశాలలో 50కి పైగా ఆస్తులు, వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి.

ముంబైలోని వివాదాస్పద ఆస్తుల సెటిల్మెంట్లు, ప్రధాన నిర్మాణ ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు ఉన్నాయి. దుబాయ్‌లో కూడా దావూద్ కి  నిర్మాణ రంగంలో వ్యాపారాలు ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్ ఈయన ప్రధాన ఆదాయ వనరులు.

అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్, క్యాసినోల ద్వారా వేల కోట్లు గడిస్తున్నాడు.ఫాంటసీ స్పోర్ట్స్ యాప్స్, ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వినియోగదారుల డేటాను సేకరించి, హవాలా మార్గాల్లో డబ్బును విదేశాలకు మళ్లించడం వంటి ‘డిజిటల్ ప్లండర్’ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.కరాచీలో అత్యంత భద్రత కలిగిన క్లిఫ్టన్ ప్రాంతం నుండి రహస్యంగా తన కార్యకలాపాలను సాగిస్తున్నాడు.

గతంలో బాలీవుడ్ చిత్రాలకు ఫైనాన్సింగ్ చేయడం, సినిమాల పంపిణీ హక్కుల ద్వారా ఆదాయం పొందేవాడు.భారతదేశంలో ఆర్థిక అస్థిరతను సృష్టించడానికి నకిలీ కరెన్సీని సరఫరా చేసే వాడు.ఇపుడు అవన్నీ దాదాపుగా బంద్ అయ్యాయి.ఇండియాలో దావూద్ డి కంపెనీ కార్యకలాపాలు దాదాపుగా తగ్గిపోయినట్టేనా అంటే తాజా సమాచారం మేరకు దావూద్ ఇబ్రహీం నెట్‌వర్క్ ప్రస్తుతం చెల్లాచెదురైన చిన్న ముఠాలుగా (scattered nodes) పనిచేస్తోంది తప్ప, పాతకాలపు సంఘటిత నేర సామ్రాజ్యంగా లేదు.

మునుపటిలా బహిరంగంగా కాల్పులు, గ్యాంగ్ వార్‌లు, ప్రత్యక్ష దోపిడీలు ఇప్పుడు కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ ముఠా హవాలా నెట్‌వర్క్, నకిలీ కరెన్సీ, డ్రగ్ స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలు సాగిస్తోంది.నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)  ముంబై పోలీసులు డి-కంపెనీ అనుచరులపై నిరంతరం దాడులు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వీరి ఆస్తుల వేలం, కీలక వ్యక్తుల అరెస్టుల వల్ల ఈ నెట్‌వర్క్ ఆర్థికంగా బలహీనపడింది.

దావూద్ ఇబ్రహీం ‘డి-కంపెనీ’ ఉనికి గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. అయితే, అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని చెప్పలేము; అది తన పనితీరును మార్చుకుని డిజిటల్, ఆర్థిక నేరాల వైపు మళ్లింది. 

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!