Magic touch
పాతాళ భైరవిలో ఎస్వీఆర్ ను నేపాళ మాంత్రికుడిగా… ఎన్టీఆర్ ను తోట రాముడిగా చూపింది ఆయనే. అలాగే ఎన్టీఆర్ ను కృష్ణుడిగా, రాముడిగా తీర్చిదిద్దింది ఆయనే. ఆయన పేరే పీతాంబరం. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కి ఎంజీఆర్ కు ఆయన పెర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్. ఎంతో ఓపికతో ఆ ఇద్దరికీ ఆయన మేకప్ చేసేవారు. పాత్రకు తగినట్టుగా మేకప్ కుదిరితేనే .. ఆ పాత్ర జనంలోకి వెళుతుంది.
ఆర్టిస్టులను పాత్రలో ఒదిగేలా మలచేది మేకప్ మ్యాన్లే. సినిమా నిర్మాణం లో వారి పాత్ర ఎంతోకీలకం. అందులో పీతాంబరంది అందెవేసిన చేయి. పీతాంబరం మొదట ప్రముఖ సంగీత దర్శకుడు మహదేవన్ వద్ద అసిస్టెంట్ గా చేరాడు. ఆ తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ కి అసిస్టెంట్ గా చేరారు. అక్కడ నుంచి బెంగాల్ కి చెందిన మేకప్ ఆర్టిస్ట్ హరిబాబు దగ్గర చేరి మేకప్ చేయడంలో మెళకువలు నేర్చుకున్నాడు. 1945 లో వాహిని స్టూడియోస్ లో చేరారు.
అక్కడ నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. తన సత్తా ఏమిటో చాటుకున్నారు. ఎన్టీఆర్ ని కృష్ణుడిగా, రాముడిగా, శ్రీ వేంకటేశ్వర స్వామిగా తీర్చిద్దిన ఘనత పీతాంబరందే. ఎన్టీఆర్ కటౌట్లకు థియేటర్ల దగ్గర అభిమానులు పాలాభిషేకం చేసేవారంటే, ఆయన్ని అంత అందంగా తీర్చిదిద్దిన ఘనత పీతాంబరానికే దక్కుతుంది. ఎన్టీఆర్ చెన్నైలో ఉండగానే ఆయన దర్శనం కోసం జనం వచ్చే వారంటే అదంతా మేకప్ మహాత్యమే.
అంటే ఆ పాత్ర జనం గుండెల్లో అలా నాటుకుపోయిందన్న మాట. ఎన్టీఆర్ ని రాముడుగా, కృష్ణుడుగా చూపించేందుకు పీతాంబరం చాలా కష్టపడేవారట. అసిస్టెంట్స్ నీలిరంగు కలిపి ఇస్తే, దాన్నిఎన్టీఆర్ ఒంటికి, మొహానికి పూసేటప్పటికీ పీతాంబరం వేళ్ళు నొప్పి పుట్టేవట.
మేకప్ పూర్తయ్యేక వచ్చిన రూపం చూసాక ఆ నొప్పులు ఇట్టే మాయమై పోయేవట. చిత్తజల్లు పుల్లయ్య డైరెక్షన్ లో వచ్చిన శ్రీ వేంకటేశ్వర మహత్యం చిత్రంలో చివరి సీన్ లో ఎన్టీఆర్ ని శ్రీ వేంకటేశ్వరునిగా చూపించడానికి పీతాంబరం చాలా కష్టపడ్డారు.మేకప్ పూర్తయ్యాక ఆ రూపం చూసి పీతాంబరం ఒక విధమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారట.
‘ఏడుకొండల వాడా వెంకట రమణా’ అంటూ అసిస్టెంట్ తో కల్సి ఎన్టీఆర్ కాళ్ళ మీద పడ్డారట.వీరిద్దరిని చూసి ఇతర సిబ్బంది అదే విధంగా నమస్కారాలు చేశారట. మేకప్ వేసిన పీతాంబరమే ఒక విధమైన అనుభూతికి లోనైతే ….ఇక వెండితెరమీద ఎన్టీఆర్ ని చూసిన ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారంటే ఆశ్చర్యమే లేదు.
ఎన్టీఆర్ సినిమా రంగం వదిలేశాక ఆయన కూడా రిటైర్మెంట్ తీసుకున్నారు.చిత్ర పరిశ్రమలోని మేకప్ ఆర్టిస్ట్ ల సంక్షేమం కోసం ఒక అసోసియేషన్ ను ప్రారంభించి 30ఏళ్ళు దానికి పీతాంబరం ప్రెసిడెంట్ గా చేశారు.
ఇక పీతాంబరం కొడుకు వాసు ఓ స్టార్ డైరెక్టర్. చంద్రముఖి, నాగవల్లి వంటి చిత్రాలను డైరెక్ట్ చేసింది వాసునే. ఈయన డైరెక్టర్ గానే కాకుండా, రచయితగా, నటుడిగా కూడా రాణిస్తున్నారు. పీతాంబరం మేకప్ ఆర్టిస్ట్ గా చేస్తూనే నిర్మాతగా తమిళం లో కొన్ని సినిమాలు తీశారు.
అలాగే 1975లో ఎన్టీఆర్ తో తెలుగులో తీసిన ‘అన్నదమ్ముల అనుబంధం’ హిట్ అయింది. తర్వాత తమిళ్లో తీసిన సినిమాలకు లాస్ వచ్చింది. ఆ సమయంలో ఎన్టీఆర్ కాల్ షీట్స్ ఇవ్వగా ‘యుగంధర్’ సినిమా తీశారు.అలాగే ఎంజీఆర్ తో తమిళం లో మరో సినిమా తీశారు.
ఈ రెండు సినిమాల ద్వారా నష్టాల్లోనుంచి బయట పడ్డారు. శ్రీదేవి మేకప్ మెన్ చక్రపాణి, సుందరమూర్తి, సెల్వరాజ్ తదితరులు ఆయన వద్ద శిష్యరికం చేసి మేకప్ ఆర్టిస్టులుగా రాణించారు. పీతాంబరం ఫిబ్రవరి 21, 2011 న కన్నుమూసారు.
—————KNM