మనసును తాకే కథ !!

Sharing is Caring...

A must read story ……….

నేనొక ఉబెర్ డ్రైవర్‌ని. ఎక్కువగా రాత్రి షిఫ్ట్ చేస్తాను. గత వారం రాత్రి 11-00 గంటలకు ఒక వృద్ధుడిని ఎక్కించుకున్నాను. కారులో కూర్చోగానే ఆయన అన్నాడు. “ఈ రాత్రి నన్ను ఐదు చోట్లకు తీసుకెళ్లాలి. నేను నీకు 5వేలరూపాయలు ఇస్తాను. నగదు. కానీ పనంతా పూర్తయ్యే వరకు ‘ఎందుకు’ అని అడగకూడదు.” అని ఐదు చిరునామాలు  ఇచ్చాడు.

మొదటిది  :— టౌన్ లో ఒక ఇల్లు… ఆయన కారులోనే కూర్చొని ఆ ఇంటిని పది నిమిషాలు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు. కళ్లలో నీరు. మాట లేకుండా ఏడుస్తున్నాడు. తరువాత “సరే పద ఇక…” అన్నాడు.

రెండోది :— ఒక ప్రాథమిక పాఠశాల.. అది ఖాళీగా, చీకటిగా ఉంది. ఆయన కారు దిగి వెళ్లి, ఆ పాఠశాల గ్రౌండ్ లో ఆటబొమ్మల దగ్గర ఉన్న ఊయలపై కూర్చున్నాడు. ఇరవై నిమిషాలు అక్కడే గడిపాడు. తిరిగి వచ్చి అన్నాడు..“ఇక్కడే నేను 43 సంవత్సరాలు పిల్లలకు పాఠాలు బోధించాను. నా జీవితంలో నాకు దొరికిన అత్యుత్తమ ఉద్యోగం ఇది.”

మూడోది :— ఒక చిన్న రెస్టారెంట్… లోపలికి వెళ్లి కాఫీ ఆర్డర్ చేశాడు. కానీ తాగలేదు. ఒక మూల టేబుల్ దగ్గర ఒంటరిగా కూర్చుని చుట్టూ చూస్తూ పదిహేను నిమిషాలు గడిపాడు. తిరిగి వచ్చి అన్నాడు:“1967లో నా భార్యతో మొదటి డేట్ ఇక్కడే.”

నాలుగోది :– శ్మశానం… ఒక సమాధి దగ్గరకు వెళ్లి ముప్పై నిమిషాలు నిలబడి మాట్లాడాడు. ఏమన్నాడో వినిపించలేదు. తిరిగి వచ్చినప్పుడు కళ్లంతా ఎర్రగా ఉన్నాయి. “నా భార్య చనిపోయి ఈరోజుకి మూడేళ్లు.” అన్నాడు.

ఐదోది :– ఆసుపత్రి……  కారును పార్క్ చేయమన్నాడు. “ఇదే చివరిది.” అని నా వైపు చూసి అన్నాడు.“ఇప్పుడే నీకు కారణం చెబుతాను. నాకు నాలుగో దశ క్యాన్సర్ ఉంది. ఇంకో కొన్ని వారాలు… లేక కొన్ని రోజులు మాత్రమే ఉండొచ్చు. ఈ రోజు రాత్రి నా మొత్తం జీవితాన్ని ఒకసారి.. చివరిసారి చూడాలని అనిపించింది.”   అనగానే నేను ఏడవడం మొదలుపెట్టాను.

“ఆ ఇల్లు:— అక్కడే నా పిల్లలను పెంచాను. ఆ పాఠశాల:— అక్కడే నా జీవితానికి అర్థం దొరికింది.ఆ రెస్టారెంట్:— అక్కడే నేను ప్రేమలో పడ్డాను. ఆ శ్మశానం:— అక్కడే నేను వీడ్కోలు చెప్పాను. మరి ఈ ఆసుపత్రి:— ఇక్కడే ఈ రాత్రి చేరుతున్నాను. హాస్పీస్ వార్డులో. ఇక ఇంటికి వెళ్లను.” అని $500 నా చేతిలో పెట్టాడు. “ నేను అడిగినవన్నీ చూపించావు.. చివరి అపరిచితుడివి నువ్వే కావచ్చు. ఈ ప్రయాణం సున్నితంగా ఉండాలని అనుకున్నాను. నువ్వు నిజంగా దాన్ని సున్నితంగా చేశావు.”

నేను ఆ డబ్బు తీసుకోలేనని అన్నాను. కానీ ఆయన ఒత్తిడి చేశాడు. “దయచేసి తీసుకో… వదిలివేయడానికి నాకు ఎవరూ లేరు. నా పిల్లలు నాతో మాట్లాడరు. స్నేహితులు ఎవరూ అందుబాటులో లేరు. నువ్వు నాకు మూడు గంటల దయను ఇచ్చావు. అది $500 కంటే ఎక్కువ.”అంటూ చిన్న సూట్‌కేస్ తీసుకుని దిగే ముందు నన్ను అడిగాడు.

“నీ పేరు?”“మార్కస్.”“ధన్యవాదాలు, మార్కస్. నా జీవితంలో చివరి మంచి జ్ఞాపకంగా నువ్వు ఉండిపోయావు.” ఆయన ఆసుపత్రిలోకి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. నేను కారులో కూర్చొని ఒక గంట పాటు ఆగకుండా ఏడ్చాను. మరుసటి రోజు తిరిగి వెళ్లాను. ఆయన గది 412. పూలతో వెళ్లి తలుపు తట్టాను. ఆయన చిరునవ్వుతో…. “మార్కస్…! నువ్వు మళ్లీ వచ్చావా?”

“అలా వదిలేయలేకపోయాను. మీరు బాగున్నారా?” అన్నాను. “చనిపోబోతున్నాను. కానీ నిన్న రాత్రి నా జీవితం మొత్తాన్ని మరోసారి చూసాను. అందుకే… బాగున్నాను.” అలా రెండు వారాలపాటు ప్రతి రోజూ వెళ్లాను. కాఫీ, న్యూస్ పేపరు తీసుకెళ్లాను. వార్తలు చదివాను. కొన్నిసార్లు నిశ్శబ్దంగా కూర్చున్నాం. ఆయన తన ఆనందాలు, బాధలు, పశ్చాత్తాపాలు అన్నీ చెప్పాడు.

“నేను ఒంటరిగా చనిపోతాననుకున్నాను. కానీ నువ్వున్నావు. అపరిచితుడిగా వచ్చి నా చివరి రోజుల్లో నాకు ఆప్తుడివయ్యావు.. అది ఒక వరం.” ఆయన చేతిని పట్టుకుని  “మీరు ఇక ఒంటరిగా లేరు అన్నాను. 
ఆయన “మార్కస్.. ప్రజలకు చెప్పు. అపరిచితులను నిజంగా చూడమని చెప్పు. మనమందరం ఎక్కడికో వెళ్తున్నాం. కొందరు వేగంగా, కొందరు నెమ్మదిగా. మార్గమధ్యంలో దయ చూపమని చెప్పు. నువ్వు చూపావు. ” అని తెల్లవారుజామున 3:17కి ఆయన కళ్లుమూశారు.

అంత్యక్రియలకు ఆరుగురే వచ్చారు — నేను, ముగ్గురు నర్సులు, ఒక న్యాయవాది, పత్రికలో చదివి వచ్చిన ఒక పూర్వ విద్యార్థి. 43 సంవత్సరాలు బోధించిన మనిషి. 52 సంవత్సరాలు ఒక స్త్రీని ప్రేమించిన మనిషి. 81 సంవత్సరాలు జీవించిన మనిషి. ఆయన అంత్యక్రియలకు ఆరుగురు మాత్రమే.. అందుబాటులో ఉన్న వారు.

అప్పుడు నేను ఇలా ప్రసంగించాను:
“ప్రతి అపరిచితుడు ఎవరికో ఒక ప్రపంచం. ప్రతి ఉబెర్ ప్రయాణికుడికి ఒక కథ ఉంది. మనం దాటిపోతున్న ప్రతి మనిషి జీవిస్తూ, చనిపోతూ, ఎవరో తనను గమనించాలని ఆశిస్తూ ఉంటాడు. ఆయన నాకు $500 ఇచ్చాడు. కానీ దాని కంటే విలువైనదాన్ని ఇచ్చాడు — అపరిచితుల పట్ల దయ అనేది అదనపు విషయం కాదు. అదే జీవితం. ఎందుకంటే మనమందరం అపరిచితులమే… ఎవరో ఒకరు ఆగి, మనల్ని చూసి, మన మాటలు విని, మనతో ఉండేంత వరకు.”

(ఎవరు రాసారో కానీ ,, రచయిత పేరు లేదు .. వాట్సాప్ గ్రూప్ ల్లో  చక్కర్లు కొడుతోంది) 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!