Marudhuri Raja………..
సినిమాలెన్నో మనకోసం..!కానీ.. సినిమామీద గౌరవం పెంచేవి అన్నోఇన్నో,ఏవో కొన్ని..! అలాంటి సినిమాలు గతంలో ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉండేవి. ఈ మధ్యకాలంలో మసకేశాయి. మసకలో నుండీ మళ్ళీఓ మెరుపు. “అమరన్” చూశాం రాత్రి. లేట్ నైట్ అయినా..! నిద్ర విషయం గుర్తుకు రాలేదు. చూశాక నిద్రే పట్టలేదు..!
2014 ఏప్రిల్ 25న తీవ్రవాదులతో పోరాడి, వారిని హతంచేసి, ఆ పోరాటంలోనే వీరమరణం పొంది, “అశోక చక్ర ” గౌరవం అందుకున్న వీరయోధుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ అమరచరిత్ర “అమరన్”.ఈ సినిమా చూస్తున్నంతసేపూ సరిహద్దుల్లో “సైనికుడి బాధ్యత ఎంత గొప్పది..” అని ఫీలింగ్.
ఓ కంటిలో నీటి చుక్కలు. ఓ కంటినుండి నిప్పురవ్వలు..దేశరక్షణకోసం,దేశప్రజల భద్రతకోసం కుటుంబాన్ని వొదులుకుని, ప్రాణాలను బలిదానాలు చేసినవాళ్ళు,చెయ్యటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ కథలు మనకు పూర్తిగా తెలియవు.శత్రువుల దాడికి చీలికలైన సైనికుల గుండె చప్పుళ్ళు మనకు సరిగా వినపడవు. వారి భార్యా,పిల్లల కన్నీళ్లు మనకు కనపడవు. ఆ కధల్లో ఒక కధకు సాక్ష్యంగా “అమరన్ “కనిపించింది..!
అప్రయత్నంగా.. కొన్ని కన్నీటి చుక్కలు గుండెల్లోకి జారి.. ఏదో దిగులు ఆవరించింది. పాపం వాళ్ళకేం తెలుసు..చెట్టుని, చెట్టు కాయల్ని కాపాడటానికే పుట్టారు. అవసరమైతే తెగించి చచ్చిపోతారు. కానీ..చెట్టు వేర్లలో కొంత చీడ ఉందని, కాయల్లో అక్కడక్కడా విషపు పురుగులున్నాయని..!
“నా జీతం 39వేలు”అని సైనికుడు అన్నప్పుడు..ఆశ్చర్యం,జాలి..! దేశం మధ్యలో.. లంచాలు మేసే అధికారుల కన్నా,ప్రజలను దోచే నాయకులకన్నా,అరాచకశక్తుల కన్నా, సంఘ విద్రోహులకన్నా,కబ్జాగాళ్ళకన్నా, స్మగ్లర్స్ కన్నా కిరాయి హంతకుల ఆదాయంకన్నా తక్కువ కదా..!
ఇంతమంది విద్రోహులు క్షేమంగా బతకటానికి,సుఖాలలో తేలటానికి, శాంతిభద్రతలు అందించే సైనికుడికి అంత తక్కువ ఆదాయమా..? వాళ్ళ దేశభక్తిని,కుటుంబాన్ని బతికించటానికి దారి ఒక్కటే. కానీ స్వదేశ ద్రోహుల దౌర్జన్య శక్తిని పోషించే రాచమార్గాలు ఎన్నో..!వాళ్ళు సరిహద్దుల్లో దేశానికి ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉంటారు.
వీళ్ళు.. సరిహద్దుల మధ్యలో స్వార్ధానికి ఎన్ని ప్రాణాలయినా తీయటానికైనా ఉత్సాహం గా ఉంటారు..!అందుకే.. ఓ కంట నీరు….ఓ కంట నిప్పులు..! సైనికులుగా వాళ్ళ ఉద్యోగానికి ఉన్న విలువేమిటో,గౌరవం ఏమిటో ఉద్యోగధర్మం ఏమిటో వాళ్ల నరనరాలకూ తెలుసు.
కానీ…సమాజంలో ప్రభుత్వ ఆఫీసుల్లో కొంతమంది ఉద్యోస్థుల నుండీ.. పెద్ద,పెద్ద చదువులు చదివి గొప్ప గొప్ప స్థాయిల్లో, ఎంతో గొప్ప బాధ్యతలు నిర్వహించాల్సిన వ్యక్తులకు, వాళ్ళ ఉద్యోగాలు తాకట్టు వస్తువులు తమ అవసరాలకోసం, ప్రమోషన్లకోసం, డబ్బుకోసం పడుపు వృత్తి చేయించటానికి వాడుకునే అమాయక వేశ్యలు..!
ఇలాంటివన్నీ వినీ చూసి….సైనికుడి నిబద్దతను, నిజాయితీ గురించి ఆలోచిస్తే… వాళ్ళు అంకితం చేసిన తమ జీవితాలకు, బలిదానాలు చేసిన ప్రాణాలకు మనం విలువ ఇస్తున్నామా..?? వారి త్యాగాలకు మనంకూడా నిబద్దతతో బతికి న్యాయం చేస్తున్నామా..? అని లోలోపల వేదనపడితే…. సమాధానం.. సిగ్గుతో తలవొంచుకు నిలబడింది.
నిస్సహాయంగా కూర్చునేకంటే వాళ్ళ కధకు..ఓ కన్నీటిచుక్కను అందించగలిగితే అదేవారికి మనం చెయ్యగల గౌరవవందనం..!! “అమరన్” చూసి పొందిన ఆవేదనకు ఇదే సమాధానం..!
మేజర్ ముకుంద్ వరదరాజన్ ” గా శివకార్తికేయ..నటన సినిమా గౌరవాన్ని విజయపతాకంలా ఎగరవేసింది.”ముకుంద్ వరదరాజన్”ప్రేమించి పెళ్లాడిన “రెబెకా వర్గీస్”గా సాయిపల్లవి అభినయం.. మహా నటీమణుల స్థాయికి చేరిపోయిందనిపిస్తుంది. సినిమా ఆద్యంతం ఆసక్తికరం గా సాగుతుంది .
సీరియస్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. కథానాయకుడి వ్యక్తిగత జీవితమే కాకుండా, వృత్తి జీవితాన్నీసహజంగా తెర కెక్కించిన తీరు బాగుంది. మన ఆర్మీ చేపట్టిన ఆపరేషన్లని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించారు. వార్ సన్నివేశాల రూపకల్పన, ఎడిటింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
గతంలో ఇలాంటి సినిమాలు వచ్చినప్పటికీ వాటికి భిన్నంగా ఉగ్రవాదులు, వాళ్ల సానుభూతిపరుల నుంచి ప్రతిఘటన ఎలా ఉంటుంది? ఆర్మీ ఆపరేషన్ల కోసం ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తారు. వివరించే సీన్స్ బాగా వచ్చాయి. ప్రేమ, కుటుంబ సన్నివేశాలు చాలా సహజంగా ఉన్నాయి.
హృద్యమైన ప్రేమకథతో పాటు, దేశభక్తిని రగిలించే సైనికుడి కథను తెరపై కెక్కించడం లో దర్శకుడు సఫలమయ్యారు. బలమైన భావోద్వేగాలతో సినిమా ప్రేక్షకుడిని కట్టి పడేస్తుంది. సినిమా సాంకేతికంగా, నిర్మాణ పరంగా ఉన్నతంగా ఉంది. జీవీ ప్రకాష్ సంగీతం చిత్రానికి ప్రధాన బలం అని చెప్పుకోవాలి.. సాయి కెమెరా పనితనం బాగుంది.
సినిమాని ఆద్యంతం రక్తికట్టించిన దర్శకుడు,రచయిత రాజ్ కుమార్ పెరియస్వామికి,ఇతర నటీనట సాంకేతిక బృందానికి, ఇంత గొప్పసినిమాను అందించిన నిర్మాతలు,మరెందరో, అందరికి అభినందన పూర్వక నమస్సులు.
అందరినీ ఆకర్షించే సినిమాకి బడ్జెట్టే కాదు, అప్పుడప్పుడు బాధ్యత కూడా ఉంటుంది..! నేను చేసిన పెద్ద నేరం, పొరపాటు ఏమిటంటే.. ఈ సినిమా గురించి పూర్తిగా తెలియక ఏమరపాటులో ధియేటర్ లో చూడకుండా.. Ott లో చూడటమే..!ఆ దోషం కూడా సినిమా చూడగానే పోయింది..!

