సెలెబ్రిటీలు హుందాతనం కోల్పోతున్నారా ?

Sharing is Caring...

 Mohammed Rafee …………….

సెలబ్రిటీలు వివిధ వేడుకలకు హాజరైనప్పుడు వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది! సెలబ్రిటీలమనే అహంభావం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు! ఇటీవల కాలంలో వరస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కన్నుకనపడక తప్పు చేసి ఆ తరువాత నాలుక్కరుచుకుని క్షమాపణలు చెప్పడం షరా మామూలు అయిపోయింది.

ఇందులో పెద్ద నటులు చిన్న నటులు అనే తేడా లేకుండా పోయింది. డాక్టర్ రాజేంద్రప్రసాద్ నుంచి బిగ్ బాస్ శివజ్యోతి వరకు ఇలాంటి వివాదాల్లో కూరుకొనిపోయారు. చిన్న తప్పులే కావచ్చు కానీ, సోషల్ మీడియా అరచేతిలోకి వచ్చాక ప్రతిదీ పెద్ద తప్పులాగే కనిపిస్తోంది.

పద్మభూషణ్ బాలకృష్ణ సైతం నోరు జారి ఎన్నోసార్లు విమర్శలకు గురయ్యారు. రాజేంద్రప్రసాద్ చేతికి మైక్ ఇస్తే ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. నిన్న కూడా బ్రహ్మానందం ను పుసిక్కిన ఏదో అనేశారు. ఆయన సరదాగా అందరూ మన మిత్రులే అనుకుని నోరు జారతారు. అది బూమరాంగ్ అవుతోంది. వెంటనే క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేయాల్సి వస్తోంది.

ఇక మోహన్ బాబు అయితే చెప్పక్కరలేదు. ఏకంగా ఆయన మీడియా వ్యక్తినే కొట్టి క్షమాపణ చెప్పింది చూసాం.
పద్మశ్రీ బ్రహ్మానందం కూడా అంతే! ఆయన కళ్ళు నెత్తి మీద వుంటాయని అంటుంటారు! అది నిజమో కాదో తెలియదు కానీ, మోహన్ బాబు 50 ఏళ్ల సినీ జీవితం వేడుకలో యర్రబెల్లి దయాకరరావును నెట్టేయడం వైరల్ గా మారిపోయింది.

వేడుకకు హాజరైన బ్రహ్మానందం ఎదురు పడగానే, అమెరికా తానా అటా వేడుకల్లో కలసి పాల్గొన్న స్నేహం కావచ్చు దయాకరరావు చెయ్యి కలిపారు. ఫోటో దిగుదాం అన్నారు. అబ్బెబ్బే అంటూ బ్రహ్మానందం పట్టించుకోకుండా విదిలించుకుని వెళ్లడం మనం చూసాం. మరుసటి రోజు సారీ చెబుతూ కప్పి పుచ్చుకునే దుస్థితి బ్రహ్మానందంకు ఏర్పడింది.

అలాగే శివజ్యోతి తిరుమలకు వెళ్లి పెద్ద వివాదంలోనే కూరుకుపోయింది. రిచ్ బెగ్గర్స్ ప్రసాదం అడుకుంటున్నాం అంటూ ఆమె తన తమ్ముడితో కలసి చేసిన రీల్ తో వివాదం రాజుకుంది. క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేసినా భక్తులు క్షమించే స్థితిలో లేరు. ఆమె ఆధార్ కార్డు టీటీడీ బ్లాక్ చేసినట్లు వార్త పుకార్లు కొట్టింది కానీ, అందులో నిజం లేదు.

ఇలాంటి వివాదాల్లో సెలబ్రిటీలు ఇరుక్కోవడానికి కారణం ఏమిటి? ఇమేజ్ చట్రంలో ఇరుక్కుని కొట్టుమిట్టాడటమే అని మానసిక విశ్లేషకులు అంటున్నారు. సెలబ్రిటీలుగా మారాక స్నేహితులు తగ్గిపోతారు. ఎప్పుడూ బిజీగా ఉన్నామని అనిపించుకునే మాయలో ఒంటరిగా మిగిలిపోతారు.

ఇంత కంటే పెద్ద పెద్ద స్టార్స్ ను మనము చూసాం. పబ్లిక్ లో ఎక్కడా,ఎప్పుడూ వారు నోరు జారలేదు. చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు. వందల ఫంక్షన్స్ కి హాజరైనప్పటికీ సహా నటీనటుల పట్ల గౌరవంగా మాట్లాడి ప్రేక్షకుల/సభికుల మెప్పు పొందారు కానీ చీత్కారాలకు గురి కాలేదు.

కానీ కొంతమంది వివిధ వేడుకలకు హాజరైనప్పుడు హుందాతనం మరచిపోయి,  మిన్నుకన్ను కనిపించని ధోరణిలో వ్యవహరించి అభాసుపాలవుతుంటారు! అందరూ కాదు కొందరు! అహంకారం అనే ముద్ర వేయించుకుంటారు మరి కొందరు! ఇంతేనయా… ఈ లోకం ఇంతేనయ్యా!

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!