త్వరలో కేదార్ నాథ్ కి రోప్ వే !!

Sharing is Caring...

Rope Way to Kedarnath ……………

జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్ నాథ్ కి త్వరలో రోప్ వే వేయనున్నారు. ఈ రోప్‌వే నిర్మాణం పూర్తయిన తర్వాత కేదార్‌నాథ్‌కు ప్రయాణ సమయం కేవలం 36 నిమిషాలు మాత్రమే పడుతుంది. ప్రస్తుతం 9 గంటల కఠినమైన ట్రెక్ చేస్తేనే కేదార్ నాథ్ కి చేరు కోలేని పరిస్థితులున్నాయి.

రోప్ వే సదుపాయం అమలులో కొస్తే గంటకు 1,800 మంది ప్రయాణికులు కేదార్ నాథ్ చేరుకుంటారు. రోప్ వే సామర్ధ్యం అంతే.  కేదార్‌నాథ్ కి ఏటా దాదాపు 20 లక్షల మంది యాత్రికులు ట్రెక్ చేస్తూ వస్తుంటారు. వారందరికీ ఈ సౌకర్యం అందుబాటు లోకి వస్తుంది. ముందు ముందు రద్దీ  కూడా పెరుగుతుంది.

కేదార్‌నాథ్ రోప్‌వే సోన్‌ప్రయాగ్‌ నుంచి కేదార్‌నాథ్ ఆలయం సమీపం వరకు నిర్మిస్తారు. 12.9 కి.మీ పొడవైన వైమానిక కేబుల్‌వే వేస్తారు. ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి ఆరు సంవత్సరాలు పడుతుంది. ఈ ప్రాజెక్ట్ అనుసంధానాన్ని మెరుగుపరచడమే కాకుండా, కేదార్ నాథ్ , సొన్ ప్రయాగ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.

పర్యాటకం ఊపందుకుంటుంది.కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్టును డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (DBFOT) మోడ్‌లో చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 4,081.28 కోట్లు. కేంద్ర క్యాబినెట్ ఈ ప్రాజెక్టు ను ఆమోదించింది. కేదార్‌నాథ్ రోప్‌వే సముద్ర మట్టానికి 3,583 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రోప్‌వేలలో ఒకటిగా నిలుస్తుంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనుంది. ప్రస్తుతం భక్తులు అనేక కష్టనష్టాలకు ఓర్చుకుని  16 కిలోమీటర్ల మేరకు నడుచుకుంటూ వెళ్తున్నారు.ఆలయానికి చేరుకోవడానికి దాదాపు 6 నుండి 9 గంటల ట్రెక్కింగ్ చేయాలి. రోడ్డు కూడా బాగా ఉండదు. వర్షాలు పడితే ప్రమాదాలు జరుగుతుంటాయి. హెలికాఫ్టర్ సర్వీసెస్ ఉన్నాయి కానీ ఖరీదు ఎక్కువ.

ఢిల్లీ నుండి కేదార్‌నాథ్‌కు రోడ్డు మార్గం దాదాపు 470 కి.మీ. దూరం ఉంటుంది. జాతీయ, రాష్ట్ర రహదారుల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. గౌరికుండ్ వరకు మాత్రమే వాహనాలు వెళతాయి. అక్కడ నుంచి యాత్రికులు ట్రెక్కింగ్ చేయాలి లేదా పోనీ/పాల్కీని అద్దెకు తీసుకోవాలి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!