స్పితి లోయ లో బౌద్ధ ఆరామాలు !

Sharing is Caring...

Beautiful spiti valley ………………..

అదొక అందమైన లోయ. హిమాచల్ ప్రదేశ్ కి ఈశాన్య భాగంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల వద్ద ఉన్నలోయ అది.స్పితి అంటే ‘మధ్య లో ఉన్న భూమి’ అని అర్థం. టిబెట్.. భారత దేశాల మధ్యలో ఉండటం వలన  ఆ లోయకు ఆ పేరు వచ్చింది. ఈ లోయతో పాటు ఇక్కడ ప్రవహిస్తున్న నదిని కూడా ‘స్పితి నది’ అని పిలుస్తారు.

హిమాచల్ ప్రదేశ్ అనగానే మొదటగా గుర్తుకొచ్చేవి. సిమ్లా, కులు, మనాలి. స్పితి లోయకు వెళ్లాలంటే కులు నుంచే వెళ్లాలి. స్పితి లోయకు వెళ్లే దారిలోనే రొహతాంగ్ పాస్ కనిపిస్తుంది. తర్వాత ఓ పక్కగా కుంజుమ్ కనుమ కనిపిస్తుంది.

హిమాలయాల నుంచి కరిగిన మంచు కుంజుమ్ కనుమ మీదుగా ప్రవహించి దిగువకు చేరుతుంది. ఆ నీరు ఒక చోట మడుగు కట్టి నది రూపం సంతరించుకుంటుంది. అదే స్పితి నది. ఆ లోయనే స్పితి లోయ అంటారు. కాగా కుంజుం కనుమకు ఆరు కిలోమీటర్ల దూరంలో ‘చందర్‌తాల్’ ఉంది.ఇది చంద్ర నది పరివాహక ప్రదేశం.

ఇక్కడ చంద్ర నది పాయగా చీలి చిన్న మడుగు లా ఉంటుంది.ఆ మడుగుకి ‘చందర్ తాల్’ అని పేరు ధర్మరాజు స్వర్గానికి వెళ్లడానికి ప్రయాణమై వెళుతున్నప్పుడు ‘చందర్ తాల్’ ని సమీపించేసరికి  ఇంద్రుడు పంపిన రథం ఎదురు పడిందని పురాణ కథనం ప్రచారంలో ఉంది.

ఇక్కడ ఎటు చూసినా కొండలు .. చుట్టూ పచ్చటి ప్రకృతి అందాలు. మలుపులు తిరిగే దారులు ,నీటి సరస్సులతో కూడిన ఈ ప్రాంతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.సముద్ర మట్టానికి 12500 అడుగుల ఎత్తున ఉండే ఈ ప్రాంతం బౌద్ధ సంస్కృతికి, బౌద్ధ ఆరామాలకు ప్రసిద్ధి గాంచింది. అతి తక్కువ జనసాంద్రత ప్రాంతాల్లో ఇదొకటి. ఇక్కడ కట్టడాలంటే బౌద్ధారామాలు, చైత్యాలు మాత్రమే కనిపిస్తాయి.

కాషాయధారులైన బౌద్ధులు కనిపిస్తారు. స్పితి లో కై ఆరామం ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇది భారతదేశం లోనే అతి పురాతన బౌద్ధ మఠం. దీన్ని చూసేందుకు పర్యాటకులు వెళుతుంటారు. కై మఠం స్పితి అంతర్భాగానికి ప్రధాన కేంద్రంగా ఉన్న కాజా నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ మఠం చిన్నగదులు, ఇరుకైన వసారాలతో ఉంటుంది. లోపల చిన్నప్రార్థన మందిరాలు ఉన్నాయి.లోపల గదుల్లో అద్భుతమైన కుడ్యచిత్రాలు, అరుదైన రాత ప్రతులు కనిపిస్తాయి. పూర్వం లామాలకు ఇక్కడ శిక్షణ ఇచ్చేవారు.

శీతాకాలంలో ఇక్కడ హిమపాతం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కన్నా తక్కువకి వెళతాయి. మే నుంచి అక్టోబర్ వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. స్పితికి సమీపంలోని రైల్వే స్టేషన్ జోగిందర్ నగర్ నారో గేజ్ రైల్వే స్టేషన్. అక్కడ నుంచి రవాణా సదుపాయం ఉంది.

స్పితి లోయ సమీపంలో వసతి కోసం దగ్గర్లోని కాజాలో బస చేయవచ్చు . కాజా లో హోటళ్ళు, హోమ్‌స్టేలు హాస్టళ్లు అందుబాటులో ఉన్నాయి. చుట్టుపక్కల ప్రదేశాలను చూసేందుకు కాజా అనుకూలమైన ఊరు. పురాతన టాబో ఆరామానికి ప్రసిద్ధి చెందిన టాబో లో హోమ్‌స్టేలు, చిన్న హోటళ్లు ఉన్నాయి.

ధంఖర్ లో కూడా స్టే చేయవచ్చు ఎత్తైన పర్వత దృశ్యాలు కనువిందు చేస్తాయి. అలాగే కిబ్బర్‌లో హోమ్‌స్టేలు, అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఎత్తైన ప్రదేశాలు. ధంకర్.. లాలుంగ్. కుంజుమ్ పాస్. …కిబ్బర్. …పిన్ వ్యాలీ. టాబో గుహలు తదితర ప్రదేశాలను చూడ వచ్చు.

 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!