ఎందరికో లైఫ్ ఇచ్చిన దర్శకుడు !

Sharing is Caring...
Bharadwaja Rangavajhala …….. 

తెలుగు కమర్షియల్ సినిమాకు ఎల్వీ ప్రసాద్ తర్వాత దిశానిర్దేశం చేసిన కె.ఎస్.ప్రకాశరావు ప్రజానాట్యమండలి నుంచి సినిమాల్లోకి ప్రవేశించినవాడే. ముందు నటన. ఆ తర్వాత దర్శకత్వం…కొన్ని సినిమాలకు నిర్మాణ సారధ్యం. కె.ఎస్.ప్రకాశరావుగా పాపులర్ అయిన  కోవెలమూడి సూర్య ప్రకాశరావు 1914 సంవత్సరం కృష్ణా జిల్లా కోలవెన్ను గ్రామంలో పుట్టారు.  చదువు పూర్తి చేసి కొంతకాలం ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేశారు. ఆ ఉద్యోగం చేస్తూనే ప్రజానాట్యమండలితో సాన్నిహిత్యం కొనసాగించారు.  ప్రజానాట్యమండలి వేదికల మీద నటన, దర్శకత్వం అన్నీ అలవడ్డాయి. విజయవాడలోనే గూడవల్లి రామబ్రహ్మంతో స్నేహం కుదిరింది.  అలా గూడవల్లి తీసిన అపవాదు, పత్ని సినిమాల్లో హీరో రోల్స్ చేశారు ప్రకాశరావు.
అయితే అప్పటికి ఆయన సెన్సేషనల్ డైరక్టర్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. సారధీ నుంచి బయటకు వచ్చిన కొందరు ప్రారంబించిన స్వతంత్ర పిక్చర్స్ బ్యానర్ లో వచ్చిన ద్రోహిలోనూ ప్రకాశరావు హీరో. ఆ చిత్రాన్ని ఎల్వీ ప్రసాద్ డైరక్ట్ చేశారు. అదే స్వతంత్ర పిక్చర్స్ కంపెనీని ప్రకాశ్ స్టూడియోస్ గా మార్చి సినిమా నిర్మాణం తో పాటు దర్శకత్వం చేయడం ప్రారంభించారు.  నెమ్మదిగా నటన తగ్గించి దర్శకత్వం మీదే కేంద్రీకరణ కొనసాగించారు.

ఎన్టీఆర్, ఎఎన్నార్ లాంటి స్టార్ హీరోలతో పెద్ద కమర్షియల్ వెంచర్లు చేయడం ప్రారంబించారు.  1948లో తీసిన ద్రోహి చిత్రం ద్వారా పెండ్యాల నాగేశ్వర్రావును సంగీత దర్శకుడుగానూ…51లో విడుదలైన దీక్ష ద్వారా ఆచార్య ఆత్రేయను సినిమా రంగానికి తీసుకువచ్చిన ఘనత కూడా కె.ఎస్.ప్రకాశరావుదే. తెలుగు సినిమాల్లో అగ్ర దర్శకులుగా వెలిగిన ఆదుర్తి సుబ్బారావు, వీరమాచినేని మధుసూదనరావులు ప్రకాశరావు దగ్గర పనిచేసినవారే. ప్రకాశరావు అన్న కొడుకు బాపయ్య, కొడుకు రాఘవేంద్రరావులను కూడా అగ్ర దర్శకులుగా తీర్చిదిద్దిన ఘనత ప్రకాశరావుదే.

ప్రకాశరావు నిర్మాత కూడా.  సుమారు 20 చిత్రాలను నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఆయన చిత్ర నిర్మాణం సాగింది. సుమారు నలభై చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.  కె.ఎస్.ప్రకాశరావు చివరి రోజుల్లో తీసిన చిత్రాలు కొత్తనీరు, ముద్దుల మొగుడు. కొత్తనీరు ప్రయోగాత్మక చిత్రం.ప్రశాంతమైన పల్లె జీవితంలోకి నాగరికత ప్రవేశిస్తే ఎంత అలజడి రేగుతుందో వివరిస్తారీ చిత్రంలో.  ఇది రీమేక్ మలయాళం నుంచీ లిఫ్ట్ చేశారు.  తన జీవిత కాలంలో ఎవరినీ నొప్పించి ఎరుగని వ్యక్తిత్వం ప్రకాశరావుది. అరవై ఏళ్ల సినీ జీవితంలో ప్రకాశరావు చేతుల మీదుగా జీవితాలు ప్రారంభించిన వారెందరో.
ప్రకాశరావు అభ్యుదయవాది. అలాగే కమ్మ కూడా. అందుకే అభ్యుదయం కమర్షియల్ యాంగిల్ రెండూ ఆయన లో చక్కగా కాపురం చేశాయి.

అన్నట్టు క్రియేటివ్ కమర్షియల్స్ కె. ఎస్ రామారావు కూడా ప్రకాశరావు గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు.  విచిత్రం ఏమిటంటే… ప్రకాశరావు గారు రేణుకాదేవి మహత్మ్యం లాంటి భక్తి రస చిత్రాన్ని సైతం మెప్పించారు. మల్టీస్టారర్లు, కమర్షియల్ బిగ్ వెంచర్లు చేయాలంటే కె.ఎస్. ప్రకాశరావు వైపు చూసేది ఇండస్ట్రీ. ఎన్టీఆర్, ఎఎన్నార్ లతో సినిమాలు తీస్తూనే శోభన్ బాబు, కృష్ణ లాంటి అప్ కమింగ్ హీరోలతోనూ పనిచేశారు. సత్యానికి సంకెళ్లు, ఇదాలోకం, కోడెనాగు లాంటి చిత్రాలు ప్రకాశరావు తెరకెక్కించినవే.  తను తీస్తున్న కథను అందంగా తెరమీద చెప్పగలగడం ఓ గొప్ప కళ.  ఎక్కడా బిగి సడలకుండా ప్రేక్షుకులను తన వెంట తీసుకెళ్లిపోగలగడమే ప్రకాశరావు గొప్పతనం.  కథకు అవసరమైతే ఎంత భారీగా అయినా సినిమా తీయగలరాయన.
విచిత్ర కుటుంబం చిత్రంలో ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబులను తీసుకుని కథను నడిపారు. 

కె.ఎస్.ప్రకాశరావు తీసిన చిత్రాలన్నీ మ్యూజికల్ గా పెద్ద విజయాల్ని సాధించినవే.  కొత్త తరహా కథలను ఎంపిక చేసుకోవడం ఆయన ప్రత్యేకత.  తాసీల్దారు గారి అమ్మాయి, చీకటి వెలుగులు లాంటి సెన్స్ బుల్ మూవీస్  ఆయన చేతినుంచి వచ్చినవే. న్యూటాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలోనూ ముందుండేవారు.  మహదేవన్ చేయాల్సిన చీకటివెలుగులుకు అప్పటికి న్యూకమ్మర్ అయిన చక్రవర్తితో మ్యూజిక్ చేయించి శభాష్ అనిపించారు.  అరవై సంవత్సరాల సినిమా జీవితంలో కె.ఎస్.ప్రకాశరావు సాధించిన అపురూప విజయం ప్రేమనగర్.

ప్రేమనగర్ విజయం సురేష్ సంస్ధను నిలబెట్టింది. తెలుగు సినిమా స్థాయి ని పాతాళానికి పడేసిన సినిమా కూడా అదే అని నాలాంటి కొందరు అన్నప్పటికీ సినిమా పెద్ద హిట్టు.  యాభై ఏళ్లు నిరాఘాటంగా ఆ సంస్ధ సినిమాలు తీయగలగడానికి అవసరమైన దన్నునిచ్చింది. అలా తెలుగు సినిమా చరిత్రలో ఓ సంచలన చిత్రం ప్రకాశరావు చేతుల్లో రూపుదిద్దుకోవడం విశేషం.  ఆ తర్వాత కూడా సురేష్ బ్యానర్ లో ప్రకాశరావు వారసులూ అద్భుత విజయాలనిచ్చారు. కోడూరి కౌసల్యాదేవి రాసిన హిట్ నవల ప్రేమనగర్ హక్కులను ముందు నిజామాబాద్ కు చెందిన శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి కొన్నారు.  అక్కినేని, కె.ఆర్.విజయ హీరోహీరోయిన్లుగా వి.మధుసూదనరావు డైరక్షన్ లో సినిమా తీయాలనేది ప్లాను. షడన్ గా ఆయన డ్రాప్ అవడంతో విషయం రామానాయుడు ముందుకు వచ్చింది.

ఆయన ప్రకాశరావును ఆశ్రయించారు. అంతే ప్రకాశరావు, ఆత్రేయ కల్సి అద్భుతమైన స్క్రీన్ ప్లే తయారు చేశారు. జనం కోరేది మనం చేయాలా మనం చేసేది జనం చూడాలా అనుకుని…  జనమే మనము మనమే జనము అని సద్దుకుని పరమ వ్యాపారం సిన్మాలు చేశారు ప్రకాశరావు. 1971 జనవరి 22వ తేదీన ప్రేమనగర్ ప్రారంభం అయ్యింది. కమర్షియల్ సక్సస్ కోసం నవలను యాభై శాతం పైగా మార్చుకున్నారు ప్రకాశరావు. రామానాయుడుకు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లమ్ కావడంతో ఎక్కడా రాజీపడదల్చుకోలేదు.  1971 సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమా.

రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. అయినా సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఐదు వారాల్లో పాతిక లక్షలు తెచ్చింది. ఫైనల్ గా యాభై లక్షల పిక్చర్ అయ్యింది.13 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది.  సురేష్ బ్యానర్ లో ప్రకాశరావు చేసిన చివరి చిత్రం కూడా నవలా చిత్రమే కావడం విశేషం. యద్దనపూడి సులోచనారాణి సూపర్ హిట్ నవల సెక్రటరీని అదే పేరుతో తెరకెక్కించారు ప్రకాశరావు. అదీ విజయం సాధించింది. ప్రేమనగర్ టీమే రిపీట్ కావడంతో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది సెక్రటరీ. హీరోగా అక్కినేని కెరీర్ ను స్పీడెక్కించింది. ప్రకాశరావు పిల్లలు మనవళ్లు అందరు సినిమా రంగం లోనే.

Read it also >>>>>>>     బాలు సంగీత బాణీలన్నీ సూపరే !

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!