Hard worker…………………..
ఆమధ్య యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ‘చమ్కీల అంగీలేసి ఓ వదినే’ పాటే వినిపించింది. ఎంతగానో పాపులర్ అయిన ఈపాట కు సినిమాలో కీర్తి సురేశ్ తగు విధంగా డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించింది.
తెరవెనుక పాటను హృద్యంగా ఆలపించిన అమ్మాయి పేరు ‘దీక్షితా వెంకటేశన్’. ‘ధీ’గా అందరికీ సుపరిచితురాలైన ఈ గాయని…. చిత్రపరిశ్రమ కొచ్చి పది ఏళ్ళు అవుతోంది. ఈ కాలంలో దీక్షిత ఎన్నో పాటలు పాడింది. తనకంటూ అభిమానులను సంపాదించుకుంది.
దీక్షిత పూర్వీకులు శ్రీలంక తమిళులు అయినా…ఆమె పుట్టి పెరిగింది మాత్రం సిడ్నీలో. దీక్షిత అమ్మమ్మకు కర్ణాటక సంగీతం వచ్చు.తల్లి మీనాక్షి అయ్యర్ కూడా సంగీతం నేర్పించేది, పాటలూ పాడేది. వారి ప్రభావంతో దీక్షితకు సంగీతంపై ఆసక్తి పెరిగింది.ఎప్పుడూ కూర్చుని సాధన చేయలేదు కానీ… శ్రద్ధగా వినేది.. తనకు తోచినట్లుగా పాడేది.
పదిహేనో ఏట దీక్షిత తండ్రి ‘పిజ్జా 2 ‘లో ‘డిస్కో ఉమన్’ అనే పాటను పాడించారు. ఆ తరువాతి నుంచీ ఆమెకు సంగీతం పై ఇష్టం పెరిగింది. దాంతో రకరకాల పాటలు వినడం, పాడటం.. ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టింది.
అలా తన ప్రపంచంలో సంగీతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది .. ఇస్తున్నది . రోజుకు అయిదు రకాల ఆల్బమ్ లు వింటూ… తనను తాను మార్చుకునేందుకు ప్రయత్నించింది. అప్పటినుంచి గాయనిగా మారింది.
దీక్షితా వెంకటేశన్ సవతి తండ్రి కూడా ప్రముఖ సంగీత దర్శకుడే. ఆయన పేరు సంతోష్ నారాయణన్.. ‘అట్టకత్తి’ ..’పిజ్జా’…. ‘పిజ్జా 2’.. ‘కబాలి’.. ‘పెంగ్విన్’ ..’దసరా’ వంటి చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. ‘దసరా’ సినిమాలోనే దీక్షిత చేత ‘చమ్కీల అంగీలేసి’ పాట పాడించారు. ఆపాట సూపర్ డూపర్ హిట్ అయింది. ‘పిజ్జా 2’ తో మొదలైన దీక్షిత సంగీత ప్రస్థానం విజయవంతంగా సాగుతోంది.
‘కోకిల’..’మద్రాసు’..’కబాలి’….’ఇరైవి’…’గురువు’ వంటి మరికొన్ని చిత్రాలలో పాటలు పాడింది … ‘జైలర్ లో ‘జుజుబీ’ పాట కూడా హిట్ అయింది. సంతోష్ నారాయణన్ తో పాటు ప్రముఖ సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా, ఏఆర్ రహమాన్,అనిరుద్ రవిచందర్, ప్రకాష్ కుమార్, విజయ్ నారాయణ్ లు ఆమెను ప్రోత్సాహిస్తున్నారు.
సంతోష్ నారాయణన్ పనిచేసే ప్రతి సినిమాలో దీక్షిత కు అవకాశం ఇస్తారని బయట వాళ్ళు అనుకుంటారు కానీ…అది నిజం కాదు. ఒక పాటను దీక్షిత పాడితేనే బాగుంటుందని ఆయన గట్టిగా నమ్మినప్పుడే ఆమెను పిలుస్తారు. ‘దసరా’లోని ‘చమ్కీల అంగీలేసి .. ఓ వదినే’… పాటను ధైర్యం చేసి సంతోష్ ఆమె చేత పాడించారు.
తెలంగాణ యాసలో పాడటం నిజంగా ఓ సవాలే.. దీక్షిత కూడా ఎంతో శ్రమించి ఆపాటను అచ్చం తెలంగాణ అమ్మాయి పాడినట్టే పాడారు. ఆపాట ద్వారా పెద్ద గుర్తింపు తెస్తుందని దీక్షిత అస్సలు ఊహించలేదు.
ఆ పాట విడుదలైన అతి తక్కువ సమయంలోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.. ఎక్కడ చూసినా ఆ పాటే వినబడింది. సోషల్ మీడియాలో ఈ పాటను ఫాలో అవుతూ వేలసంఖ్యలో రీల్స్ .. షార్ట్స్ వచ్చాయి.
ఇక ప్రపంచంలో తనకు ఇష్టమైన సంగీత దర్శకుల్లో మా నాన్న సంతోష్ నారాయణన్ ఒకరని .. ఆయన దగ్గర పనిచేయడం అదృష్టంగా భావిస్తానని దీక్షిత అంటోంది. దీక్షితకు ఆయన సవతి తండ్రే అయినా… చిన్నప్పటినుంచీ సొంత కూతురిలానే చూసుకున్నారు.
నాన్న ఇతర గాయకులతో సరదాగా, నవ్వుతూ పనిచేస్తారు కానీ నేను ఏ చిన్న పొరపాటు చేసినా వెంటనే అరిచేస్తారు. చూసేవాళ్లకు ఆయన నిజంగా కోప్పడుతున్నారని అనిపిస్తుంది నేను పాడే ప్రతి పాటలో నా శ్రమ వందశాతం కనిపించాలనేదే ఆయన కోపానికి కారణమంటున్నారు దీక్షిత.