An indelible mark on China………………………………….
చైనా సైనిక దళాలు బీజింగ్ నగరం మధ్యలో ఉన్న టియానన్మెన్ స్క్వేర్ దగ్గర వేలాది మంది ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులను హతమార్చాయి. చైనా ప్రభుత్వం చేసిన దారుణమైన ఈ దాడి ప్రజాస్వామ్య దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. సరిగ్గా ముప్పయి రెండేళ్ల కిందట (1989 జూన్ 4 ) ఈ ఘటన జరిగింది. “దేశంలో ప్రజాస్వామ్యం కావాలి. ప్రజలకు మరింత స్వేచ్ఛఅవసరం.
నియంతృత్వం నశించాలి. పత్రికా స్వేచ్ఛ కావాలి.” అని డిమాండ్ చేస్తూ 1989 ఏప్రిల్ నెల నుంచి చైనాలో ప్రజలు నిరసనలు, ఆందోళనలు మొదలుపెట్టారు.మెల్లగా ఆ ఉద్యమం ఊపందుకున్నది. ప్రజాస్వామ్య వాదులు , విద్యార్థులు మద్దతు పలుకుతూ ఆందోళనకు దిగారు. ముక్త కంఠంతో చైనా కమ్యూనిస్ట్ నాయకులు రాజీనామా చేయాలని నినదించారు. సెంట్రల్ బీజింగ్ కి తరలివచ్చారు.
దాదాపు మూడు వారాల పాటు నిరసనకారులు అక్కడే ఆందోళన కొనసాగించారు. అంతర్జాతీయ మీడియా కూడా ఈ నిరసనను కవర్ చేసింది.ఆందోళన మెల్లగా పలు నగరాలకు విస్తరించింది.చైనా ప్రభుత్వం మొదట్లో ఈ నిరసనలను తేలిగ్గా తీసుకున్నది. ఉద్యమం ఉధృతం కావడంతో ఎలాగైనా దాన్ని అణచివేయడానికి పూనుకుంది.
జూన్ నెల 4 వ తేదీన బీజింగ్‌లోని టియానన్మెన్ స్క్వేర్ వద్ద విద్యార్థులు, ప్రజలు భారీ ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. ఆరోజు సుమారు 10 లక్షల మంది అక్కడకు చేరుకున్నారు. నినాదాలతో బీజింగ్ నగరం మారు మ్రోగిపోయింది. ప్రభుత్వ నేతలకు సమాచారం అందింది. వెంటనే నిర్ణయం తీసుకున్నారు. వేలాది మంది సైనికులు రంగంలోకి దిగారు. మార్షల్ లా ప్రకటించి ఉక్కుపాదంతో ప్రజలను అణిచివేసే వ్యూహం పన్నారు. అంతే.సెంట్రల్ బీజింగ్ నలువైపులా సైన్యం మోహరించింది.
తెల్లవారు జామున సైనికులు , పోలీసులు జనంపై కాల్పులు మొదలు పెట్టారు. ఊహించని ఈ పరిణామానికి జనం బెంబేలెత్తి పోయారు.కొందరు అక్కడనుంచి తప్పించుకొని పోగా మరికొందరు ఎదురు దాడి చేశారు. సైనిక దళాలపై రాళ్లు రువ్వారు. మిలిటరీ వాహనాలకు నిప్పంటించారు. దీంతో సైనికులు చెలరేగిపోయారు.
ఆయుధాలు లేని ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడ నుంచి పరుగుదీశారు. ఉన్న వారిలో వేలమంది సైనికుల తుపాకీ గుండ్లకు బలైపోయారు. పదివేల మందిని అరెస్ట్ చేశారు. రక్తం ఏరులై ప్రవహించింది. ఈ సంఘటన వివరాలు బయటకు పొక్కకుండా ప్రెస్ పై నిషేధం విధించారు. అయినప్పటికీ నరమేధం గురించి ప్రపంచదేశాలకు తెలిసిపోయింది.
సోవియట్ అధ్యక్షుడు గోర్బచెవ్ ఈ సైనిక చర్యను ఖండించారు. ఇతరదేశాల నేతలు కూడా చైనా తొందరపడిందని అభిప్రాయ పడ్డారు. అమెరికా ఈ ఘటనను మానవ హక్కుల ఉల్లంఘన గా పేర్కొంది. చైనా పై ఆర్ధిక ఆంక్షలు ప్రకటించింది. ఇప్పటికి చైనా నాటి ఊచకోతల సమాచారం నెట్లో దొరకకుండా జాగ్రత్త పడింది. జూన్ 4 వ తేదీన సోషల్ మీడియాలో ఎలాంటి నిరసనలు రాకుండా నిషేధం విధించింది.
post updated on 6-6-22