పంచాయతనం అంటే ??

Sharing is Caring...

worship………………………….

ఒక చిన్నపేటిక లేదా పెట్టె లో ఐదుగురు దేవతామూర్తులను ఉంచి పూజలు చేయడాన్ని పంచాయతనం అంటారు. ఆ ఐదుగురు దేవతలు ఎవరంటే ?? ఆదిత్యుడు, . అంబిక, …  విష్ణువు, ..  … గణపతి, …  మహేశ్వరుడు. ఇక్కడ మూర్తులు అంటే విగ్రహాలు కావు. దేవతలకు ప్రతిరూపాలుగా భావించే చిన్న శిలలు. వీటిని ఒక్క చోటనే ఉంచుతారు.

ఆదిత్యుడికి ప్రతిరూపం స్ఫటికం.  పిల్లలు ఆడుకొనే గోలీకాయ ప్రమాణంలో ఉండే  స్ఫటికం ఆదిత్యుడుగా పూజలందుకొంటుంది. అంబికకు ప్రతిరూపంగా పూజించే రాయిలో స్వర్ణం ఉంటుందని అంటారు. ఇది చిన్న నాపరాయి వంటిది. 

నాపరాయి లో బంగారం రంగు గీతలు మెరుస్తూ కనిపిస్తుంటాయి. ఈ శిలను చంద్రశిల అని కూడా అంటారు. విష్ణువుకు సాలగ్రామం చిహ్నం. అందులోనూ స్వర్ణ రేఖ ఉంటుందని కొందరూ, జీవశక్తి ఉంటుందని మరి కొందరూ  చెబుతారు.  సాలగ్రామాలు గండకీ నదిలో లభిస్తాయి. ఇక గణపతి కి చిహ్నం ఒక జేగురు రంగు రాయి.

ఇలాంటి రాళ్లు శోణానదిలో లభిస్తాయి. శోణ అంటే ఎరుపు లేదా అగ్ని వర్ణం. శోణ అనేది మైనాక పర్వత ప్రాంతంలో పుట్టి గంగలో కలసే ఒక నది. మిథిలకు పోయే మార్గంలో ఉండే ఒక నదిని కూడా ఇదే పేరుతో పిలుస్తారు. 

మగధ దేశంలోని నది కనుక ఇది మాగధిగానే ప్రసిద్ధి చెందింది. నది నీరు ఎర్రగా కనిపిస్తుంది కనుక శోణానది అని పేరు వచ్చింది. ఈ నదిలో లభించే గణపతి రాళ్లను శోణభద్ర వినాయక మూర్తులని పిలుస్తారు. మహేశ్వరుడికి ప్రతి రూపం గా బాణ లింగం ఉంటుంది.  బాణ లింగాలు అంటే నర్మదా నదిలో లో లభించే రాళ్లు. ఇవి శివ లింగాకృతి గా ఉంటాయి. చిన్నవి, పెద్దవి అనేక పరిమాణాలలో ఉంటాయి.

పంచాయతనం సాధారణంగా పూజా గృహాలలో, దేవతార్చన మందిరాలలో ఉంటుంది. గర్భ గుడులలోనూ ఉండవచ్చు. ఐతే, గుడులలో ఉండే పంచాయతనం చిన్న విగ్రహాలతో కూడినది.. అక్కడ రాళ్లు పెట్టరు. కొత్తగా కట్టే గుడులలో  గర్భాలయం మూలలలో  చిన్న విగ్రహాలు కనిపిస్తుంటాయి.

ఒకప్పుడు దేవాలయాలలో పంచాయతనం ఉండేది కాదు. తిరుమల శ్రీవేంకటేశ్వరుడి ఆలయంలో గానీ, భద్రాచలం రామాలయంలో గానీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి లాంటి ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో గానీ మూలవరులు తప్పితే ఇలాంటి ఇతర విగ్రహాలు కనిపించవు.

పూర్వం గృహస్థులు ఈ దేవతా మూర్తుల పెట్టెను వేరే వూరు వెళ్ళేటపుడు తమ వెంట తీసుకొని వెళ్లే ఆచారం ఉండేది. ఈ ఆచారాన్ని బట్టి  ఈ శిలలు ప్రతిష్ఠ చేసేవి కావని స్పష్టమవుతుంది. పంచాయతనంలో ఐదుగురు దేవతా మూర్తులు ఉంటారు కనుక ఐదు రకాల   పంచాయతనాలు ఉండేవి.

సూర్య పంచాయతనం అంటే ఆదిత్యుడు మధ్యలో ఉంటాడు. చుట్టూ మిగతా దేవతలు  ఉంటారు.
మధ్యలో పార్వతి లేదా  శక్తి విగ్రహం, దాని చుట్టూ మిగతా మూర్తులు ఉంటే దానిని అంబికా  పంచాయతనం అంటారు. అలాగే విష్ణు, గణపతి, శివ పంచాయతనాలు ఏర్పడ్డాయి.

ఈ పంచాయతనంలో దేవతలు ఏ దిక్కుల్లో ఉండాలనేది కూడా ముఖ్యమని  అంటారు.  మధ్యలో శివుణ్ని ఉంచి చేసే పూజకు ‘శివ పంచాయతనం’ అని అంటారు. ఏ దేవతను మధ్యలో, ప్రధానంగా ఉంచి పూజ చేస్తారో, దానికి ఆ దేవత పంచాయతనంగా వ్యవహరిస్తారు.

పంచభూతాత్మక శరీరంతో పంచాయతన పూజ  చేయడం అంటే ..భగవంతుడు ఒక్కడే అన్న జ్ఞాన సముపార్జన సాధించడమే ప్రధాన లక్ష్యమని  పండిత వాక్కు.  పంచాయతన అర్చన చేసే ముందు ప్రాతఃకాల సంధ్యావందనం విధిగా ఆచరించాలి. పంచాయతనానికి నిత్య పూజలు చేస్తారు. ధూప దీపాది షోడశోప చారాలు ఉంటాయి.  ఈ రకమైన పూజా విధానాన్ని శంకరాచార్యులు వారు ప్రవేశపెట్టారు.  

శిష్టులు ఏ కాలంలోవారైనా అలా చేస్తుండవచ్చు. పంచాయతనానికి పూజలు చేయడంలో లోపం జరిగితే కష్టాలు వస్తాయనే నమ్మకం కొందరిలో ఉంది. ప్రస్తుతం ఈ పంచాయతనం పెద్దగా వాడుకలో లేదు. దైవభక్తి ఉన్నప్పటికీ  పూర్వీకులు మాదిరిగా  పూజలు,పునస్కారాలు పెద్దగా చేయడం  లేదు.

అందుకు కారణం బిజీ లైఫ్ .. జీవన విధానంలో మార్పులు రావడమే అని చెప్పుకోవచ్చు. ఇపుడు ట్రెండ్ కూడా మారింది. శిలలు బదులుగా పెట్టెలో  చిన్న విగ్రహాలను అమరుస్తున్నారు. ఇవి రెడీ మేడ్ గా కూడా అందుబాటులో ఉన్నాయి. తమ ఇష్ట దైవం ఉన్న పూజల పెట్టెలను కొనుక్కోని పూజా మందిరాలలో పెట్టుకుంటున్నారు.పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే పూజలు చేస్తున్నారు..  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!