లవ్వాల అడవుల్లో అద్భుతాలు !

Sharing is Caring...

Sheik Sadiq Ali …………………………

తెలంగాణ లోని ములుగు జిల్లా తాడ్వాయి ……కీకారణ్యం మధ్యలో ఉన్న అత్యంత పురాతన చారిత్రక ప్రదేశం లవ్వాల. ఎన్కౌంటర్ లతో దేశం దృష్టిని ఆకర్షించిన ఈప్రాంతం ఇప్పటివరకు చరిత్ర పరిశోధకుల దృష్టికి రాలేదు.అనంతమైన చరిత్రను,పురాతన జీవన అవశేషాలను తనలో నిక్షిప్తం చేసుకొని మీ రాక కోసం ఎదురు చూస్తోంది.తాడ్వాయి అడవుల్లోని దామరవాయి, మంగపేట దగ్గరలోని మల్లూరు,కొత్తూరు దేవునిగుట్ట ని మించిన అద్భుతాలు లవ్వాల అడవుల్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.

వందలాది ఆదిమ మానవుల సమాధులు ఇక్కడి అడవుల్లో ఉన్నాయి.ములుగు జిల్లా పస్రా నుంచి తాడ్వాయి వైపు మెయిన్ రోడ్డు మీద సరిగ్గా తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణం చేసి కుడివైపు ఆటవీ మార్గంలో ఐదు కిలోమీటర్ల దూరం వెళితే లవ్వాల వస్తుంది.ఊరు.. ఆ పక్కనే వాగు దాటి వెళితే అద్భుత ప్రపంచం సాక్షాత్కరిస్తుంది.

అక్కడి గుట్టలో అనేక పురాతన చారిత్రక ఆనవాళ్లు కన్పిస్తాయి.అక్కడి నుంచి దట్టమైన అడవిలో 10 నుంచి 12 కిలోమీటర్లు నడిస్తే పరిశోధకులకు సవాల్ విసిరే అద్భుతం ఉందని స్థానికులు అంటున్నారు. పెద్ద బండరాయి,నిలువెత్తుగా నలు చదరంగా ఉండే ఆ రాయి మీద ఆనాటి జీవన శైలిని ప్రతిబింబించే చిత్రాలు,పలు జంతువుల చిత్రాలు ఉన్నాయి.అది మామూలు విషయమే.

కానీ ఋతువులు మారినప్పుడు ఆ బొమ్మలు మారిపోతాయని, స్థానభ్రంశం చెందుతాయని స్థానికులు చెబుతారు. ఈసారి వెళ్ళినప్పుడు చూడాలి. మీరు ఎప్పుడు వచ్చినా చూపిస్తామని చెప్పారు. కనీసం ఏడాది,రెండేళ్లు దశల వారీగా పరిశోధిస్తే తప్ప ఆ రహస్యం ఏమిటో అంతు చిక్కదు. అలాగే అడవిలో మరో దిక్కుగా మూడు కిలోమీటర్లు కొండల్లో ప్రయాణిస్తే దేవునిగుట్ట లాంటి ఆలయం ఉందట.

కొత్తూరు,మల్లూరు,దామరవాయి లో కామన్ గా కనిపించే ఇసుక,గులకరాళ్ల మిశ్రమంతో తయారు చేసిన పెద్ద పెద్ద పలకరాళ్లు ఇక్కడ కూడా కనిపించాయి.ఇక్కడి ప్రకృతి రమణీయత అందరిని ఆకట్టుకుంటుంది. వెనక్కి తిరిగి రాబుద్ధి కాదు. వాగులు,వంకలు , పచ్చిక మైదానాలు,దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి.

కరోనా కాదు కదా దాని బాబు కూడా ఇక్కడికి రాలేదు.మాస్కులు,శానిటైజర్లు పక్కన పడేసి వెళ్లి ఎంజాయ్ చేయండి. అద్భుత ప్రపంచంలో విహరించండి.ఆనందాలను సొంతం చేసుకోండి. వీలైతే చరిత్రను తవ్వి తీయండి . లేదంటే ప్రకృతి ఒడిలో సేద తీరి రండి.

అన్నట్టు లవ్వాల గ్రామంలో 30 ఆదీవాసీ కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రజలంతా గుట్టలు, చెట్లు మధ్య ప్రశాంత జీవనం గడుపుతున్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ .. కూలీ పనులకు కూడా వెళ్తుంటారు. ఇక్కడి ప్రజలకు కరోనా వ్యాధి సోకలేదు. బయట ఊర్లకు వీరు అసలు వెళ్ళరు.ఈగ్రామంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ర్యాపిడ్ టెస్టులు చేయిస్తే నెగటివ్ వచ్చింది. ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!