Finally succeeded…………………………….
పట్టు వదలని విక్రమార్కునిలా పరిశ్రమించి మొత్తానికి విజయం సాధించాడు ప్రముఖ నటుడు సురేష్ గోపి. త్రిసూర్ లోక్‌సభ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోట.. అక్కడ 75 వేల ఓట్ల మెజారిటీతో సురేష్ గోపీ గెలవడం విశేషం. కేరళలో బీజేపీ గెలిచిన ఏకైక సీటు ఇది.
ఈ విజయం కేరళ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. బిజెపి రాష్ట్రంలో మరింతగా విస్తరించే ప్రయత్నాలకు ఇకపై ప్లాన్ చేస్తుంది. 2019 లోక్‌సభ.. 2021 అసెంబ్లీ ఎన్నికలలో సురేశ్ గోపీ పరాజయం పాలైనప్పటికీ త్రిస్సూర్‌లో పట్టుదల తో మరింత కృషి చేసి విజయం సాధించాడు. గోపి విజయం పూర్తిగా బీజేపీ విజయం కాదని విశ్లేషకులు అంటున్నారు.
రాజకీయాలకు అతీతంగా గోపి వ్యక్తిగత ఆకర్షణ .. నటుడిగా … ప్రముఖ టెలివిజన్ క్విజ్ షో .. యాంకర్‌గా గోపికి ఉన్న ఆదరణ … అభిమానుల ఫాలోయింగ్ ఈ విజయానికి కారణం అంటున్నారు. గోపీ కి యువత లో కూడా ఫాలోయింగ్ ఉంది.. నియోజకవర్గంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశారు. ఆయనను ప్రజలు మానవతావాదిగా చూస్తారు.
త్రిసూర్ లోక్‌సభ నియోజకవర్గంలో గత ఆరు ఎన్నికల్లో అధికార ఎంపీలు తరచూ ఓటమిని చవిచూశారు.
1952 నుండి 2019 వరకు త్రిసూర్ ఓటర్లు ఎల్‌డిఎఫ్ అభ్యర్థులను 10 సార్లు … యుడిఎఫ్ అభ్యర్థులను ఏడుసార్లు ఎన్నుకున్నారు.
ఇక బీజేపీ కూడా 18 నెలల ముందుగానే పార్టీ విజయానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. దీనికి తోడు నియోజక వర్గంలో గత ఐదేళ్ల కాలంలో సురేష్ గోపి చేసిన ప్రచారం అన్ని కలిసి వచ్చాయి.. తన విజయం తర్వాత సురేష్ గోపీ స్పందిస్తూ, నరేంద్ర మోడీ .. ఇందిరా గాంధీలను తన హీరోలుగా అభివర్ణిస్తూ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.
తనకు ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా ఓట్లు పడ్డాయని సురేష్ గోపీ చెప్పారు. తనకు వచ్చిన ఓట్లు వ్యక్తి గతంగా మాత్రమేనని, తన రాజకీయ భావజాలానికి కాదని సురేష్ గోపీ చెప్పడం విశేషం. ఎంపీ గా సురేష్ సాధించిన విజయానికి పెట్రోలియం,సహజవాయువు,టూరిజం శాఖల స్టేట్ మంత్రిగా ఆయనను ప్రధాని మోడీ మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.