Strict laws………………………….
సింగపూర్ లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా (Drug Trafficking) కేసులో ఓ మహిళను ఉరి తీశారు స్థానికంగా ఓ మహిళకు ఉరిశిక్ష అమలు చేయడం దాదాపు 20 ఏళ్లలో ఇది తొలిసారి. ఈ విషయంలో హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినప్పటికీ సింగపూర్ ప్రభుత్వం ఈ శిక్షను అమలు చేసింది.
‘సారిదేవి దామని (45)కి విధించిన ఉరిశిక్ష శుక్రవారం అమలయ్యింది 30 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసిన కేసులో సారిదేవి దోషిగా తేలడంతో.. 2018లో ఆమెకు ఉరిశిక్ష విధించారు. నేరారోపణలు, శిక్షకు వ్యతిరేకంగా ఆమె అప్పీల్ చేసుకున్నప్పటికీ.. 2022 అక్టోబరులో కోర్టు దాన్ని కొట్టేసింది. అధ్యక్షుడు సైతం ఆమె క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించారు.
2004లో యెన్ మే వూయెన్ (36) అనే మహిళకు ఇదే తరహా కేసులో ఉరిశిక్ష అమలైంది. ఇదిలా ఉండగా.. సింగపూర్‌లో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన మాదకద్రవ్యాల నిరోధక చట్టాలు అమలులో ఉన్నాయి. 500 గ్రాములకు మించి గంజాయి, 15 గ్రాములకు పైగా హెరాయిన్‌ను రవాణా చేస్తూ పట్టుబడితే మరణ శిక్ష వేస్తారు .
‘అనేక దేశాలు ఉరిశిక్ష విషయంలో వెనక్కి తగ్గినప్పటికీ.. సింగపూర్ మాత్రం మానవహక్కులను, ఇతర నిబంధనలను త్రోసిపుచ్చి డ్రగ్స్ సంబంధిత నేరాల్లో దోషులను ఉరి తీస్తుంది ‘ అని హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి.
డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో మరో దోషిని కూడా ఆగస్టు 3న ఉరితీసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.కరోనా మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల పాటు మరణశిక్షల అమలును నిలిపివేసిన సింగపూర్.. ఈ మధ్య మళ్లీ శిక్షలను అమలు చేస్తున్నది. అలా ఇప్పటివరకు 13 మందిని ఉరితీసింది. ఆ మధ్య ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు కూడా మరణశిక్ష అమలు చేసింది.