Dangerous giant hole ……………………
ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆ మంచు బిలం వేగంగా విస్తరిస్తోంది. రష్యా ( Russia)లోని సైబీరియా (Siberia)లో ఉన్న ‘బటగైకా’ (Batagaika) మంచు బిలం వేగంగా విస్తరించడం వల్ల అక్కడున్న జీవరాశికి ప్రమాదకరమని శాస్త్రవేత్తలుహెచ్చరిస్తున్నారు.
భూమి వేడెక్కడమే ఈ బిలం పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ బిలం చుట్టూ ఉన్న భూభాగం కరిగిపోతోంది. దీంతో ఈ మంచు బిలం చుట్టు పక్కలకు విస్తరిస్తోంది. బటగైకాకు ”మౌత్ టు హెల్” అనేది మరో పేరుతో పాటు ‘మెగా స్లంప్’ అనే శాస్త్రీయ నామం కూడా ఉంది.
బిలంపై అసమానంగా ఉన్న ఉపరితలాలు కనిపిస్తున్నాయి. నేల కోతకు గురై ఇవి ఏర్పడ్డాయి. మంచు బిలం పెరిగిపోతున్నకారణంగా చుట్టూ ఉన్న పట్టణాలు, రోడ్లు బీటలు వారుతున్నాయి. భూగర్భంలో ఉన్న పైపులైన్స్ దెబ్బతింటున్నాయి. ఈ పరిణామాల దృష్యా భవిష్యత్తులో ఇది ప్రమాదకరం కావచ్చనే వార్తలు వెలువడుతున్నాయి.
శాశ్వత మంచు కరిగిపోవడం సముద్ర మట్టం పెరగడానికి దోహదం చేస్తుంది, ఇది తీరప్రాంత నగరాలకు ప్రత్యక్ష ముప్పును కలిగిస్తుంది. సముద్ర మట్టాలు పెరగడం వల్ల వరదలు, కోత, ఉప్పునీటి చొరబాటు పెరిగే అవకాశం ఉంది. తీరప్రాంత పట్టణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు,జీవనోపాధి ప్రభావిత మవుతాయి
1960లో ఈ బిలాన్ని కనుగొన్నారు. ఈ ప్రాంతంలో విచక్షణారహితంగా అటవీప్రాంతాలను నిర్మూలించడంతో (deforestation) మంచు కరిగిపోయింది. దీని వల్ల నేల కోతకు గురవుతోంది. ఈ బిలం ఉపరితలం నుంచి 1 కిలోమీటర్ పొడవు, 100 మీటర్ల (328 అడుగులు) లోతుకు చేరుకుంది. ఈ రాక్షస గొయ్యి ప్రస్తుతం ఏడాదికి దాదాపు 30 మీటర్ల (100 అడుగులు) వేగంతో పక్కలకు విస్తరిస్తోంది..
ఈ మంచు బిలం పొరల్లో వేల సంవత్సరాలుగా మిలియన్ల టన్నుల పురాతన సేంద్రీయ కర్బనం దాగి ఉంది.ప్రస్తుతం వాతావరణం వేడెక్కడం వల్ల ఈ మంచు కరిగి, ఆ కార్బన్ కాస్తా మిథేన్, కార్బన్ డై ఆక్సైడ్ వంటి ప్రమాదకరమైన గ్రీన్‌హౌస్ వాయువులుగా మారి వాతావరణంలోకి విడుదలవుతోంది. ఇది భూమి మరింత వేడెక్కడానికి (గ్లోబల్ వార్మింగ్‌కు) కారణమవుతోంది.
రష్యా ప్రభుత్వం, శాస్త్రవేత్తలు బాటాగైకా క్రేటర్‌ను నేరుగా మూసివేయడానికి లేదా దాని విస్తరణను ఆపడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు.అయితే రష్యన్ స్పేస్ ఏజెన్సీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు ఉపగ్రహాల ద్వారా దీని విస్తరణ వేగాన్ని, విడుదలవుతున్న గ్రీన్‌హౌస్ వాయువుల పరిమాణాన్ని రోజూ లెక్కిస్తున్నాయి.
ప్రభుత్వం ఈ ప్రాంతం చుట్టుపక్కల దట్టమైన సైబీరియా అడవులను నరకడంపై కఠినమైన ఆంక్షలు విధించింది.ఈ మంచు ప్రాంతాల్లో నిర్మించే భవనాలు, రోడ్ల పునాదులను ప్రత్యేకమైన ‘థర్మోసిఫాన్స్’ (భూమిని చల్లగా ఉంచే పైపులు) టెక్నాలజీతో నిర్మించేలా కొత్త నిబంధనలు తీసుకువస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో నగరాలకు ముప్పు తగ్గించవచ్చని భావిస్తున్నారు.
బిలం పెరగడం ప్రమాదానికి సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం రష్యాలోని ఉత్తర, ఈశాన్య నగరాలపై క్రమంగా పడుతోంది. అధిక ఉష్ణోగ్రతలు బిలం పెరిగేందుకు మరింత ఊతమిస్తున్నాయి.
ఇది పాతాళానికి వెళ్లేందుకు ఒక మార్గమని స్థానికుల నమ్మకం. రష్యాలోని సఖా రిపబ్లిక్ ప్రజలు దీన్ని ”అండర్ వరల్డ్ గేట్‌వే”అని కూడా పిలుస్తారు. దీన్ని ‘కేవ్ ఇన్‘ అని కూడా అంటారు. ముందు ఇది లోయగా కనిపించింది. ఆ తర్వాత వేసవిలో భూమి కరిగిపోయి బిలం పెద్దగా మారడాన్ని స్థానికులు గమనించారు.

