పాదయాత్ర చేయడమంటే మాటలు కాదు. అందుకు గట్టి సంకల్పం ఉండాలి.శరీరం సహకరించాలి. ఓపిక ..సహనం కావాలి.పాదయాత్ర ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయో రావో ఖచ్చితంగా చెప్పలేం కానీ ప్రజలకు దగ్గర కావడానికి ఒక సాధనంగా మాత్రం ఉపయోగపడుతుంది.
పార్టీ ఆశయాలను జనంలోకి తీసుకువెళ్లేందుకు .. ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం తెలంగాణా లో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల అదే పని లో ఉన్నారు. తెలంగాణలో గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కారం పై అవగాహనను ఏర్పరచుకోవడానికి ప్రజా ప్రస్థానం పేరుతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు.
ఈ నెల 20న వైఎస్ షర్మిల రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తన పాదయాత్రను మొదలు పెట్టారు. మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా 4,000 కి.మీ మేరకు పాదయాత్ర చేస్తారు. గతంలో ‘జగన్ అన్న వదిలిన బాణం’ గా షర్మిల 2012.. అక్టోబర్ 18 న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించి 2013 ఆగస్టు 4 న ఇచ్ఛాపురంలో పూర్తి చేశారు. నాటి పాదయాత్రలో భాగంగా ఆమె 14 జిల్లాల్లో పర్యటించారు. 3,000 కి.మీ నడిచారు. తెలంగాణ లో కూడా కొన్ని జిల్లాల్లో పాదయాత్ర చేశారు.
మళ్ళీ తొమ్మిదేళ్ల అనంతరం షర్మిల ఇప్పుడు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా జనంలోకి వచ్చారు. షర్మిల పాదయాత్ర కు ప్రస్తుతం ప్రజల స్పందన బాగానే ఉంది. షర్మిల కూడా మార్గ మధ్యంలో ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్నారు. పెద్దలు .. పిల్లలతో మాట్లాడుతున్నారు. వివిధ వర్గాల సమస్యలు వింటున్నారు. పాఠశాలల కు వెళ్లి అక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తున్నారు. మహిళలతో ముచ్చటిస్తున్నారు.
సంక్షేమపథకాల గురించి ఆరా తీస్తున్నారు. అవకాశం ఉన్నచోట సీఎం కేసీఆర్ ఏడేళ్ల పాలనపై నిప్పులు చెరగుతున్నారు. రైతుల ఆత్మహత్యల గురించి ప్రస్తావిస్తున్నారు. రుణమాఫీ విధానం పై చురకలు వేస్తున్నారు. అదే రీతిలో అటు కాంగ్రెస్ .. బీజేపీలపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ షర్మిల తన పాదయాత్ర సందర్భంగా ఎదురైన అంశాలను వివరిస్తూ ప్రతిరోజు ఓ సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేస్తున్నారు.
2003 లో షర్మిల తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 1,475 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు సారధ్యంలోని టీడీపీ ప్రభుత్వాన్ని ఓడించి అధికార పగ్గాలు చేపట్టారు. 2017లో షర్మిల సోదరుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 13 నెలల్లో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు.2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
అంతకు ముందు 2012 లో చంద్రబాబు కూడా 2000 కిమీ మేరకు పాదయాత్ర చేసి 2014 లో ఎన్నికల్లో ఏపీ సీఎం అయ్యారు. పై మూడు పాదయాత్రలు ముగ్గురు నేతలను అధికారానికి దగ్గర చేశాయి. అప్పటి పరిస్థితులు .. రాజకీయ వాతావరణం..ఇతరత్రా అంశాలు వారికి కలసి వచ్చాయి.
పాదయాత్రలో వారు ఇచ్చిన హామీలు… నాటి ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకత ప్రజలపై కొంత ప్రభావం కూడా చూపాయి. ఇక వైఎస్ షర్మిల తన పాదయాత్ర ద్వారా ప్రజలను ఏమేరకు ప్రభావితం చేయగలరో ?చూడాలి. ప్రజలకు ఎంత దగ్గర కాగలరో ? లక్ష్యాలను ఎంతవరకు సాధించగలరో కాలమే నిర్ణయించాలి.
———-KNM