Mnr M…………………………………………………..
రాజకీయ పార్టీలకు, మీడియాకి పట్టని ఓ సునామీ సమాజంలో గట్టిగా ప్రబలుతోంది.రాజకీయ పార్టీలకు, నాయకులకు నిత్యం ఎత్తులు, పై ఎత్తులు. రాజకీయ చిత్తులు… పోల్ మేనేజ్మెంట్ మతలబులు. వీటిపైనే దృష్టి.మీడియా వారికి ఆదాయ మార్గాలు. అయిన వాళ్లకి వత్తాసులు పలికే పనిలో తలమునకలు.ఇక మేథావుల ముసుగుల్లో జెండాలు, అజెంజాల్లో చిక్కుకున్న వారు చేసే నష్టం అంచనాలకు అందనిది.
అందుకే ఒక వార్తను అర్ధం చేసుకోవడానికి నాలుగైదు ఛానెళ్లు లేదా పత్రికలు పరిశీలిస్తే కానీ సామాన్యులకు వాస్తవాలు తెలియని దుస్థితి. అందుకే సమాజంలో అత్యథికంగా ఉండే మధ్య తరగతి సమస్యలు ఎవరికీ కనిపించడం లేదు. కనిపించినా పట్టించుకునే పరిస్థితి లేదు. గత రెండేళ్లుగా యావత్ దేశంలో అత్యంత తీవ్ర స్థాయిలో చితికిపోయింది మధ్యతరగతి ప్రజలే. మధ్యతరగతి లో అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల వారు ఉంటారుగా.
కరోనా కొట్టిన దెబ్బకి ఇప్పుడు దేశంలో ఉన్నవి రెండే రెండు వర్గాలు… ఒకటి ధనిక వర్గం రెండోది పేద వర్గం.మధ్య తరగతి మటాష్ అయిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలు నడిచేవి మధ్యతరగతి ప్రజలపైనే. కానీ వీరి బాధలు ఎవరికీ పట్టవు. ఏ ప్రభుత్వానికి అవసరం లేదు. మధ్య తరగతి పరిస్థితి ఎంత దారుణమంటే…. వీరి బతుకులు ఎప్పటికీ త్రిశంకు స్వర్గమే. పైకి ఎగబాకలేరు. కిందకి దిగలేరు.
ప్రభుత్వాలు ప్రకటించే సంక్షేమ పథకాలకు అర్హత ఉండదు. కానీ ప్రతి పన్ను వసూళ్లకు ప్రధాన వర్గం వీరే. తెల్ల రేషన్ కార్డు దగ్గర నుంచి ప్రభుత్వాలు ప్రకటించే రాయితీల వరకూ ఏవీ వీరికి అందవు. కారణం సంక్షేమ పథకాలకు ప్రభుత్వాలు విధించే అర్హతలకు ఓ మెట్టు దూరంలో ఉండడమే వీరి దౌర్భాగ్యం. జస్ట్ మిస్ అన్నమాట. అలా అని ఆర్ధికంగా సూపర్ అనలేం.
కానీ…ప్రభుత్వాలు పెంచే ప్రతి ఆర్ధిక భారాన్ని మోసేది మధ్య తరగతి జీవులే. ఈ వర్గం బాధలు ఎవరికీ చెప్పుకోలేరు. చెప్పుకున్న పట్టించుకున్న వారు కరవే.ప్రభుత్వాలకు కేవలం పోల్ మేనేజ్మెంట్ మాత్రమే కావాలి. కులం, మతం, ప్రాంతం ఇలా కొంత సొంత ఓట్ బ్యాంక్ ఎలాగూ ఉంటుంది. మరోవైపు అధికారం కోసం కొన్ని వర్గాల వారికి ప్రకటించే తాయిలలతో గెలుపుకు కావాల్సిన ఓట్లు ఎలాగూ వస్తాయి అనే ఓ గట్టి నమ్మకం.
అందుకే మధ్యతరగతి చచ్చినట్లు ఓట్లు వేస్తారు. లేకపోయినా పెద్దగా పర్వాలేదు అనే ధీమా నేటి రాజకీయ పార్టీలది. ఉల్లి ధర నుంచి పెట్రోలు పెంపు వరకూ. ప్రయాణాల నుంచి ఇంటి పన్నుల వరకూ… చివరాఖరుకు చెత్త పన్ను వరకూ అన్నింటికీ బాధితులు మధ్య తరగతి జీవులే.కరోనా తర్వాత మధ్యతరగతి తీవ్ర స్థాయిలో చితికిపోయింది. బతుకు ఆందోళనలో ఉంది. మాకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. లక్షల కోట్ల తాయిలాల ప్రకటనల్లో మాకు దక్కేదెంత అనే భావన క్రమంగా ఈ వర్గంలో కలుగుతోంది.
ఊక దంపుడు ప్రసంగాలు కాదు నిజంగా… మాకు చేసేదేమైనా ఉందా అనే ప్రశ్న ప్రతి మధ్య తరగతి ఇళ్లల్లో చర్చకు వస్తోంది.అందుకే ఈ మధ్య కొన్ని రాజకీయ పార్టీలకు ఎన్నో ఏళ్ల నుంచి అభిమానులుగా ఉన్న వారు కూడా… ఏమో అనుకున్నాం గానీ… మాకు ఎవరూ ఏం చేసింది లేదు అన్న భావన స్పష్టంగా వినిపిస్తోంది.
గతంలో మీడియా అంతో ఇంతో సామాన్యుల ఇబ్బందులను పట్టించుకునేవి. గత కొన్నేళ్లుగా మీడియా ఆలోచనలే పూర్తిగా మారిపోయాయి. కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పూర్తిగా వెళ్లిపోయాయి. ఈరోజు మీడియా ఏం చెయ్యాలో… ఎలాంటి వార్తలు ఇవ్వాలో కార్పొరేట్ దిగ్గజాలు లేదా రాజకీయ పార్టీ నేతలు డిసైడ్ చేస్తున్నారు.
నిత్యం పత్రికల్లో, టీవీ స్క్రీన్ల పై చిందే నెత్తుటి వార్తలు, హాట్ హాట్ గా చూపించే రాజకీయ వార్తల వెనుక రగిలిపోతోన్న మధ్య తరగతి వర్గం ఆవేదనలు, వారి ఆవేశం ఓ స్థాయిలో ఒక్కసారిగా తన్నుకు వస్తాయి.గ్రౌండ్ రియాలిటీకి భిన్నంగా వెళ్లే ఏ వ్యవస్థైనా చెల్లించక తప్పదు భారీ మూల్యం. ఇదే చరిత్ర చెప్పిన పాఠం.