అన్నపై పోరాటానికి షర్మిల సై అంటుందా ?

Sharing is Caring...

Is Sharmila ready to fight?…. 

కాంగ్రెస్‌ ఇపుడు ఏపీలో గెలుపు పై దృష్టి పెడుతోంది. ఇన్నాళ్లూ నిస్తేజంగా, నీరసంగా ఉన్న కాంగ్రెస్‌ ఏపీ లో ఎలాగైనా అధికారం సాధించాలని వ్యూహ రచన చేస్తోంది. ఈ వ్యూహాల్లో భాగంగా వైఎస్ షర్మిలను పార్టీ లో చేర్చుకుని  పీసీసీ చీఫ్ గా చేయాలని  భావిస్తున్నట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ కి మద్దతు పలికింది. ఈ క్రమంలో షర్మిలను ఏపీ లో జగన్ పై ప్రయోగించాలని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారు.

2014 లో ఉమ్మడి రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ యే కారణమని ఆగ్రహించిన ఓటర్లు నాటి ఎన్నికల్లో ఆపార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు. చాలామంది నేతలు జగన్ పార్టీ లో చేరిపోయారు. కొందరు తెలుగుదేశం వైపు మొగ్గు చూపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది.  ఏపార్టీ లోకి వెళ్ళ లేని నేతలు సైలెంట్ గా ఉండిపోయారు.కొందరైతే రాజకీయాలకు దూరమై పోయారు. అలాంటి వారందరిలో కదలిక తెచ్చి మళ్ళీ పార్టీ కి పూర్వవైభవం తేవాలని కాంగ్రెస్ నేతల యోచన. 

ఇందుకోసం రకరకాల  కసరత్తులు  చేస్తున్నారు. అయితే పార్టీ ని ముందుండి నడిపించే నేత .. ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు లేకపోవడం తో షర్మిల సరైన వ్యక్తి అని కాంగ్రెస్ అధిష్టానం  భావిస్తున్నట్టు చెబుతున్నారు. వైఎస్ వారసురాలే మళ్లీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాడానికి వస్తే.. కాంగ్రెస్ క్యాడర్ వెనక్కి వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు. 

షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్ ను చేసి   ప్రత్యేక హోదా నినాదంతో  ప్రచారం చేద్దామని..  అప్పుడు కాంగ్రెస్ వర్గాలన్నీ వెనక్కి వస్తాయని రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారంటున్నారు. షర్మిలకు రాజకీయంగా బలం అందించడానికి కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతామని కూడా హామీ ఇచ్చారని చెబుతున్నారు. 

షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ అయితే ఇప్పటికిప్పుడు అద్భుతాలే జరుగుతాయని చెప్పలేం . కానీ  కాంగ్రెస్ బలపడుతుంది. అధికారంలోకి రాకపోవచ్చు కానీ.. పూర్వ వైభవం దిశగా మొదటి అడుగు పడుతుంది. అది జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు. ఈ సారి ఎన్నికల్లో భారీగా మార్పులు చేర్పులతో కాంగ్రెస్ నేతలు ప్రయోగాలు చేస్తున్నారు. వైసీపీ లో ఆదరణ దక్కని నేతలకు  కాంగ్రెస్ తలుపులు తెరచి స్వాగతం చెప్పవచ్చు..

ఇక షర్మిల సోదరుడిపై పోరాటానికి సిద్ధం అవుతారా అన్నదానిపై ఇప్పటి వరకు  క్లారిటీ రాలేదు. ఆమె ఎటూ తేల్చుకోలేని పరిస్థితి లో ఉన్నారని అంటున్నారు.  షర్మిల కాంగ్రెస్ లో చేరితే మటుకు రాజకీయాలు రసవత్తరం గా మారతాయి.  

కాగా  జగన్, షర్మిల మధ్య రాజీ కుదిరిందని.. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రాకపోచ్చని కూడా మరో వైపు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జగన్, షర్మిలలతో మాట్లాడి వారి మధ్య ఉన్న ఆస్తుల పంచాయతీని సెటిల్ చేశారని అంటున్నారు. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తే వైసీపీకి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో.. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు జగన్ అంగీకరించారని అంటున్నారు.

ఇదే నిజం అయితే షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రారు.  ఇపుడు జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానం గానే మిగిలిపోవచ్చు. అలాంటపుడు షర్మిల ను కాంగ్రెస్ ఎలా ఉపయోగించుకుంటుంది అనేది పెద్ద ప్రశ్న. షర్మిల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి. వైఎస్ కుటుంబం లో గతంలో వివేకానంద రెడ్డి కాంగ్రెస్ నుంచి  విజయమ్మ పై పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!