ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను ఆంక్షల చట్రంలో ఇరికించేందుకు అమెరికా వ్యూహ రచన చేసింది. కఠినమైన ఆర్థిక, ఎగుమతులను ఆపే ఆంక్షలను అమెరికా ప్రకటించింది. ఆసియా, ఐరోపాలోని మిత్రదేశాలతో కలిసి వీటిని అమలు చేసే దిశగా పావులు కదిపింది. ఈ ఆంక్షల దెబ్బతో పుతిన్ దారికి వస్తాడా ? తన నిర్ణయాలను మార్చుకుంటాడా ?లేదా అని ప్రపంచదేశాలు ఎదురుచూస్తున్నాయి.
అంతర్జాతీయ వేదికలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఏకాకి చేయాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బైడెన్ శ్వేతసౌధంలో ప్రకటన కూడా చేశారు. ” కఠిన ఆంక్షలతో పుతిన్‌ను కట్టడి చేయకపోతే ఆయనకు మరింత ధైర్యంతో వ్యవహరిస్తారు. పుతిన్ యుద్ధాన్ని ఎంచుకొన్నారు కాబట్టి దాని పర్యవసానాలను కూడా ఎదుర్కోవాలి అని జో బైడెన్ వ్యాఖ్యానించారు.
రష్యా కు చెందిన 10 ఆర్థిక సంస్థలను ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చారు. దొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించిన వెంటనే రష్యాపై అమెరికా తొలివిడత ఆంక్షలు విధించింది.తొలుత రష్యా చిన్నతరహా బ్యాంకులను లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా ఈ సారి మటుకు రష్యా ఆర్థిక వ్యవస్థకు మూల స్థంభాలైన సంస్థలను టార్గెట్ చేసింది.
ఈ కఠిన ఆంక్షల పరిధిలోకి రష్యాలోని దాదాపు 80శాతం బ్యాంకులు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. రష్యా అగ్రగామి బ్యాంకులు స్బెర్ బ్యాంక్, వీటీబీ బ్యాంకులు డాలర్లను ఉపయోగించి ఎటువంటి లావాదేవీలు నిర్వహించకుండా స్తంభింప జేశారు. దీంతోపాటు అమెరికన్లు ఆ బ్యాంకులతో ఎటువంటి లావాదేవీలు జరపకూడదని ఆంక్షలు పెట్టారు.
బ్రిటన్ కూడా వీటీబీ బ్యాంకు ఆస్తులను స్తంభింపజేసే యత్నాల్లో ఉంది.దీని వలన రష్యా ఆర్ధిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడుతుంది. ఈ ఆంక్షల మూలంగా రష్యాలో వ్యాపారాలకు పెద్ద దెబ్బ తగులుతుంది. డాలర్లు, యూరోలు, పౌండ్లు, యెన్‌లు ఉపయోగించే అవకాశం ఉండదు.
ఈ రెండు పెద్ద బ్యాంకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 90 ఆర్థిక సంస్థలు, వాటి అనుబంధ సంస్థలను ఈ ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చినట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. తద్వారా అష్టదిగ్బంధనం చేసినట్టు అవుతుంది. బ్యాంకింగ్‌తోపాటు మెటల్,టెలి కమ్యూనికేషన్స్, రైల్వేవంటి సంస్థలకు ఆంక్షలు వర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా రంగాల్లోకి పశ్చిమ దేశాల బ్యాంకుల పెట్టుబడులు అడ్డుకుంటున్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆంక్షల ప్రకటన వెలువడగానే ఐరోపా సమాఖ్య కూడా రష్యాను కట్టడి చేసే ప్రయత్నాలకు పూనుకుంది. ఐరోపా సమాఖ్య విధించే ఆంక్షలు రష్యా ఆర్థిక రంగాన్ని, ఇంధన, రవాణా, మిలటరీ రంగాలను ప్రభావితం చేస్తాయి. అలాగే సరుకుల ఎగుమతులను నియంత్రణ, ఎగుమతులకు ఆర్థిక సహాయం, వీసా పాలసీ విధానాల్లో మార్పులు వస్తాయి.
ఐరోపా సమాఖ్య విధించే ఆంక్షలకు సభ్యదేశాలు ఆమోద ముద్ర కూడా వేశాయి. అమెరికా మిత్రదేశాలు రష్యా నుంచి ఎగుమతులను అడ్డుకునే యత్నాలు మొదలుపెట్టాయి. ఈ ఆంక్షలు రష్యాపై దీర్ఘకాల ప్రభావం చూపవచ్చు. వీటిని ఎదుర్కొనేందుకు పుతిన్ ఏం చేస్తాడో ? చూడాలి. ఏ వ్యూహాలను అనుసరిస్తాడో ? ఒకటి రెండురోజులు పోతే కానీ తేలదు.

