తెలంగాణ లో తెరాస కు బలమైన ప్రత్యర్థిగా బీజేపీ ఎదుగుతోంది. మొన్నటి దుబ్బాక , నిన్నటి గ్రేటర్ ఎన్నికల ఫలితాలను చూస్తే ఎవరికైనా అదే అభిప్రాయం కలుగుతుంది. గతంలో నాలుగు సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో దాదాపు 50 స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీ ఆస్థాయిలో పుంజుకున్నదంటే ముందుముందు తెరాసకు ప్రత్యామ్నాయంగా నిలబడే దిశగా ఎదుగుతున్నదనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ బలహీన పడిన నేపథ్యంలో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పు కేవలం హైదరాబాద్ కే పరిమితం కాలేదు. దేశ వ్యాప్తంగా వస్తోన్న మార్పు. ఒకప్పుడు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలు కనిపిస్తే ప్రజలు వాటినే ఆదరించారు. తెలుగు దేశం,తెరాస, వైసీపీ అలా అధికారం దక్కించుకున్నపార్టీలే.
ఇక ప్రాంతీయ పార్టీలు బలహీన పడుతున్న క్రమంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఓటర్లకు కనిపిస్తోంది. గత పదేళ్ల కాలంలో తెలంగాణ లో కాంగ్రెస్ బలహీన పడింది. ఆ పార్టీ కేంద్ర నాయకత్వంకూడా రాష్ట్ర శాఖలను బలోపేతం చేసే విషయం పట్టించుకోవడం మానేసింది. ఇదే అదనుగా పలు రాష్ట్రాలలో బీజేపీ పాగా వేసే పనిలో పడింది. అందులో భాగం గానే పార్టీ శాఖలకు అన్నివనరులు సమకూరుస్తోంది. దీంతో బలోపేతమైన బీజేపీ శాఖలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి.
బీజేపీ గ్రేటర్ లో సత్తా చూపుతామని ముందే చెప్పింది. ఆవిధంగానే దూకుడుగా ప్రచారం చేపట్టింది. కేసీఆర్ సర్కార్ పై దుమ్మెత్తి పోసింది. పెద్ద నాయకులు , మంత్రులు కూడా ప్రచారానికి రావడం ఆ పార్టీకి కలసి వచ్చింది. కాగా ఈ ఎన్నికల్లో తెరాస పై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో, ఉద్యోగ వర్గాల్లో ఉన్న వ్యతిరేకత బయటపడింది. అందుకే ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి.
అసలు పోలింగ్ లోనే ఓటర్లలో కొంత నిర్లిప్తత కనిపించింది. స్థానిక నేతలపట్ల సదభిప్రాయం లేకపోవడం కూడా ఒక కారణం. అదేవిధంగా ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదన్న అసంతృప్తి పెల్లుబికింది. సగటు నగరవాసి మంచిరోడ్లు, పరిశుభ్రత, సక్రమమైన డ్రైనేజీ వ్యవస్థ, ప్రజారోగ్యం తదితర సౌకర్యాలను ఆశించడం సహజం. ఆయా అంశాలపై తెరాస సర్కార్ పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపలేదు. ముఖ్యం గా డ్రైనేజీ వ్యవస్థ తీరు పై ప్రజలు గుస్సాగా ఉన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయింది. వరద నీరు పోయే మార్గం లేక ప్రజలు రోజులు తరబడి నీళ్లలోనే కాపురం చేశారు. భయాందోళనలకు గురయ్యారు. ఈ అసంతృప్తిని బీజేపీ చక్కగా సొమ్ము చేసుకుంది. అందుకే ఆపార్టీకి సీట్లు బాగా పెరిగాయి. అంటే ప్రజలు మెల్లగా ఆపార్టీ వైపు దృష్టి మరలుస్తున్నారనే చెప్పుకోవాలి.
అయితే బీజేపీ నేతలు చెబుతున్నట్టు తెరాస పతన స్థాయిలోకి ఏమీ పడిపోలేదు. పతనం కాలేదు. జస్ట్ ఇదొక హెచ్చరిక మాత్రమే. ఇప్పటికైనా తెరాస నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకుని ముందుకు సాగితే మంచిది. ఇక ఈ విజయం తో బీజేపీ దూకుడు మరింత పెరగడం ఖాయం. త్వరలో రాబోయే సాగర్ ఉపఎన్నిక లో కూడా ఆ పార్టీ సత్తా చూపేందుకు సమాయత్తమౌతోంది.
————- KNM